Published : 20 Jun 2017 02:10 IST

యోగారోగ్య ప్రాప్తిరస్తు!

యోగారోగ్య ప్రాప్తిరస్తు!
అతి పురాతనమైనదే గానీ అమూల్యమైంది!
అతి ప్రాచీనమైనదే గానీ నిత్యనూతనమైంది!!
రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం

అవును.. కాలాతీత ఆరోగ్య సాధనం యోగ. రుషుల కాలం నుంచీ భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో అంతర్భాగమైన చైతన్య గంగ. పతంజలి మహర్షి సిద్ధం చేసిన ‘అష్టాంగ యోగ’ మూలం నుంచి ఎన్నెన్నో కొంగొత్త చిగుళ్లను తొడుక్కుంటూ విశ్వరూపం ధరించింది. హఠయోగ, విన్యాసయోగ, పవర్‌యోగ, అయ్యంగార్‌ యోగ.. ఇలా పలు శాఖలుగా విస్తరించి ‘అంతర్జాతీయ’ వైభవాన్ని సంతరించుకుంది. పద్ధతేదైనా మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయటమే యోగా లక్ష్యం. ఆసనాలతో- అన్ని అవయవాలను సున్నితంగా మర్దన చేస్తూ.. ధ్యానంతో- చంచలమైన మనసుకు కళ్లెం వేసి కూచోబెడుతూ.. ప్రాణాయామంతో- ప్రాణశక్తి కేంద్రాలను ఉద్దీపింప జేస్తూ.. శారీరకంగా, మానసికంగా మనిషిని అజేయశక్తిగా మలుస్తుంది. యోగా అనగానే అదేదో కఠోరమైన సాధనగానే చాలామంది భావిస్తుంటారు. నిజానికి చాలా చాలా తేలికైన ఆసనాలతోనూ ఎన్నెన్నో ప్రయోజనాలను పొందొచ్చు. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే.. అటు శారీరక ఆరోగ్యాన్నీ, ఇటు మానసిక ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. నేటి ఉరుకుల పరుగుల జీవితం మోసుకొస్తున్న ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని సముపార్జించుకోవచ్చు. ఆధునిక జీవనశైలితో ముడిపడిన ఎన్నో జబ్బులను దూరం చేసుకోవచ్చు. అందుకే జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా.. యోగా ప్రాశస్త్యంతో పాటు కొన్ని తేలికైన ఆసనాలతో కూడిన సమగ్ర కథనం ఈ వారం మీకోసం.

రీరం, మనసు.. రెండూ పరస్పర ఆధారితాలు. ఒకదానికి అనుగుణంగా మరోటి స్పందిస్తాయి. శరీరానికి ఏ సమస్య తలెత్తితే మనసు తల్లడిల్లిపోతుంది. ఉత్సాహం సన్నగిల్లి.. నిరాశ, నిస్పృహలు ఆవరించేస్తాయి. అలాగే మనసుకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే శరీరం జావగారిపోతుంది. శక్తి సన్నగిల్లి.. అలసట, నిస్సత్తువ ముంచుకొచ్చేస్తాయి. అందుకే వ్యాయామాల మాదిరిగా కాకుండా యోగా శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తుంది. మనం శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. ఇందుకోసం మనం రకరకాల వ్యాయామాలు చేయొచ్చుగానీ ఇవేవీ మనసును తాకలేవు. కానీ యోగా మనసును కూడా స్పృశిస్తుంది. శరీరాన్ని, మనసును.. రెండింటినీ సమతౌల్యంలోకి తీసుకొస్తుంది. అసలు యోగా అర్థం కూడా ఇదే. యోగం అనే శబ్దం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టుకొచ్చింది. దీనర్థం కలయిక, ఐక్యం, జత చేయటం అనే! యోగాలో ఆసనాలు చాలా ముఖ్యమైనవీ, కీలకమైనవీ. ఇవి శరీర సామర్థ్యాన్ని పెంపొందించి.. అన్ని పరిస్థితులను తట్టుకునేలా సిద్ధం చేస్తాయి. అయితే ఆసనాలే కాదు.. శ్వాసపై శ్రద్ధ, ధ్యానం కూడా యోగాలో ప్రధానమైన భాగాలే. వీటిని ఆసనాలకు తోడు చేసుకొని ప్రాణశక్తిని ఉత్తేజితం చేయటం యోగా ప్రత్యేకత. మరే ఇతర వ్యాయామాలతోనూ ఇలాంటి ప్రయోజనం లభించదు. కాబట్టే యోగా యుగయుగాలుగా తన విశిష్టతను నిలబెట్టుకుంటూ వస్తోంది.

సరళ సాధనం
యోగా చాలా తేలికైంది, సరళమైంది. ఆసనాలు ఒకసారి నేర్చుకుంటే చాలు. ఎవరికివారే చేసుకోవచ్చు, ఎలాంటి ఉపకరణాలూ అవసరం లేదు. పెద్దగా సమయం కూడా పట్టదు. క్రమంగా సాధన చేస్తే జీవితాంతం తోడుగా నిలుస్తుంది. యోగాను ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయొచ్చు. అయితే కొన్ని పద్ధతులు పాటించటం మంచిది.
* యోగాసనాలను ఉదయం పూట.. అదీ పరగడుపున చేయటం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4-5 గంటల తర్వాత.. అల్పాహారం తీసుకుంటే 2-3 గంటల అనంతరం చేయాలి.
* యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి ధరించరాదు.
* గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో.. లేదా కిటికీలు, తలుపులు తెరచి ధారాళంగా వెలుతురు వస్తున్న గదుల్లో.. సమతలంగా ఉన్నచోట యోగా చేయాలి.
* ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయటం ఎంతో మేలు.
* చాప, దుప్పటి, శుభ్రమైన వస్త్రం.. ఏదైనా పరచి దాని మీద కూచొని ఆసనాలు వేయాలి. నేల, గచ్చు, బండల మీద వేయకూడదు.
* యోగా చేస్తున్నప్పుడు మధ్యలో మల, మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే బలవంతాన ఆపుకోకూడదు. విసర్జన అనంతరం తిరిగి కొనసాగించాలి. దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు.
* యోగాసనాలను నెమ్మదిగా, అలసట లేకుండా తాపీగా చేయటం చాలా ముఖ్యం. తొందర పనికిరాదు.
* యోగా చేయటం ముగిశాక తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి.

అయితే..
కొన్ని ఆసనాలు గర్భిణులు వేయటం తగదు. అందువల్ల గర్భిణులు నిపుణుల సలహా మేరకే యోగ సాధన చేయాలి. అలాగే క్యాన్సర్‌, రెటీనా విడిపోవటం, మధుమేహం, మూర్ఛ, గుండెజబ్బు, అధిక రక్తపోటు, హెచ్‌ఐవీ, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, శారీరక వైకల్యం వంటి వాటితో బాధపడేవారు కూడా నిపుణులను సంప్రదించి తగిన ఆసనాలను ఎంచుకొని, సాధన చేయాలి.


తేలికైన ఆసనాలతోనూ..

యోగాసనాలు అనగానే అవేవో చాలా కష్టమైనవని అనుకోవాల్సిన పనేమీ లేదు. తేలికైన ఆసనాలతోనూ మంచి ప్రయోజనాలు పొందొచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యాలను సొంతం చేసుకోవచ్చు.రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

శారీరక దృఢత్వానికి..

భుజంగాసనం

* ముందుగా బోర్లా పడుకొని శరీరాన్ని తిన్నగా చాచాలి.
* రెండు పాదాల వేళ్లు నేలకు ఆనించి ఉంచాలి. పాదాల వేళ్లు, మడమలు కలిసి ఉండాలి.
* రెండు అరచేతులను ఛాతీకి రెండు వైపులా గట్టిగా నేలకు ఆన్చాలి.
* నెమ్మదిగా శ్వాసను లోనికి తీసుకుంటూ.. తల, ఛాతీ, నాభి, పొట్టను పైకెత్తుతూ పడగలా లేపాలి.
* కొద్దిసేపు అలాగే ఉన్నాక.. శ్వాసను వదులుతూ యథాస్థితికి రావాలి.
* ఇలా రెండు, మూడు సార్లు చేయాలి.
ప్రయోజనం: ఛాతీ, గుండె, వూపిరితిత్తులు, వెన్నెముక, చేతులు, నడుము బలోపేతమవుతాయి. దీంతో వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు దూరమవుతాయి. వెన్నుపాములోని శక్తి కేంద్రాలు ఉత్తేజితమై నాడీవ్యవస్థ సైతం పుంజుకుంటుంది. దీన్ని రోజుకు 1-2 నిమిషాల సేపు చేసినా మంచి ఫలితం కనబడుతుంది.

తాడాసనం

* పాదాల మధ్య కాస్త ఎడం ఉండేలా నిలబడాలి.
* కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్లలో జొప్పించాలి.
* చేతులను సాగదీస్తూ వీలైనంతవరకు పైకి లేపాలి.
* శరీరం కూడా నిటారుగా సాగేలా చూసుకోవాలి.
* 30-60 సెకండ్ల తర్వాత యథాస్థితికి రావాలి.
ప్రయోజనం: వెన్ను, కాళ్లు, చేతులు, నాడులు.. అన్నీ బాగా సాగుతాయి. దీంతో ప్రతి నాడీ శక్తిని పుంజుకుంటుంది. బద్ధకం, అలసట దూరమవుతాయి. తాడాసనాన్ని పడుకొని కూడా కాళ్లను, చేతులను సాగదీస్తూ చేయొచ్చు.

కటి చక్రాసనం 

* కాళ్లను ఎడంగా ఉంచి నిటారుగా నిలబడాలి.
* రెండు చేతులను ముందుకు చాచాలి.
* పాదాలను కదల్చకుండా చేతులను కుడివైపునకు తీసుకురావాలి. శ్వాసను వదులుతూ మెడ, రొమ్ము, నడుమును తిప్పుతూ వెనక్కి చూడాలి.
* కొద్దిసేపు అలాగే ఉండి.. శ్వాసను పీల్చుతూ చేతులను, తలను మధ్యస్థితికి తీసుకురావాలి.
* తర్వాత చేతులను ఎడమవైపు తీసుకెళ్తూ ఇలాగే చేయాలి.
ప్రయోజనం: ఇది నడుము భాగం బలోపేతం కావటానికి తోడ్పడుతుంది. నడుము రెండు వైపులకూ బాగా ముడిపెట్టినట్టు తిరుగుతుంది కాబట్టి చిన్నపేగుల్లోని వ్యర్థాలు తేలికగా పెద్దపేగులోకి ప్రవేశిస్తాయి కూడా. ఫలితంగా ఒంట్లోంచి మలినాలన్నీ పూర్తిగా బయటకుపోతాయి.

మానసిక దృఢత్వానికి

పద్మాసనం

* ముందుగా కూచొని కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. అలాగే ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి.
* రెండు చేతులను మోకాళ్లపై ఉంచాలి. చూపుడు వేలును బొటనవేలి కణుపునకు తాకించాలి. మిగతా మూడు వేళ్లను తిన్నగా చాచాలి.
* కనుబొమల మధ్య గానీ ముక్కు కొసపై గానీ దృష్టిని నిలపాలి.
* శ్వాసను నెమ్మదిగా, గాఢంగా పీల్చుకొని, వదులుతుండాలి.
* పాదాలను తొడలపై ఉంచటం వీలుకానివారు.. ఒక కాలి పాదాన్ని రెండో కాలి తొడపై ఉంచి, రెండో పాదాన్ని మొదటి కాలి మోకాలు కింద పెట్టి కూడా చేయొచ్చు.
ప్రయోజనం: ధ్యానానికి ఇది ఉత్తతమైన ఆసనం. దీంతో గుండె, వూపిరితిత్తులు, తలకు రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏకాగ్రత కుదురుతుంది. ఆలోచనలు, భావోద్వేగాలు నియంత్రణలోకి వస్తాయి. జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెంపొందుతాయి.

శశాంకాసనం

* వజ్రాసనంలో కూచోవాలి. రెండు చేతులను నడుము వెనకకు తీసుకొచ్చి ఒక చేతితో రెండో చేతి మణికట్టును పట్టుకోవాలి.
* మనసును మెదడు మీద కేంద్రీకరించి.. శ్వాసను వదులుతూ ముందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆనించేందుకు ప్రయత్నించాలి. పిరుదులను మడమల మీది నుంచి కదపకూడదు.
* కొద్దిసేపు అలాగే ఉండి.. శ్వాస పీలుస్తూ యథాస్థితికి రావాలి. ఇలా 5-6 సార్లు చేయాలి. వీలును బట్టి సంఖ్యను పెంచుకోవచ్చు.
ప్రయోజనం: ఇది కోపం తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. కోపం నియంత్రణలో ఉండటం వల్ల గజిబిజి ఆలోచనలు కూడా తగ్గుతాయి.

శాంతి ఆసనం (శవాసనం)

* వెల్లకిలా పడుకొని.. కాళ్లను చేతులను ఎడంగా పెట్టాలి.
* కళ్లు మూసుకొని, నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి.
* కాళ్లు, చేతులు, మెడ, వెన్ను.. ఇలా ఒకో భాగంపైకి ధ్యాసను మళ్లించాలి.
* ఒక్కొక్కటిగా అవయవాలన్నీ విశ్రాంతిని పొందుతున్నట్టు మనసులో భావించాలి.
ప్రయోజనం: ఇది శరీరాన్ని, మనసును పూర్తి విశ్రాంతి దశలోకి తీసుకెళ్తుంది. క్రమంగా సంపూర్ణ ఆనందస్థితికి చేరుస్తుంది. ఫలితంగా భావోద్వేగాలు కుదుటపడతాయి. అనవసర ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. అలసట, ఒత్తిళ్లు దూరమవుతాయి.

రోగనిరోధక శక్తికి 

యోగాలో మరో ముఖ్యమైన భాగం ప్రాణాయామం. శ్వాస మీద ధ్యాసను నిలిపి.. దీర్ఘంగా శ్వాసను తీసుకొని, నెమ్మదిగా వదిలేయటం ఇందులో కీలకాంశం. దీంతో శ్వాస మీద మంచి పట్టు లభిస్తుంది. ఇది మనసును బలోపేతం చేయటంతో పాటు పిరితిత్తుల సామర్థ్యాన్నీ పెంపొందిస్తుంది. ఫలితంగా రోగనిరోధశక్తి కూడా పుంజుకుంటుంది. ప్రాణాయామంలో రకరకాల పద్ధతులున్నాయి.

అనులోమ, విలోమ ప్రాణాయామం

* నిటారుగా కూచొని, కళ్లు మూసుకోవాలి. కొద్దిసేపు కనుబొమల మధ్య దృష్టిని సారించాలి.
* కుడిచేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూయాలి. ఎడమ ముక్కు రంధ్రం నుంచి ముందుగా లోపలున్న గాలిని నెమ్మదిగా బయటకు వదలాలి. తర్వాత ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలిని లోనికి పీల్చుకోవాలి.
* అనంతరం ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరం వేలితో మూసి.. కుడి ముక్కు రంధ్రం నుంచి నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి. తిరిగి కుడిముక్కు రంధ్రం నుంచి గాలిని పీల్చుకోవాలి.
* దీంతో ఒక క్రమం పూర్తవుతుంది. ఇలా వీలును బట్టి ఎన్ని క్రమాలైనా చేసుకోవచ్చు.

భ్రమరీ ప్రాణాయామం

* నిటారుగా కూచొని, రెండు చెవుల్లో రెండు వేళ్లను జొప్పించాలి. మోచేతులను భుజాలకు సమానంగా ఉండేలా చూసుకోవాలి.
* గాలిని లోనికి పీల్చుకొని.. కొద్దిసేపు అలాగే పట్టి ఉంచాలి. తర్వాత గొంతుతో తుమ్మెదలా చప్పుడు చేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా గాలిని బయటకు వదలాలి. నోటిని తెరవకూడదు.

సూర్యభేది, చంద్రభేది

* సూర్యభేదిలో- కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాసను తీసుకొని, ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇది ఒంట్లో వేడిని పుట్టిస్తుంది. కాబట్టి దీన్ని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయాలి. ఆస్థమా, అలర్జీ వంటి శ్వాస సమస్యలు గలవారికిది బాగా ఉపయోగపడుతుంది.
* చంద్రభేదిలో- ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసను తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది కాబట్టి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చేయాలి. జ్వరం, అధిక రక్తపోటు వంటివి గలవారికిది బాగా ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు