Published : 16 Jan 2016 19:12 IST

పంచకర్మ

పంచ‌క‌ర్మ‌

సనాతన వైద్యవిధానమైన ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ పంచకర్మలంటే ఏమిటి? చాలామంది మర్దనం.. అభ్యంగనం.. వేడికాపడం వంటివే పంచకర్మలని భావిస్తుంటారు. నేడు వీటికే విస్తృత ప్రచారం కూడా జరుగుతోంది. కానీ వాస్తవానికి ఈ మర్దన, అభ్యంగనం వంటివి ఆయుర్వేదంలో పంచకర్మ క్రియలకు ముందు చెయ్యాల్సిన పూర్వకర్మలు మాత్రమే. ఈ నేపథ్యంలో అసలు పంచకర్మలంటే ఏమిటి? వీటి గురించి ఆయుర్వేద శాస్త్రకారులు ఏం చెప్పారన్న ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తెస్తోంది  సుఖీభవ! 

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం.. సృష్టిలోని ప్రతి వస్తువుకూ ఈ పంచ భూతాలే మూలాధారం. అందుకే శరీరాన్ని కూడా పంచభూతాత్మకంగా నిర్వచించింది ఆయుర్వేదం! ఈ పంచభూతాలు మన శరీరంలో వాత, పిత్త, కఫాలనే మూడు దోషాల రూపంలో ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్యం యావత్తూ ఈ త్రిదోషాల ఆధారంగానే సాగుతుంది. మన శరీర రక్షణకు- రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రములనే ఏడు ధాతువులు; స్వేదం, మూత్రం, పురీషాలనే మూడు మలాలు.. వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలు... ఇవన్నీ కూడా సాధారణ స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే చక్కటి రక్షణ సాధ్యమవుతుంది. కానీ వీటిలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాలకు స్వతహాగా చెడిపోయే స్వభావం ఉంది. అంతే కాదు, మిగతా వాటినీ చెడగొడతాయి. అందుకే వీటిని దోషాలన్నారు. ఈ దోషాలు సమానస్థితిలో ఉంటే శరీరాన్ని రక్షిస్తాయి. అవి వికృతి చెందితే వ్యాధులను కలిగిస్తాయి. అయితే ఈ దోషాలు ఎంత ప్రకోపించినా.. సప్త ధాతువులు బలంగా ఉంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు తక్కువ. అందుకే ధాతు పుష్ఠి ముఖ్యం. దోషాలు వికృతి చెందటమే వ్యాధులకు మూలం కాబట్టి.. వ్యాధులు రావటానికి మూలం దోషాలే కాబట్టి... వ్యాధి చికిత్స అన్నది మూలాలను సరిచేసేదిగా ఉండాలన్నది మౌలిక సూత్రం! ఇలా మూలాలను సరిచేసేదే శోధన చికిత్స. దీని గురించి కాస్త వివరంగా చూద్దాం..

ఆయుర్వేదం ప్రకారం చికిత్సలు రెండు రకాలు..

1. శోధన చికిత్స 2. శమన చికిత్స. శోధన చికిత్స వ్యాధికి కారణమైన దోషాలను తొలగించి, వాటిని సమావస్థకు తీసుకువచ్చేందుకు ఉద్దేశించినది. ఈ శోధన చికిత్సలో ముఖ్యమైనవే పంచకర్మ చికిత్సలు! ముందు ఈ శోధన చికిత్స చేసి, దోషాలను తొలగించిన తర్వాత అప్పుడు.. ఔషధాలతో శమన చికిత్స చేస్తే- ధాతువులు వృద్ధిపొంది.. వ్యాధి నుంచి సంపూర్ణమైన స్వస్థత చేకూరుతుంది. ధాతువులకు ధారణశక్తి పెరిగి, వ్యాధి తిరిగి రాకుండా ఉంటుంది.

దోషాఃకదాచిత్‌ కుప్యంతి జితా లంఘన పాచనైః
జితాస్సంశోధనైయేతు నతేషాం పునరుద్భవః

అని చెప్పారు సూత్రకారులు. అంటే వ్యాధి మూలాలను సరిచేసే శోధన చికిత్స చేయకుండా కేవలం ఔషధాలిచ్చి శమన చికిత్స మాత్రమే చేస్తే ఆ ఔషధ ప్రభావంతో వ్యాధి లక్షణాలు తాత్కాలికంగా సద్దుమణిగినా.. మళ్లీ వ్యాధికారక పరిస్థితులు ఎదురైనప్పుడు తిరిగి వ్యాధి లక్షణాలూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందు శోధన చికిత్స చేసి.. దోషంలోని వికృతత్వాన్ని పోగొట్టి, అప్పుడు ఔషధాలతో శమన చికిత్స చేస్తే మళ్లీ వ్యాధి రావటానికి అవకాశం ఉండదు. ఈ కోణం నుంచి చూసినప్పుడు శోధన చికిత్సకు, దీనిలో భాగమైన ‘పంచకర్మ’ చికిత్సలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

పంచకర్మలు చేసేదేమిటి?
 హ్వితి కర్తవ్యతాయోగి దోష నిర్హరణ జ్యాయస్త్వం’ అని చెప్పారు శాస్త్రకారులు. అంటే పంచకర్మ చికిత్సల్లో భాగంగా ఇచ్చే ఔషధాలు శరీరంలోకి వెళ్లి.. అక్కడ అనేక విధాలైన రసాయన మార్పులు తీసుకొచ్చి... దోషాలు తేలికగా తొలగిపోయేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి. అందుకే ముందు ఈ శోధన చికిత్సలు చేసి, తర్వాత శమన చికిత్స చెయ్యాలని సూచించారు.

‘పంచకర్మ’లంటే?
* వమనం (వాంతి చేయించటం)
* విరేచనం (విరేచనం చేయించటం)
* వస్తికర్మ (ఔషధాలతో ఎనిమా ఇవ్వటం)
* ఆస్థాపన వస్తి
* అనువాసన వస్తి
* నశ్య కర్మ (ముక్కులో ఔషధ చుక్కలు వేయటం)
* రక్తమోక్షణం
 ప్రధానంగా కాయ చికిత్సకుడైన చరకుడు వస్తికర్మలను రెండుగా (ఆస్థాపన/అనువాసన) విభజించి పంచకర్మలను ప్రతిపాదించాడు. అయితే తర్వాత వచ్చిన సుశ్రుతుడు వస్తికర్మలు రెంటినీ ఒకటిగానే ప్రతిపాదించి.. ఐదో పంచకర్మగా ‘రక్తమోక్షణం’ (నెత్తురు తీయటం) అనే దానిని ప్రతిపాదించాడు.

ఈ తేడా ఎందుకు వచ్చిందంటే కాయచికిత్సకుడైన చరకుడి దృష్టిలో వాతానికి అన్నింటినీ ప్రదూషింపగలిగిన బలీయమైన శక్తి ఉంది కాబట్టి దానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, రెండు రకాల వస్తికర్మలు చెప్పాడు. వీరు రక్తదోషాన్ని కూడా పిత్త దోషం కిందే పరిగణించి, దానికి ప్రత్యేకించి చికిత్స అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే స్వతహాగా శస్త్రకారుడైన సుశ్రుతుడు రక్తాన్ని కూడా దోషంగా పరిగణించి, దీనిలో వికృతి వచ్చినప్పుడు రక్తమోక్షణం అవసరమని ప్రతిపాదించాడు.

పంచకర్మ: దేనికేది?
పక్షవాతం వంటి వాత ప్రధానమైన వ్యాధులు దాదాపు 80 రకాలు, అజీర్ణం వంటి పిత్త ప్రధానమైన వ్యాధులు 40 రకాలు, కఫ వ్యాధులు దాదాపు 20 రకాలున్నాయి. వీటిలో
* కఫ వ్యాధులకు వమనం
* అజీర్ణం వంటి పిత్త ప్రధాన వ్యాధులకు విరేచనం
* పక్షవాతం వంటి వాత ప్రధాన వ్యాధులకు వస్తి కర్మలు చెయ్యాలన్నది సూత్రం.
గొంతు నుంచి ఆమాశయం వరకూ ఉండేది కఫస్థానం. చిన్నపేగు, గ్రహణి వంటివన్నీ ఉండేది పిత్త స్థానం. పెద్దపేగులు, నాభి, గుదం వంటివన్నీ వాతానికి స్థానాలు. కఫవాతపిత్తాలకు ఉండే సహజ స్వభావాలకు తోడు ఈ స్థానాలను అనుసరించి కూడా వీటికి ఈ పంచకర్మలను సూచించారు.

స్వస్థులకు : పంచకర్మ వంటి శోధన చికిత్సలను కేవలం వ్యాధిగ్రస్థులకే కాదు, రుతువులను అనుసరించి ఆరోగ్యవంతులు కూడా అనుసరిస్తే దోషాలు వికృతి చెందకుండా ఉండి.. అసలు వ్యాధులు తలెత్తకుండా చూసుకోవచ్చని, ఇది ఉత్తమమని చెప్పారు సూత్రకారులు. ఎందుకంటే దోషాలకు ఆరు అవస్థలున్నాయి. 1. సంచయం. 2. ప్రకోపము. 3. ప్రసరము 4. స్థానసంశ్రయము 5. వ్యక్తీభావము 6. భేదము. దీనిలో మొదటి ఐదు దశలు దాటి.. ఆరో దశలోకి వెళితేనే మనకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వీటిలో మొదటి మూడూ దోషాలకు సంబంధించిన అవస్థలు, చివరి మూడూ వ్యాధికి సంబంధించి అవస్థలు. కాబట్టి సంచయ దశలోనే మనం దోషాలు గతి తప్పకుండా చూసుకోవటానికి ఈ శోధన చికిత్సలు ఉపకరిస్తాయి. అందుకే రుతువులను అనుసరించి:

హేమంత శిశిరాల్లో కఫ ప్రకోపం ఎక్కువ కాబట్టి దానికి ముందే వమనం, వర్ష రుతువులో వాత ప్రకోపం కలుగుతుంది కాబట్టి వేసవి చివర్లో వస్తి కర్మ, వర్షరుతువు చివరి రోజుల్లో పిత్త ప్రకోపం ఎక్కువ కాబట్టి దానికి ముందు విరేచన చికిత్స తీసుకుంటే వ్యాధులు రావన్నది సూత్రం. ఇది స్వస్థులకు పంచకర్మ!
పంచకర్మల తర్వాత శమన చికిత్స : వ్యాధులేవైనా ప్రధానంగా అవి కఫ, వాత, పిత్త ప్రధానమైనవే. కాబట్టి ఏ వ్యాధి గ్రస్తుడికైనా సంపూర్ణంగా వ్యాధి నయం కావాలంటే వారికి పంచకర్మల్లో తదనుగుణమైన క్రియ చెయ్యాలన్నది ఆయుర్వేద విధానం. పూర్వకర్మ చేసి, ఈ పంచకర్మల్లో అవసరమైన శోధన చికిత్స చేసిన తర్వాత.. అప్పుడు ఔషధాలతో శమన చికిత్స చెయ్యాలని చెప్పారు. రోగి బలవంతుడిగా ఉండి, దోషాలు కూడా బలవంతంగా ఉన్నప్పుడు ఎక్కువ విరేచనాలు/వాంతులు అయ్యేలా చేసేది ప్రవర శోధన. అలాగే రోగి పరిస్థితిని బట్టి మధ్యమ శోధనం, చాలా తక్కువగా ఒకటి రెండు మాత్రమే అయ్యేలా చేసే అవర శోధనం కూడా ఉన్నాయి. రోగి, వ్యాధి పరిస్థితిని బట్టి ఏవిధమైన చికిత్స చెయ్యాలో ఉంది. స్నేహస్వేదాల వంటి పూర్వకర్మలు చేసిన తర్వాత ఒక రోజు పంచకర్మల్లో ఏదో ఒక కర్మ చేస్తారు. దీంతో జఠరాగ్ని అస్తవ్యస్తమవుతుంది కాబట్టి పంచకర్మ అనంతరం ఏడు రోజుల పాటు పద్ధతి ప్రకారం పల్చటి ఆహారం నుంచి క్రమేపీ పెంచుకుంటూ ఘనాహరం ఇస్తారు. దీంతో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి అప్పుడు శమన చికిత్స ఆరంభించి ఔషధాలతో చికిత్స చేస్తే వ్యాధి సమూలంగా తొలగిపోయి పూర్తి స్వస్థత చేకూరుతుందన్నది సూత్రం. అయితే జీవితంలో వేగం పెరిగిపోయిన ఈ ఆధునిక కాలంలో ఇంతటి సమయం కేటాయించే అవకాశం, వనరులు, వెసులుబాటు కొరవడిన నేపథ్యంలో వ్యాధులకు ఔషధాలతో శమన చికిత్స చేస్తూనే అదే సమయంలో పంచకర్మ ప్రభావాలను రాబట్టేందుకు కూడా విరేచనంవంటివాటికి ఔషధాలు ఇవ్వటం పరిపాటిగా మారింది. మొత్తమ్మీద వమనం చేయించటం కొంత తగ్గినా విరేచన, వస్తికర్మలకు చాలా ప్రాశస్త్యం ఉంది. పంచకర్మల్లో ఏవైనా కూడా పూర్తిగా సుశిక్షితులైన వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. వీటితో అతియోగం, అయోగం, మిధ్యాయోగం వంటి ప్రభావాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించే మార్గాలు తెలియటం ముఖ్యం.

మర్దనం, ధార పూర్వకర్మలే : ఇప్పుడు పంచకర్మల పేరుతో విస్తృతంగా ప్రచారంలో ఉన్న మర్దన, శిరోధార వంటివి వాస్తవానికి పంచకర్మలు చెయ్యటానికి ముందు ఆచరించాల్సిన పూర్వకర్మలు మాత్రమే. ఇవి దోషాలు తేలికగా బయటకు వెళ్లిపోయేందుకు అనుకూలంగా తయారు చేస్తాయి. దోషాలు పంచకర్మ చికిత్సలకు తేలికగా ప్రతిస్పందించేలా చెయ్యటం ఈ పూర్వకర్మల ఉద్దేశం. అంతేగానీ వీటికి ఇవేగా వ్యాధులను తగ్గించలేవు. పూర్వకర్మల్లో ప్రధానమైనవి- స్నేహ స్వేదాలు. వీటినీ కొందరికి మాత్రమే చెయ్యాలి.

 స్నేహం : స్నేహ చికిత్సల్లో 23 రకాలున్నాయిగానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు. 1. బాహ్య స్నేహం. అంటే ఔషధ తైలాలు మొదలైన వాటితో మర్దన, కాపడం వంటివి. వేడిగా ఉండే పదార్థాల దగ్గర ఉంచటం, ఆవిరి పట్టటం వంటివి (సాగ్ని స్వేదాలు), వ్యాయామం, శారీరక కదలికల వంటి (నిరగ్ని స్వేదాలు) దీనిలో భాగమే. 2. ఆభ్యంతర స్నేహం. నెయ్యి, తైలాల వంటి వాటితో చేసిన ఔషధాలను లోపలికి తాగించి లోపల వేడి పుట్టించటం. వీటిని ఎవరికి, ఎలా చేయించాలన్నది స్పష్టంగా ఉంది. మొదట్లో స్నేహం, తర్వాత స్వేదం చేయించిన తర్వాత అప్పుడు శోధన చికిత్స.. అంటే పంచకర్మలు చేస్తారు. శరీరంలోని దోషాలన్నీ కూడా శోధన కర్మకు అనుకూలంగా తయారవటం దీనిలో ప్రత్యేకత. బాహ్యస్నేహం వల్ల అంగాలన్నీ మృదువుగా తయారవుతాయి. ‘స్నేహో అనిలం హంతి మృదూకరోతి అంగాన్‌’ అని చెప్పారు శాస్త్రకారులు. గట్టి కర్రను నీటిలో నానబెడితే ఎలా మృదువుగా మారుతుందో దీనితో కూడా అటువంటి ఫలితాలుంటాయి.

ధార : శిరస్సులో ఉండే దోషాలను పోగొట్టి వాటికి పోషకాలను అందించేందుకు చేసేది ధార చికిత్స. కేంద్రనాడీమండల వ్యవస్థకు చెందిన పక్షవాతం, ఉన్మాదం, మూర్ఛ, అపస్మారం వంటి సమస్యల్లో ధార చికిత్స ప్రత్యేకంగా చెప్పారు. వాతానికి సంబంధించిన వ్యాధులన్నింటికీ శిరస్సు కేంద్రంగా ఉంటుంది. కొన్నింటిలో దీనికి ప్రాధాన్యం ఎక్కువ. మిగతా చికిత్సలతో పాటు ధార చికిత్సా చేస్తారుగానీ కేవలం దీన్నే చికిత్సగా భావించటానికి లేదు. స్నేహ స్వేదాలన్నవి పూర్వకర్మలు మాత్రమేగానీ ఇవే పూర్తి చికిత్సలు కావు. దీనితో చికిత్స ఆగదు. ముఖ్యంగా పక్షాఘాతం వంటివాటిలో మాత్రం స్నేహస్వేదాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇవి పంచకర్మలకు అంగములు మాత్రమే. కొన్నింటిలో మాత్రం వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

పంచకర్మలు ఏ కర్మ ఎందుకు?
  వమనం: కఫానికి సంబంధించిన 20 వ్యాధుల్లో వమనం చేయిస్తారు. దీనికోసం మంగకాయ, వస, కొడిశపాల, సైంధవలవణం, పిప్పళ్లు, చేదుబీర వంటి వమనోపయోగ ఔషధాలను తీసుకుని దాన్ని తాగిస్తారు. దాంతో వాంతి అవుతుంది. ప్రధానంగా శ్వాస (ఆస్థమా), హిక్కా (ఎక్కిళ్లు), కాస (దగ్గు), చల్ది (విసర్పం) వంటి వ్యాధుల్లో దీనికి ప్రాధాన్యం ఉంటుంది.

స్నేహస్వేదాల వంటి పూర్వకర్మలు చేయించి, కఫాన్ని బయటకు తీసుకురావటానికి దోహదం చేసే పాల వంటి ద్రవ్యాలు తాగించి, కొద్దిసేపటి తర్వాత ఈ వమన ద్రవ్యాలను ఇస్తారు. వాంతులు ఎక్కువై (అతియోగం) ఏం చెయ్యాలో, సరిగా కాకపోతే (అయోగం) ఏం చెయ్యాలో కూడా స్పష్టంగా చెప్పారు.

  విరేచనం: పిత్త వికార జన్యమైన 40 వ్యాధుల్లో విరేచనానికి ప్రాధాన్యం ఉంది. విరేచనానికి సునాముఖి, ఏరండ తైలం (ఆముదం), త్రిఫల, కరక్కాయ వంటివి, ఇచ్ఛాభేదిరసం, త్రిఫల, కరక్కాయ వంటి ఔషధాలతో చేయిస్తారు.కాలేయ, ప్లీహ (యకృత్‌, ప్లీహ) వ్యాధులు, చర్మ వ్యాధులు, రక్తవికారంతో వచ్చే గడ్డలు, కురుపుల వంటివాటిలో దీన్ని చెప్పారు.

వస్తి:  వ్యాధిని బట్టి ఔషధాన్ని నిర్ణయించి దాన్ని గుదమార్గం ద్వారా ఎనిమా ఇవ్వటమే వస్తికర్మ. దీనిలో చాలా రకాలున్నాయి. వాతానికి సంబంధించిన వ్యాధులు పెద్దపేగుల వంటివాటిలో ఎక్కువ కాబట్టి వాటిని అరికట్టేందుకు వస్తి ఉపయోగపడుతుంది.

నిరూహ/ఆస్థాపన వస్తి : నిరూహ వస్తిలో భాగంగా ఎనిమా ఇచ్చే ద్రవంలో కషాయ భాగం ఎక్కువ, తైల లేదా ఘృత భాగం తక్కువ ఉంటుంది. కషాయాలతో చేసిన ఈ నిరూహ వస్తిలో 640 ఎం.ఎల్‌. వరకూ ఇస్తారు. నిరూహ వస్తిలో ఎనిమా ఇచ్చిన తర్వాత 40, 45 నిమిషాల్లో అది బయటకు వచ్చేయాలి. లేకపోతే అది హాని చేస్తుంది. కాబట్టి మళ్లీ యవక్షారం, త్రికటు, ఆమ్లద్రవ్యాల వంటి వాటి ఇచ్చి అయినా దాన్ని బయటకు తెప్పిస్తారు. వాత ప్రధానమైన వ్యాధుల్లో పక్షాఘాతం (పక్షవాతం), ఆక్షేపక వాతం (కాళ్లుచేతుల వణుకు) కటిశూల (నడుము నొప్పి), అశ్వరి (మూత్రపిండాల్లో రాళ్లు) వంటి వాటిలో, 80 వాత వ్యాధుల్లో దీనికి ప్రాధాన్యం ఉంది. వస్తికర్మ ఎలా చెయ్యాలన్న దానిపై స్పష్టమైన ప్రకరణం ఉంది.

అనువాసన వస్తి : కషాయం మొత్తాన్ని తైలంలో ఇంకింపజేసి తైలభాగం ఎక్కువగా ఉండేలా చేసి దాన్ని ఎనిమా ఇవ్వటం అనువాసన వస్తి. దీనిలో మారేడు (బిల్వం), దేవదారు, రాస్న (దుంపరాష్ట్రం), మంగఫలం (మంగకాయ) మొదలైన వాటితో కషాయం తయారుచేసి, దాన్ని తైలాల్లో ఇంకిపజేసి అప్పుడు ఎనిమా ఇస్తారు. ఇది బయటకురావాల్సిన పని లేదు. ఇది శరీరంలో ఇంకిపోతే బలాన్ని కలిగిస్తుంది. దీన్ని ముఖ్యంగా రసాయనం (బలవర్ధకం), వాజీకరణం, వంధ్యత్వం వంటివాటిలో ఉపయోగిస్తారు. వాత ప్రధాన వ్యాధుల్లో తైలాలు, బలానికి-పిత్తప్రధాన వ్యాధులకు ఘృతం ఉపయోగిస్తారు.

ఉత్తర వస్తి : పురుషులకు, స్త్రీలకు జననాంగాల ద్వారా లోపలికి ఔషధాలను పంపించిచేసే ‘ఉత్తర వస్తి కర్మ’ను ఆయుర్వేదంలో ప్రశస్తంగా చెప్పారు. మూత్ర సంబంధమైన 13 వ్యాధుల్లో, ప్రోస్టేటు గ్రంథి వ్యాధుల్లో, 20 రకాల గర్భాశయ, యోని సంబంధ వ్యాధుల్లో ఈ వస్తికర్మ సూచ్యం. సందర్భాన్ని బట్టి వాజీకరణం, వంధ్యత్వం వాటికీ ఇస్తారు. విరివిగా వాడకంలో లేకపోయినా కొన్నికొన్ని వ్యాధుల్లో వీటికి ప్రాశస్త్యం ఉంది.

నశ్య కర్మ (శిరో విరేచనం) : ‘నాసాయ శిరసో ద్వారం.’ అంటే శిరస్సుకు ముక్కు ద్వారం వంటిది. నశ్యకర్మ అంటే శిరస్సు నుంచి వాతపిత్తకఫ దోషాలకు సంబంధించిన వికృతులను తొలగించటానికి ఔషధ తైలాలను చుక్కల రూపంలో ముక్కు రంధ్రాల్లో వేయటం! ఇందుకు అపామార్గము, పిప్పలి, విడంగం వంటి దోషహర ద్రవ్యాలను, అణుతైలం, నారాయణతైలం, పీనసతైలం వంటి తైలాలను సూర్యావర్తం (సైనుసైటిస్‌), జలుబు, శిరశ్శూల వంటి వ్యాధుల్లో తైలాలను చుక్కలా వేస్తారు. చూర్ణాలను కూడా పీల్పిస్తారు. ఇది ఎండ ఎక్కువగా లేని ఉదయ సమయంలో ఉత్తమం. తల వెనక్కి వాల్చినట్టు ఉంచి, అప్పుడు గోరువెచ్చటి తైలాలు వేస్తారు.

రక్తమోక్షణం : సుశ్రుతుడు ప్రత్యేకంగా చెప్పిన కర్మ రక్తమోక్షణం. రక్తవికారం వల్ల వచ్చే పిత్తప్రధానమైన విసర్పం, కుష్టం, భగందరం, మధుమేహ పిటికల (కార్బంకుల్‌) వంటి వ్యాధుల్లో రక్తమోక్షణం చెప్పారు. దోష రక్తాన్ని తొలగించే ఈ ప్రక్రియలో ప్రధానంగా జలూకలు (జలగలు) వంటివి వాడటం జరుగుతోంది. వీటిలోనూ నిర్విషజలూకలను ఉపయోగిస్తారు. జలగను పట్టించి కొద్దిసేపు వదిలిస్తే అది అక్కడి రక్తాన్ని పీల్చుకుంటుంది, తర్వాత పసుపువేస్తే అది వదిలేస్తుంది.

బాహ్య స్నేహం రకరకాలు

 * అభ్యంగము: శరీరానికి మర్దన చేయటం  * లేపము: ఔషధాలను శరీరానికి పుయ్యటం  * ఉద్వర్తనము: నలుగుపెట్టటం  * పాదాఘాతం: ఔషధాన్ని పట్టించి కాళ్లతో రుద్దటం 

* పరిషేకము: వెచ్చటి నీటిలో తైలాలు వేసి వాటితో స్నానం  * గండూషము: ఔషధాలను పుక్కిట పట్టటం  * మూర్ధతైలము: శిరస్సుకు నూనెలు పట్టించటం  * శిరస్సేకము: శిరస్సుకు కాపడం  * తక్ర ధార: మజ్జిగతో ధారా చికిత్స  * తైల ధార: ఔషధాలతో తయారు చేసిన తైలాన్ని తల మీద ధారగా పడేలా చేయటం  * పిచు: పత్తి నూనెలో ముంచి శిరస్సు, శరీర భాగాల మీద ఉంచటం  * శిరోవస్తి: తలకు గుడ్డ వంటిది కట్టి దానిలో ఔషధాలనుంచటం    * అక్షితర్పణము: కళ్లలో వెచ్చటి నెయ్యి మొదలైనవి వేయటం
* నాసాతర్పణము: ముక్కులలో చుక్కలు వెయ్యటం  * కర్ణపూరణము: చెవులలో నూనెలు మొదలైనవి వేయటం
* స్నేహ అవగాహనము: నీళ్లలో తైలాల వంటివి వేసి దానిలో పడుకోబెట్టటం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు