వారాంత యోధులైనా..

రోజూ వ్యాయామం చేయటానికి కొందరికి సమయం దొరకదు. దీంతో చాలామంది వారాంత సెలవుదినాల్లో....

Published : 08 Aug 2017 01:04 IST

వారాంత యోధులైనా..

రోజూ వ్యాయామం చేయటానికి కొందరికి సమయం దొరకదు. దీంతో చాలామంది వారాంత సెలవుదినాల్లో ఒకేసారి తీవ్రంగా వ్యాయామాలు చేసేస్తుంటారు. ఇలాంటి ‘వారాంత యోధులకు’ కండరాలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. అందుకే రెండు మూడు రోజుల వరకు నొప్పులతో సతమతమవుతుంటారు. అయినప్పటికీ వీరికి వ్యాయామం వల్ల ఒనగూడే ప్రయోజనాలూ బాగానే లభిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఒకట్రెండు సార్లే అయినా వారానికి కనీసం 75 నిమిషాలు, ఒక మాదిరిగా 150 నిమిషాలు వ్యాయామాలు చేసేవారి ఆయుష్షు పెరుగుతున్నట్టు వెల్లడి కావటం విశేషం. అంతగా వ్యాయామాలు చేయనివారితో పోలిస్తే ఇలాంటి వారాంత యోధులకు ఎలాంటి కారణంతోనైనా మరణించే ముప్పు 30% తగ్గుముఖం పడుతోంది. గుండెజబ్బుతో సంభవించే మరణం ముప్పు 40%, క్యాన్సర్‌తో తలెత్తే మరణం ముప్పు 18% తగ్గుతోంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి ఇంతకన్నా మెరుగైన ఫలితాలే కనబడుతున్నప్పటికీ.. వారాంత యోధులతో పోలిస్తే తేడా మరీ అంత ఎక్కువగా ఏమీ ఉండకపోవటం గమనార్హం. కాబట్టి రోజూ వ్యాయామానికి సమయం దొరకటం లేదని బాధపడేవారు కనీసం వారాంతాల్లోనైనా వ్యాయామాలకు ఉపక్రమించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కఠినమైన వ్యాయామాలు చేసేముందు ఒకసారి డాక్టర్ల సిఫారసు తీసుకొని, శరీరం సహకరించినంతమేరకే వ్యాయామం చేయాలనే విషయం మరవరాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని