Published : 16 May 2017 02:30 IST

‘జీవన’ పటుత్వం!

‘జీవన’ పటుత్వం!

స్తంభన లోపం.. తరచుగా కనబడే సమస్యే. దీని బారినపడ్డవారిలో చాలామంది ఉద్దీపన మందులను కొనుక్కొని వేసుకుంటుంటారు కూడా. కానీ అంతకన్నా ముందు బరువు తగ్గటం, పొగ మానెయ్యటం వంటి తేలికైన జీవనశైలి మార్పులను ప్రయత్నించటం మంచిది. వీటితో స్తంభన లోపం తగ్గటమే కాదు.. మునుపటి పటుత్వమూ తిరిగి రావొచ్చు. మంచి జీవనశైలి మార్పులు మొత్తంగా ఆరోగ్యం మెరుగుపడటానికీ తోడ్పడతాయి. కాబట్టి స్తంభన లోపానికి దారితీసే మధుమేహం, గుండెజబ్బు, జీవక్రియలు నెమ్మదించటం వంటి వాటి ముప్పు సైతం తగ్గుతుంది.

* నడక: రోజుకు కేవలం 30 నిమిషాల సేపు నడిచినా చాలు. స్తంభన లోపం ముప్పు 41% తగ్గుతుంది! స్తంభన సమస్యతో బాధపడుతున్న వూబకాయ, మధ్యవయసు పురుషులు ఒక మాదిరి వ్యాయామం చేస్తే శృంగార సామర్థ్యం తిరిగి పుంజుకుంటున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం నొక్కిచెబుతోంది.

* ఆరోగ్యకర ఆహారం: పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, చేపలు ఎక్కువగా.. మాంసం ఉత్పత్తులు, పాలిష్‌ పట్టిన ధాన్యాలు తక్కువగా తినేవారికి స్తంభన లోపం తగ్గుముఖం పడుతున్నట్టు మసాచుసెట్స్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది.

* విటమిన్‌ బి12: ఇది లోపిస్తే స్తంభన సమస్య తీవ్రం కావొచ్చు. దీర్ఘకాల బి12 లోపం వెన్నెముకకు హాని చేస్తుంది. అంగంలోని రక్తనాళాలకు సమాచారాన్ని అందజేసే నాడులు కూడా దెబ్బతింటాయి. కాబట్టి విటమిన్‌ బి12 దండిగా లభించే సాల్మన్‌, ట్రౌట్‌ రకం చేపలు.. పెరుగు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. త్రేన్పులు, అజీర్ణం వంటి సమస్యల మూలంగా ఆహారం ద్వారా లభించే బి12ను సరిగా గ్రహించుకోలేనివారికి విటమిన్‌ మాత్రలు, బి12ను కూర్చి తయారుచేసిన పదార్థాలు బాగా ఉపయోగపడతాయి.

* విటమిన్‌ డి: దీని మోతాదులు తగ్గితే స్తంభన లోపం ముప్పు 30% పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల రోజూ ఒంటికి కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటమూ మేలే. దీంతో విటమిన్‌ డి తగినంత లభిస్తుంది.

* బరువు తగ్గటం: వూబకాయంతో రక్తనాళాల సమస్య, మధుమేహం ముప్పులు పెరుగుతాయి. ఇవి రెండూ స్తంభన లోపానికి దారితీసేవే. అలాగే ఒంట్లో కొవ్వు మోతాదు పెరిగితే హార్మోన్లు కూడా అస్తవ్యస్తమవుతాయి. ఇదీ స్తంభన సమస్యకు దారితీస్తుంది. నడుం చుట్టుకొలత 32 అంగుళాలు గలవారితో పోలిస్తే.. 42 అంగుళాలు గలవారికి స్తంభన లోపం తలెత్తే అవకాశం 50% ఎక్కువ!

* రక్తనాళాలు భద్రం: రక్తపోటు, రక్తంలో చక్కెర, చెడ్డ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అధికంగా.. మంచి కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీంతో ఇతరత్రా సమస్యలు దాడిచేయటంతో పాటు పటుత్వం కూడా తగ్గుతుంది. కాబట్టి పొగ మానెయ్యటం, మద్యం మితిమీరకుండా చూసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. అవసరమైతే మందులు వేసుకోవటమూ తప్పనిసరి. దీంతో రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడి, స్తంభన లోపం ముప్పూ తగ్గుతుంది.

* చిగుళ్లపై కన్ను: స్తంభన లోపానికీ చిగుళ్ల సమస్యకూ సంబంధం ఉంటున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. చిగుళ్ల సమస్య ఒంట్లో దీర్ఘకాల వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఇది అంగంలోని రక్తనాళాల లోపలి పొర కణాలనూ దెబ్బతీస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు