Published : 17 Jan 2016 13:38 IST

చల్లచల్లని హోమియో!

చల్లచల్లని హోమియో! సమ్మర్‌ కిట్‌ .. వేసవి.. అక్కడక్కడ చిరుజల్లులు.. అప్పుడప్పుడు చల్లగాలులు.. మధ్యలో ముఖం మాడిపోయే ఎండలు! వడగళ్ల వానల మధ్యే వడగాడ్పు హోరెత్తిస్తోంది. ఏమైనా రోళ్లు పగిలిపోయే రోహిణీ కార్తె ఇంకా ముందే ఉంది. వేసవిలో పిల్లలు, వృద్ధులను కాపాడుకోవటం చాలా అవసరం. కొంచెం వేడికే విలవిల్లాడిపోతుండే ఈ సున్నిత ప్రాణులను పొదివి పట్టుకోవటం ముఖ్యం. వీరేకాదు.. రోజంతా ఎండలో తిరిగే ఉద్యోగులు.. పెళ్లి పేరంటాలతో హడావుడి పడే గృహిణులు.. రకరకాల విందులారగిస్తుండే అతిథులూ.. తాపానికి తాళలేక కూల్‌డ్రింకులను ఆశ్రయిస్తుండే కుర్రాళ్లూ.. ఒకరేమిటి.. అందరికీ తప్పవు ప్రత్యేక జాగ్రత్తలు!

వేసవి తాపానికి హోమియోలో చక్కటి విరుగుడుంది. వ్యక్తి-తత్వాలనే కాదు.. పరిసర ప్రభావాలనూ పట్టించుకునే సమగ్ర వైద్యం హోమియోపతి. అందుకే వేసవి బాధలకు, బెడదలకు అవసరమయ్యే ఔషధాలను ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం.. సమస్య తలెత్తుతున్నట్టు అనిపిస్తే సకాలంలో సరైన ఔషధాలను ఎంపిక చేసి వేసుకోవటం ద్వారా ఈ వేసవి ‘సెగ’ తగలకుండానే జీవితాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు.

బహిర్‌-అంతరాలు రెండు కళ్లు!
హోమియో వైద్యం వ్యాధిని తుద ముట్టించటంలో.. బహిర్‌, అంతర కారణాలు రెంటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. గాలి, నీరు, తేమ, ఎండ, సూక్ష్మక్రిములు, సామాజిక ఒత్తిళ్లు, వృత్తి కుటుంబ పరిస్థితుల వంటి పరిసర ప్రభావాలన్నీ కూడా బాహ్య కారణాల కోవలోకి వస్తాయి. ఇవి కాకుండా ఆంతరంగిక కారణాలను కూడా పరిశీలిస్తారు. శరీరతత్వం, మనస్తత్వం, వయసు వంటివన్నీ ఆంతరంగిక కారణాల్లోకి వస్తాయి. వాస్తవానికి రోగిలో వ్యక్తమయ్యే లక్షణాలకు ఈ ఆంతరంగిక కారణాలే ప్రధానం. అయితే ఈ రెండే కాకుండా.. మూడోది, అత్యంత కీలకమైనది మరోటి ఉంది, అదే రోగాధార పరిస్థితులు (మయాజం). హోమియో విధానం ప్రకారం ఈ రోగాధార పరిస్థితులు ఉన్నవారిలోనే రోగాంకురం జనించి.. వ్యాధి రూపంలో వ్యక్తమవుతుంది. ఈ రోగాధార పరిస్థితులు చాలా వరకూ వంశపారంపర్యంగా సంక్రమించిన లక్షణాలు, బాల్యంలో ఎదురైన అనుభవాల మీద ఆధారపడి ఉంటాయి. ఆంతరింగిక కారణాలు ఈ రోగాధార పరిస్థితులతో కూడుకొని రోగ లక్షణాలకు దారితీస్తాయి. అంటే బయటకు కనిపించే రోగ లక్షణాలన్నీ కూడా పరిసరాల ప్రభావం ఒత్తిడికి తట్టుకునేందుకు మన ఆంతరింగిక వ్యవస్థ చేసుకునే ఏర్పాట్లే అని అర్థం చేసుకోవచ్చు. శరీరం వ్యక్తం చేసే లక్షణాలను బట్టి దాన్ని మనం రకరకాల వ్యాధుల పేర్లతో పిలుస్తుంటాం. ఈ లక్షణాలన్నీ శరీరం తనను తాను రక్షించుకునేందుకు చేసుకునే ప్రయత్నాలే. ఒకే రకం బాహ్య పరిస్థితుల్లో ఉండే వారిలో కూడా.. ఆంతరంగిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి స్పందనలు కూడా వేరుగా ఉంటాయి. అందుకే లక్షణాలు కూడా వ్యక్తికీ వ్యక్తికీ వేర్వేరుగా ఉంటాయి. వేసవి వేడిమి అన్నది బాహ్య పరిస్థితి. దీనికి వ్యక్తి స్పందనల తీరును బట్టి మందులను ఎంపిక చేసి రక్షణ వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారా హోమియో చికిత్సతో చక్కటి ప్రయోజనం పొందవచ్చు!

  ఇదీ వేసవి కిట్‌ .. వేసవిలో వడదెబ్బ, ఎండదెబ్బల తాకిడి నుంచి రక్షణ కోసం తప్పనిసరిగాఇంట్లో ఉంచుకోవాల్సిన ఔషధాలు- గ్లొనైన్‌, బెల్లడోనా, నేట్రంమూర్‌, ఎకోనైట్‌, జెల్సీమియం, నేట్రం కార్బ్‌.

శరీర రక్షణ వ్యస్థను బలోపేతం చేయటమే హోమియో విధానం ప్రత్యేకత. ఈ వ్యవస్థ ప్రతి వ్యక్తికీ మారుతుంటుంది. ఆ తేడాను గుర్తించి.. లక్షణాల ఆధారంగా మందు ఎంపిక చెయ్యటం అవసరం. ఎండదెబ్బ, వడదెబ్బలు రెంటికీ ఒకే రకమైన మందులు వాడినప్పటికీ వాటిని ఆయా వ్యక్తుల పరిస్థితి, లక్షణాలను బట్టి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎండ దెబ్బలో బలహీనత ప్రధానంగా కనిపిస్తే.. వడదెబ్బలో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బెల్లడోనా, గ్లొనైన్‌ మందులు రెండూ తలనొప్పి వంటి బాధలను తగ్గించేవే అయినా.. తల వెనక్కి వంచితే హాయిగా అనిపిస్తుంటే బెల్లడోనా సరైన ఔషధం. అదే తల వెనక్కి వంచినప్పుడు నొప్పి అధికమవుతూ, ముందుకు వంచినప్పుడు సుఖంగా అనిపిస్తుంటే గ్లొనైన్‌ ఎంపిక సరైనది. తలనొప్పి వేగంగా వచ్చి, అంతే వేగంగా తగ్గుతుంటే గ్లొనైన్‌ బాగా ఉపయోగపడుతుంది. వడదెబ్బ, ఎండ దెబ్బల్లో తలనొప్పి, జ్వరం రెండూ ఉన్నప్పటికీ తలనొప్పి అధికంగా ఉంటే గ్లొనైన్‌, జ్వరం అధికంగా ఉంటే బెల్లడోనా తీసుకోవాలి.

వేసవి విరేచనాలు
వేసవిలో అతిసారం, నీళ్ల విరేచనాల వంటివి అధికంగానే కనిపిస్తాయి. దాహానికి తట్టుకోలేక రకరకాల చోట్ల నీళ్లు తాగటం, బయటి పదార్థాలు తినటం, ఐస్‌క్రీమ్‌లు.. కూల్‌డ్రింకుల వంటివి తీసుకోవటం వంటివి దీనికి కారణమవుతాయి. హోమియో విధానం ప్రకారం శరీర రక్షణ వ్యవస్థ బలహీనపడి, చిన్నపేగులు.. పెద్దపేగుల్లో జీర్ణప్రక్రియ శక్తి తగ్గితే విరేచనాలు కలుగుతాయి. వీటికి హోమియోలో మంచి మందులున్నాయి.

*పోడోఫైలం: వేసవిలో విరేచనాలు పట్టుకుంటే ముందుగా వేసుకోదగిన మందు ఇది. పిచికారీ చిమ్మినట్లుగా నీళ్ల విరేచనాలు కావటం, మలం దుర్వాసనతో ఉంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి విరేచనాలు ఉదయాన్నే మొదలై సాయంత్రం వరకూ మాత్రమే అవుతూ, రాత్రిపూట లేకుంటే దీన్ని తీసుకోవచ్చు.

*బ్రయోనియా: ఆహారం ఆబగా తింటూ అజీర్ణం కొని తెచ్చుకొని, వేసవిలో విరేచనాల బారిన పడిన వారు దీన్ని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం నిద్ర నుంచి లేచి తిరగటం ఆరంభించగానే విరేచనాలు పట్టుకునే వారికి, కూల్‌డ్రింకులు తాగటం వల్ల డయేరియా బారినపడిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

*చైనా: గ్యాస్‌, త్రేన్పులు, అజీర్ణం ఉంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. విరేచనాలు ఎక్కువ కావటం వల్ల వచ్చే నీరసానికి ఇది ప్రత్యేకమైన మందు. పొట్ట ఉబ్బరం, విసుగు ఉన్నప్పుడూ దీనిని వాడుకోవచ్చు. కలుషితమైన ఆహారం తిన్నప్పుడు పట్టుకునే విరేచనాలు, ముఖ్యంగా నొప్పి లేకుండా విరేచనాలు అవుతుంటే దీనిని తీసుకోవచ్చు.

చెమట కాయలు
* నేట్రంమూర్‌: చెమటకాయలతో బాధపడుతుండే సున్నిత మనస్కులు దీనిని వాడుకోవచ్చు. చర్మం మీది తైలగ్రంథులు ఎక్కువగా స్రవించటం వల్ల చర్మం, ముఖం జిడ్డుగా అయ్యేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చర్మం మీద అలర్జీలకు ఇది ప్రత్యేక ఔషధం.
* ఆర్సెనికం ఆల్బ్‌: చర్మం మీద అలర్జీలు లేదంటే ఆస్థమా.. ఒకటి మార్చి ఒకటి బాధిస్తున్న వారికి ఇదెంతగానో ఉపయోగపడుతుంది. అలర్జీలతో పాటు మానసికంగా అస్థిమితం, అభద్రతా స్వభావం గలవారికి ఇది ప్రత్యేక ఔషధం.
* రస్టాక్స్‌: చర్మం మీద మంటతో కూడిన దద్దుర్లు.. నీటిబొబ్బలు, వాటిలోంచి తెల్లటి స్రావం కారుతుంటే దీనిని వాడుకోవచ్చు. శారీరకంగా అస్థిమితం, ఒళ్లంతా బిగుసుకుపోయినట్టు అనిపించటం, ప్రతి దానికీ ఎక్కువగా బాధపడటం వంటి లక్షణాలు ఉన్నవారు దీన్ని వేసుకోవచ్చు. నాలుకంతా తెల్లగా ఉండి, చివరి భాగంలో మాత్రం త్రిభుజాకారంలో ఎర్రగా ఉన్నవారికి ఇది ప్రత్యేకమైన ఔషధం.

సెగ గడ్డలు
* వేసవిలో సెగ గడ్డలకు బెల్లడోనా మంచిమందు. ఇది వేసుకుంటే సెగ గడ్డలు తగ్గిపోతాయి. అవి తగ్గినట్టే తగ్గి మళ్లీమళ్లీ వేధిస్తుంటే లాకిసిస్‌ వాడుకోవాల్సి ఉంటుంది.
* వేసవి ఆరంభంలో, మధ్యలో కూడా ఆటలమ్మ విజృంభిస్తుంటుంది. పిల్లలు దీని బారినపడకుండా ‘వేరియోవైనమ్‌’ వేస్తే మంచి నిరోధకంగా పనిచేస్తుంది. అలాగే తట్టు/తడపర (మీజిల్స్‌) రాకుండా ‘మార్బులైనమ్‌’ వేసుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి విజృంభిస్తున్నట్టు తెలిసిన వెంటనే ఈ మందులు రెండుమూడు రోజుల పాటు వేసుకుంటే సమస్య దరిజేరదు.

ఎండదెబ్బ - వడదెబ్బ
చూడటానికి ఎండదెబ్బ, వడదెబ్బ ఒకలాగే కనిపించినా వీటి మధ్య తేడాను గుర్తించటం ఎంతో అవసరం. వృద్ధులు, పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువ. వీటిల్లో వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైంది.
* ఎండ దెబ్బ : ఎండ వేడిమికి శరీరంలోని రక్త ప్రసరణ మొత్తం ప్రభావితమై శరీరం మొత్తం వేడెక్కుతుంది. దీనిని చల్లబరచటానికి స్వేద గ్రంథులు ప్రేరేపితమై చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వేసవిలో కొంత చెమట సహజమే అయినా ఎండదెబ్బ తగిలినపు మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలోని లవణాలు ఎక్కువగా బయటకు పోయి అమితమైన నీరసం, కండరాల నొప్పి మొదలవుతాయి. ఎక్కువగా వృద్ధులు, పిల్లలు, స్త్రీలు దీని బారిన పడుతుంటారు. మద్యం ఎక్కువగా తాగే వారికీ ఈ సమస్య ఎక్కువే. సాధారణంగా గాల్లో తేమ, ఎండ తీవ్రత రెండూ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసేవారు ఎండ దెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.
లక్షణాలు: తలనొప్పి, తల తిరగటం, విపరీతమైన నీరసం, స్థిమితంగా లేకపోవటం, అధికంగా చెమట పట్టటం, సొమ్మసిల్లటం. (చెమట ఎక్కువగా పడుతుంది కానీ వీరిలో జ్వరం ఉండదు.)
సత్వర చర్యలు: ఎండదెబ్బ తగిలినవారిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి. చెమట ద్వారా నష్టపోయిన లవణాలు, సోడియాన్ని భర్తీ చేసేందుకు- ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కొంచెం ఉప్పు కలిపిన నీరు ఇవ్వాలి. అదనంగా పళ్లరసం కూడా ఇవ్వొచ్చు.

వడదెబ్బ
ఎండ ప్రభావం తల, మెదడు మీద ఎక్కువగా పడినప్పుడు వడదెబ్బ తగులుతుంది. మన శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించే అత్యంత కీలకమైన కేంద్రాలు.. మెదడు, వెన్నుపాము కలిసే చోట (బ్రెయిన్‌ స్టెమ్‌) ఉంటాయి. వడదెబ్బ తగిలినపుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఈ కేంద్రాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీంతో మంటలతో కూడిన జ్వరం ఆరంభమవుతుంది. వడదెబ్బకూ, ఎండదెబ్బకూ ప్రధానమైన తేడా ఈ జ్వరమే! వడదెబ్బలోనూ దాదాపుగా ఎండదెబ్బ లక్షణాలన్నీ ఉంటాయి గానీ ఇందులో చెమట ఉండదు. ఒళ్లు వేడెక్కిపోతుంటుంది. వేడిమిని తట్టుకోవటానికి చెమట పట్టించే ప్రయత్నంలో భాగంగా రక్తప్రసారం అధికమై చర్మం ఎర్రగా కందిపోతుంది. జ్వరం కాలిపోతుండటం వల్ల ప్రధాన అవయవాలైన మెదడు, కాలేయం, మూత్రపిండాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదమూ ఉంది. వడదెబ్బతో మరణించేవారి సంఖ్య వృద్ధుల్లో అధికం. మెదడు దెబ్బతినటం వల్ల ఫిట్స్‌ కూడా వస్తాయి.

లక్షణాలు: ఒళ్లు కాలిపోవటం, 105-110 డిగ్రీల ఫారన్‌హీట్‌ జ్వరం, చెమట పట్టకపోవటం, శరీరం చర్మం పొడిబారటం, విపరీతమైన దప్పిక, మగత, తలతిప్పు, తీవ్రమైన తలనొప్పి, స్పృహ తప్పిపోవటం, గురక, నాడి వేగంగా కొట్టుకోవటం.

సత్వర చర్యలు: వడదెబ్బ తగిలినపుడు వెంటనే చికిత్స మొదలెట్టటం ఎంతో అవసరం. వీరికి చెమట పట్టదు కాబట్టి తడిగుడ్డల్లో చుట్టి పడుకోబెట్టాలి. జ్వరం తగ్గేంత వరకూ వాటిని తడుపుతుండాలి. బాగా గాలి విసరాలి. అవయవాలు దెబ్బతినకుండా చూసేందుకు జ్వరాన్ని ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది. జ్వరం 101 డిగ్రీలకు దిగాక తడిగుడ్డలు తొలగించొచ్చు.

బెల్లడోనా
అకస్మాత్తుగా కనిపించే వడదెబ్బ అనగానే ముందుగా ఈ మందునే దృష్టిలో పెట్టుకోవాలి. జ్వరం త్వరత్వరగా పైకి ఎగబాకుతుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఏ లక్షణాలకు?: ముఖం కమిలినట్లుగా ఎర్రబారటం, మెడకు ఇరుపక్కలా రక్తనాళాలు, కండరాలు అదరటం, కళ్లు ఎర్రబడటం, కంటిపాప విప్పారటం, ఒళ్లు కాలిపోతుండటం, ఒంటి మీద చేయి వేసి తీసేసిన తర్వాత కూడా అరచేయి కాలిపోతున్నట్టు ఉండటం, నోరు పొడారిపోవటం, అస్థిమితం, మగత, తలతిప్పు, వికారం, మూత్రం ఎక్కువగా రాకపోయినా మాటిమాటికీ విసర్జకు వెళ్లాల్సి వస్తుండటం, తెలియకుండానే మల మూత్రాలు అయిపోతుండటం వంటివి కనిపించినపుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

గ్లొనైన్‌
ఏ లక్షణాలకు?: ఎండదెబ్బ తాకిడికి విపరీతమైన తలనొప్పి, తల పగిలిపోతున్నట్లే అనిపించటం, ముఖం ఎర్రబారటం, తలదిమ్ము, అటూఇటూ కదిలితే బాధ ఎక్కువ కావటం, తల పెద్దదైనట్టు అనిపించటం, గొంతు పట్టుకుపోయినట్లు ఉండటం వంటి ఎండదెబ్బ లక్షణాలున్నప్పుడు ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది.

నేట్రంమూర్‌
ఎండను ఏమాత్రం తట్టుకోలేకపోతుండటం, గొడుగు లేకుండా ఎండలోకి అడుగుపెట్టబుద్ధి కాకపోవటం, గొడుగు లేకుండా వెళితే తలనొప్పి పగిలిపోతున్నట్టు అనిపించటం, ముఖ్యంగా.. తలనొప్పి రావటానికి ముందు చూపు మసక బారినట్టు ఉండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని వాడుకోవాలి. వేసవి తలనొప్పికిది మంచి నివారణ ఔషధం.

ఎకోనైట్‌
ఎక్కువ సమయం ఎండలో గడపటం, ఎండలో పడుకోవటం వల్ల వచ్చే బాధలకు ఇది ప్రత్యేకమైన మందు. భయం, అస్థిమితం, ఆందోళన ఎక్కువగా ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. తల వేడిగా ఉండటం, తల పగిలిపోతున్నట్లు అనిపించటం, జ్వరం, ఒళ్లంతా తిమ్మిర్ల వంటివి ఉన్నపుడు దీనిని వాడుకోవచ్చు.

జెల్సీమియం
ఎండ బొత్తిగా పడనివారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. మందకొడితనం, తలతిప్పు, మగత ఉన్నప్పుడు వేసుకోవచ్చు. వేసవిలో వచ్చే నిస్త్రాణ, నీరసాలకు ఇది ప్రత్యేకమైన మందు. బలహీనత వల్ల శరీరం వణకటం, తలనొప్పి నుదరు భాగాన అధికంగా ఉండటం, నుదురు పగిలిపోతున్నట్లు అనిపించటం, గుడ్లు ముందుకు పొడుచుకొచ్చినట్లు, కంటి రెప్పలు బరువుగా ఉండి వాలిపోతుండటం వంటి లక్షణాలున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

నేట్రంకార్బ్‌
వడదెబ్బ తగిలి కోలుకుంటున్న తర్వాత వచ్చే బాధలకు, వేసవిలో ఏమాత్రం మానసిక శ్రమకు తట్టుకోలేక తలనొప్పితో బాధపడేవారికి ఇది ప్రత్యేకమైన ఔషధం.

ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, వేసవి ప్రయాణాల్లో గ్లొనైన్‌ ఒక మోతాదు వేసుకుని బయలు దేరటం ఉత్తమం. ఎండదెబ్బ తగలకుండా కాపాడే అద్భుత ఔషధమిది. ఒక రకంగా దీనిని ‘వేసవి సంజీవని’గా భావించవచ్చు.  
ఈ మందులన్నింటినీ 30 పొటెన్సీలో రోజుకు కనీసం 2 దఫాలుగా వాడుకోవాలి. ప్రతిసారీ 4-5 మాత్రలు వేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు