ఆనందయోగం ఆరోగ్యభాగ్యం!

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. కాదు కాదు.. సంతోషం సంపూర్ణ ఆరోగ్యం అంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. సంతోషం, ఆనందం, ఉల్లాసం. పేరు ఏదైతేనేం? ఇలాంటి సానుకూల ధోరణులు మానసికంగానే కాకుండా శారీరకంగానూ మంచి ఫలితాలు చూపిస్తున్నాయని.....

Published : 20 Mar 2018 01:21 IST

నేడు అంతర్జాతీయ ఆనంద దినం
ఆనందయోగం ఆరోగ్యభాగ్యం!

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. కాదు కాదు.. సంతోషం సంపూర్ణ ఆరోగ్యం అంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. సంతోషం, ఆనందం, ఉల్లాసం. పేరు ఏదైతేనేం? ఇలాంటి సానుకూల ధోరణులు మానసికంగానే కాకుండా శారీరకంగానూ మంచి ఫలితాలు చూపిస్తున్నాయని చెబుతున్నాయి అధ్యయనాలు. ఆరోగ్యవంతమైన జీవితానికి, మరింత ఎక్కువకాలం బతకటానికి తోడ్పడుతున్నాయని వివరిస్తున్నాయి. మరి సంతోషించటానికి సంకోచమెందుకు? ఆనందించటానికి అడ్డంకులెందుకు? ‘అంతర్జాతీయ ఆనంద దినం’ సందర్భంగా ఉరుకుల పరుగుల వ్యవహారాలను కాస్త పక్కనపెట్టి ఆనందయోగంపై ఓ కన్నేయండి. ఒకింత సంతోష మాధుర్యాన్ని చవిచూడండి.
‘‘జీవిత పరమార్థం, ఉద్దేశం ఆనందమే. మనిషి పరమోత్కృష్ట లక్ష్యం, అతడి ఉనికి అంతం కూడా అదే’’ -ప్రముఖ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ 2 వేల సంవత్సరాల క్రితం పలికిన మాట. ఇప్పటికీ ఇది సత్యంగానే నిలుస్తోంది. అవును. మనిషి ఏ పనిచేసినా ఆనందం కోసమే. అదే లేకపోతే అన్నీ వ్యర్థమే. అందుకే ఆనందం, సంతోషం కోసం మనిషి అనాదిగా వెంపర్లాడుతూనే ఉన్నాడు. మనం ఆనందాన్ని అనుభవించగలం. చేతలతో వ్యక్తీకరించగలం. కానీ ఆనందమంటే ఏంటని అడిగితే మాత్రం బిక్క మొహం వేస్తాం. ఆనందాన్ని ఒక్క మాటలో నిర్వచించటం అసాధ్యం. ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు పెదవులపై మెదిలే చిరునవ్వు. కోరుకున్నది చేతికందినపుడు కళ్లల్లో మెరిసే సంతోషం. చిన్ననాటి స్నేహితులను చూసినపుడు ఉరకలెత్తే ఉత్సాహం. చిరకాలంగా ఊరిస్తున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో అణువణువునా తొణికిసలాడే ఆత్మ విశ్వాసం. అన్ని అవరోధాలను ఎదిరించి జీవిత మాధుర్యాన్ని చవిచూశామన్న సంతృప్తి. ఇలాంటి సానుకూల భావోద్వేగాలన్నీ సంతోషం, ఆనందానికి ప్రతీకలే. అయితే ఇవి కేవలం మానసిక పరమైన భావనలు మాత్రమే కాదు. వీటి ప్రభావాలు మనసుకు కొత్త హుషారును, హాయిని కలిగించటంతోనే ఆగిపోవు. శారీరకంగానూ గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆనందం, సంతోషం వంటివి జీవితాన్ని సానుకూల దృక్పథంతో, ఆశావహ దృష్టితో చూడటానికి తోడ్పడతాయి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం.. మరింత ఎక్కువగా వ్యాయామం చేయటం వంటి జీవనశైలి, అలవాట్లకూ దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచేవే. ఆరోగ్యం బాగుంటే మనసూ బాగుంటుంది. ఇది ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది కూడా.
జన్యువులు కీలకం
ఆనందం, సంతోషం చాలావరకూ వ్యక్తిగత అనుభూతులే. మన సంస్కృతి, పుట్టి పెరిగిన పరిస్థితులు, చుట్టుపక్కల పరిసరాలు.. వీటి మూలంగా ఎదురైన అనుభవాల వంటివన్నీ వీటిని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు.. ఇందులో మన జన్యువుల పాత్ర కూడా కీలకమే. వేర్వేరు అండాలు ఫలదీకరణ చెందటం వల్ల పుట్టిన కవలలతో పోలిస్తే ఒకే అండం ఫలదీకరణ చెందటం వల్ల జన్మించిన కవలల్లో ఆనంద స్థాయులు ఒకే విధంగానూ, అవి మరింత స్థిరంగానూ ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆనందం విషయంలో జన్యువులు పాలు పంచుకుంటున్నట్టు ఇవి చెప్పకనే చెబుతున్నాయి. ఆనందం, హాయి వంటి భావనలను కలిగించటానికి తోడ్పడే డొపమైన్‌ అనే నాడీ రసాయనం మన మెదడులో ఎక్కువగా లేదా తక్కువగా ఉత్పత్తి కావటానికి ఈ జన్యువులు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

అధ్యయనాల దన్ను

 మంచి అలవాట్లు, సానుకూల దృక్పథం అబ్బేలా చూడటమో, ఆత్మ విశ్వాసం ఇనుమడించేలా చేయటమో.. కారణమేదైనా ఆనందం వల్ల మనకు ఎన్నెన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయని అధ్యయనాలూ రుజువు చేస్తున్నాయి.
గుండెకు రక్షణ
సంతోషం, ఆనందం గుండె నుంచి పుట్టుకురాకపోవచ్చు. కానీ గుండెకు మాత్రం ఎంతో మేలు చేస్తాయి. ఉల్లాసంగా, సంతోషంగా గడిపేవారిలో గుండె వేగం, రక్తపోటు తక్కువగా ఉంటున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అధ్యయనాలు పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. వీరి రక్తంలో గుండెజబ్బు ముప్పును పెంచే ఫైబ్రినోజెన్‌ ప్రోటీన్‌ స్థాయులూ తక్కువగా ఉంటున్నట్టు తేలింది. గుండెజబ్బు ముప్పు పొంచి ఉన్నవారిలోనూ ఆనందం, సంతోషం మంచి ప్రభావాలు చూపుతున్నట్టు 2008లో చేసిన మరో అధ్యయనంలో బయటపడింది. వీళ్లు ఆనందంగా, సంతోషంగా ఉన్న రోజున పరీక్షించగా- అంతకుముందు కన్నా గుండె మరింత సమర్థంగా పనిచేస్తున్నట్టు బయటపడటం విశేషం. ఆనందం వంటి సానుకూల భావనల మూలంగా గుండెజబ్బు ముప్పు 22% తగ్గుతున్నట్టు 2010లో నిర్వహించిన దీర్ఘకాల అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.
రోగనిరోధకవ్యవస్థ బలోపేతం
ఆనందానికీ, రోగనిరోధకవ్యవస్థకూ మధ్య బలమైన సంబంధమే ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి. కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు 2003లో ఒక వినూత్న ప్రయోగం చేశారు. సుమారు 350 మందిని ఎంచుకొని జలుబు వైరస్‌ ప్రభావానికి గురిచేసి.. ఐదు రోజుల పాటు విడిగా ఉంచారు. ఆనందంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండేవారు జలుబుకు అంత త్వరగా లొంగకపోవటం గమనార్హం. దీనికి కారణమేంటని పరిశోధకులు మరింతగా శోధించారు కూడా. మరో మూడేళ్ల తర్వాత కొందరు విద్యార్థులకు హెపటైటిస్‌ బి టీకా ఇచ్చి పరిశీలించారు. సానుకూల భావోద్వేగాలు ఎక్కువగా గలవారిలో టీకా సంబంధ యాంటీబాడీలు రెండు రెట్లు ఎక్కువగా కనిపించటం ఆశ్చర్యకరం. ఇది రోగనిరోధకశక్తి చాలా సమర్థంగా పనిచేస్తుందనటానికి సూచిక. ఆనందం కణ స్థాయిలోనూ పనిచేస్తోందని ఇది నొక్కిచెబుతోంది.
ఒత్తిడిని ఓడిస్తుంది
ఒత్తిడి మన మానసిక స్థితిని దెబ్బతీయటమే కాదు. ఒంట్లో హార్మోన్లను అస్తవ్యస్తం చేయటం దగ్గర్నుంచి రక్తపోటు పెరగటం వరకూ ఎన్నెన్నో దుష్ప్రభావాలకూ దారితీస్తుంది. ఆనందం ఇలాంటి ప్రభావాలు నియంత్రణలో ఉండటానికి, వీటి నుంచి త్వరగా కోలుకోవటానికి తోడ్పడుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవారిలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిజోల్‌ హార్మోన్‌ స్థాయులు 23% తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తం గడ్డకట్టేలా చేసే ప్రోటీన్‌ మోతాదులు సైతం 12 రెట్లు తక్కువగా ఉంటున్నట్టూ వెల్లడైంది. ఒత్తిడి అనివార్యమైన పరిస్థితుల్లోనూ ఆనందం మంచి ప్రభావం చూపుతోంది. కొందరు విద్యార్థులను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి పరిశీలించగా.. సంతోషం వంటి సానుకూల భావోద్వేగాలు గలవారిలో గుండె వేగం, రక్తపోటు చాలా త్వరగా మామూలు స్థాయికి చేరుకున్నట్టు తేలింది.
జబ్బులు, వైకల్యంతోనూ పోరు
తీవ్రమైన, దీర్ఘకాల జబ్బుల నుంచి కోలుకోవటానికీ ఆనందం తోడ్పడుతుంది. ఆనందంగా గడుపుతున్నామని, జీవితం మీద సంతృప్తి చెందుతున్నామని చెప్పినవారిలో చాలామందికి దీర్ఘకాల జబ్బుల ముప్పు 1.5 రెట్లు తక్కువగా ఉంటున్నట్టు 2008లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆత్మ విశ్వాసం, ఆనందం, ఉత్సాహం వంటివి ఎక్కువగా గల వృద్ధులను దుర్బలత్వం అంత త్వరగా దరిజేరటం లేదని మెక్సికోలో నిర్వహించిన మరో అధ్యయనం పేర్కొంటోంది. ఇలాంటి వృద్ధులకు పక్షవాతం ముప్పు సైతం తక్కువేనని, ముఖ్యంగా మగవారిలో ఇది మరింత స్పష్టంగా కనబడుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఆయుష్షు పెంచుతుంది
మన జీవనకాలం పెరగటంలోనూ ఆనందం, సంతోషం కీలకపాత్ర పోషిస్తాయి. గతంలో కొందరు నన్‌లపై చేసిన ప్రముఖ అధ్యయనమే దీనికి పెద్ద నిదర్శనం. నన్‌లు 20 ఏళ్ల వయసులో  రాసుకున్న ఆత్మకథాత్మక వ్యాసాలను పరిశోధకులు క్షుణ్నంగా విశ్లేషించారు. ఆనందంగా, సంతోషంగా ఉన్నామని పేర్కొన్నవారు 7-10 సంవత్సరాలు ఎక్కువగా జీవించినట్టు గుర్తించారు. ఈ విషయం 2011లో నిర్వహించిన అధ్యయనంలోనూ మరోసారి రుజువైంది. ఆనందం స్థాయులు ఎక్కువగా గల వృద్ధులకు మరణించే ముప్పు 35% వరకు తగ్గుతున్నట్టు తేలటం గమనార్హం.

సర్వతోముఖాభివృద్ధి సాధనం

 దీ ఆనందమని మనం కచ్చితంగా నిర్వచించలేకపోవచ్చు గానీ ఎలాంటి ప్రతికూల ఉద్రేకాలు లేని స్థితిని ఆనందం, సంతోషమని చెప్పుకోవచ్చు. రోజూ మనం రకరకాల ఉద్రేకాలకు లోనవుతుంటాం. కోపం, బాధ, విచారం వంటివి శరీరానికి చాలా హాని చేస్తాయి. అదే సంతోషం, ఆనందం వంటి సానుకూల భావోద్వేగాలు ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. రక్తపోటు, గుండె వేగం తగ్గటం వంటి మంచి మార్పులకు బీజం వేస్తాయి. ఆనందం మూలంగా శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తాయి. ఇది జబ్బుల నివారణకూ, ఆయుష్షు పెరగటానికీ  దోహదం చేస్తుంది. మానసికంగానూ చక్కటి ప్రయోజనాలు ఒనగూడుతాయి. మనసు కుదురుగా ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు వెల్లువెత్తుతాయి. దీంతో అణువణువునా ఉత్సాహం, ఉల్లాసం తొణికిసలాడతాయి. ఆనందం, సంతోషం అనేవి కేవలం శరీరం, మనసుకే కాదు.. మనం సామాజికంగా సర్దుకుపోవటానికీ ముఖ్యమే. ఆనందంగా ఉన్నప్పుడు మెదడులో నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాలు సమర్థంగా పనిచేస్తాయి. దీంతో నలుగురితో సర్దుకుపోయే గుణం మెరుగవుతుంది. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించేవారు నలుగురితో సరిగా కలవలేరు. వీళ్లు కోపం, విచారం వంటి వాటిని బయటకు ప్రదర్శించలేకపోయినా కూడా వాటి ఛాయలు ముఖంలో కదలాడుతూనే ఉంటాయి. ఇలాంటివారు నలుగురితో కలవటంలో ఇబ్బంది పడతారు. మనసు విప్పి మాట్లాడలేరు. దీంతో సామాజిక సంబంధాలూ దెబ్బతింటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేటంటే- ఆనందమనేది మనిషి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే సాధనం. ఇది శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా.. ఇలా అన్ని రకాలుగా మనిషి ఉన్నతికి తోడ్పడతుంది.’’

ఆనంద రహస్యమేంటి?

 నం ఆనందంగా ఉండటమనేది చాలావరకు జన్యువుల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే కొందరు సహజంగానే ఇతరుల కన్నా ఎక్కువ ఆనందంగా, సంతోషంగా కనిపిస్తుంటారు. పుట్టుకతోనే సంక్రమించే ఈ జన్యువులను, వాటి ప్రభావాలను మనం మార్చలేకపోవచ్చు. అంతమాత్రాన చింతించాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే దాదాపు 40% మంది తమ అలవాట్లు, అభిరుచులు, ప్రవర్తనల వంటి వాటి ద్వారానే సంతోషంగా జీవిస్తున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆనందం మీద హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం దీర్ఘకాలంగా.. 1938 నుంచీ అధ్యయనం చేస్తూనే ఉంది. ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నవారిలో కొందరి వయసు ఇప్పుడు 90 ఏళ్లు దాటింది కూడా. ప్రతి రెండేళ్లకూ వీరి నుంచి వివిధ రకాల సమాచారాన్ని సేకరించి పరిశోధకులు విశ్లేషిస్తూనే వస్తున్నారు. మనిషి ఆనంద స్థాయుల విషయంలో కొన్ని రకాల గుణాలు, ప్రవర్తనలు దోహదం చేస్తున్నట్టు ఇందులో గుర్తించారు.

గతం గత: వైఫల్యాలను, దెబ్బతిన్న సంబంధాలను అదేపనిగా తలచుకొని బాధపడితే ఒరిగేదేమీ లేదు. జరిగిందేదో జరిగిపోయిందని గుర్తించి, వర్తమానంలో జీవించటం నేర్చుకునేవారు మరింత ఆనందంగా ఉంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటివాళ్లు జీవితం చిన్నదనే విషయాన్ని గ్రహించి, తమకు సంతోషం కలిగించే విషయాలపై మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇది మరింత హాయిగా జీవించటానికి తోడ్పడుతోంది.

సామాజిక సేవ: స్వచ్ఛంద సేవ, వితరణ, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవటం వంటి వాటితో జీవిత పరమార్థం అవగతమవుతుంది. మనసు తేలిక పడి, కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతుంది. ఇలాంటి సామాజిక సేవల ప్రభావం 45-80 ఏళ్ల వయసువారిలో మరింత ప్రస్ఫుటంగా కనబడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జీవితంలో ఒడిదొడుకులు సహజం. ఆత్మీయులను కోల్పోవటం, జబ్బులు, అనుకోని ఆపదల వంటివి ఎదురైనప్పుడు తమలాంటి సమస్యలతోనే బాధపడుతున్నవారిని కలుసుకొని, మాట్లాడుకోవటం మంచిది. దీంతో తనలాంటి వాళ్లు మరెందరో ఉన్నారనే సంగతీ అవగతమవుతుంది.

బాల్యంలోకి తొంగిచూడటం: చిన్నప్పుడు ప్రతిదీ అపురూపమే. అన్నీ ఆశ్చర్యకరమే. ఆడినా, పాడినా అదంతా ఆనందలోకమే. కాబట్టి అప్పట్లో ఆనందం కలిగించినవేంటని ఒకసారి బాల్యంలోకి తొంగి చూస్తే చాలు. చాలా సంతోష రహస్యాలు తెలుస్తాయి. మరచిపోయిన, సమయం దొరక్క విడిచిపెట్టిన హాబీల వంటివి తిరిగి మొదలుపెడితే ఆనందం దానంతట అదే పొంగుకొస్తుంది.

సమయాన్ని ‘కొనటం’: డబ్బుతో సంతోషాన్ని కొనలేం. కానీ డబ్బును ఖర్చు చేసే తీరు కచ్చితంగా మనసుపై ప్రభావం చూపుతుంది. సమయాన్ని మిగిల్చే సేవల కోసం డబ్బు వెచ్చించటం.. అంటే ఇంటిని శుభ్రపరచటం, పెరటితోట పెంపకం, లేదా కిరాణా సామగ్రి ఇంటికి తెచ్చిఇవ్వటం వంటి వాటికి ఖర్చు చేయటం మరింత ఆనందానికి కారణమవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సేవల కోసం ఖర్చు పెట్టినపుడు సంతోషం కలిగించే పనులను చేయటానికి మరింత సమయం దొరుకుతుంది. అలాగే రోజూ ఇంటి పనులతో విసిగిపోవటంతో తలెత్తే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

ఒకింత వ్యాయామం: ఆనందం, వ్యాయాయం.. రెండూ పరస్పర ఆధారితాలు. వ్యాయామం చేస్తే మెదడులో ఎండార్ఫిన్ల వంటి రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి నొప్పి తగ్గటానికి, హాయి భావన కలిగించటానికి తోడ్పడతాయి. ఇక మనసు ఆనందంగా ఉన్నప్పుడు మరింత హుషారుగా వ్యాయామం చేయాలనీ అనిపిస్తుంది. కాబట్టి వ్యాయామాన్ని చిన్నచూపు చూడటం తగదు.

ఆత్మీయ సంబంధాలు జీవిత భాగస్వామి, కుటుంబం, స్నేహితులతో ఆత్మీయ, సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటానికీ ఆనందానికీ బలమైన సంబంధమే ఉంటోంది. వ్యక్తిగత సంబంధాలు మనసును, భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి. ఇవి మూడ్‌నూ ఉత్తేజితం చేసి ఆనందంగా ఉండేందుకు తోడ్పడతాయి.
వితరణ శీలి, ఐరాస ప్రత్యేక సలహాదారు జేమ్‌ ఇలీన్‌ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘అంతర్జాతీయ ఆనంద దినం’ను 2013 నుంచి నిర్వహిస్తున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని