Published : 17 Jan 2016 13:48 IST

అజీర్ణం అవస్థే!

అజీర్ణం అవస్థే!

నాతి ధృతమశ్రీయాత్‌ నాతి విలమ్బితం .. ఆహారం మరీ త్వరత్వరగానూ తినకూడదు, అలాగని అతి నిదానంగానూ తినకూడదు. 

* తన్మనా భుంజీతా
తింటున్న ఆహారం మీద మనస్సు పెట్టి తినాలి. టీవీలు చూస్తూ.. పేపర్లు చదువుతూ అన్యమనస్కంగా తినటం సరికాదు.
* ఇష్టైస్సహభుజ్యతామ్‌
ఇష్టమైన వారితో కలిసి కూర్చుని తినటం మంచిది.
మన శరీరం.. పంచభూతాత్మకం!
ఈ ప్రకృతికి మూలాధారమైన- నింగి, నేల, నీరు, నిప్పు, వాయువులే- మన శరీరానికీ ఆధారభూతాలు!
పంచభూతాల అంశలైన ‘వాత పిత్త కఫాలనే’ త్రిదోషాలూ మన శరీరాన్నినడిపిస్తుంటాయి.. నియంత్రిస్తుంటాయి.. శాసిస్తుంటాయి!
ఈ దోషాలు మూడూ సమావస్థలో.. సమన్వయంతో ఉన్నప్పుడు మనం హాయిగా, ఆరోగ్యంగా తిరుగుతుంటాం. వీటిలో ఏది/ఏవి ప్రకోపించినా.. మనం అస్వస్థత పాలవుతాం!
ఆహారంలోని సారం మన ఒంటికి పట్టి.. అందులోని వ్యర్థం బయటకు వెళ్లిపోతుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఆహార పచన ప్రక్రియ యావత్తూ త్రిదోషాల సారథ¿్యంలో మన శరీరంలో ఎన్నో దశల్లో సాగుతుంటుంది. ఈ పరిణామంలో.. ఏ దశలో.. ఏ అవస్థలో సమస్య తలెత్తినా.. ‘అజీర్ణం’ బాధలు ఆరంభమవుతాయి. అందుకే అజీర్ణాన్ని త్రిదోషాత్మకంగా విశ్లేషిస్తూ.. చక్కటి నియమాలను, ఔషధాలను సూచిస్తోంది ఆయుర్వేదం!

జీర్ణం, జీర్ణం..!
నిత్యం... సరైన సమయానికి, సరైన మోతాదులో, సరైన ఆహారం తీసుకున్నా కూడా.. అది సరిగా జీర్ణం కాక ఇబ్బంది పెడుతుండటాన్ని ‘అజీర్ణం’ అనుకోవచ్చు. పులితేన్పులు.. కడుపు భారం.. ఆకల్లేకపోవటం.. మల విసర్జన సమస్యగా మారటం.. ఇలా అజీర్ణంలో ఎన్నోరకాల బాధలు పలకరిస్తుంటాయి. మనం తీసుకున్న ఆహారం పచనమయ్యే ప్రక్రియలో ఎక్కడ సమస్య తలెత్తిందన్న దాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి.

జీర్ణ ప్రక్రియ నోటి నుంచే ఆరంభమవుతుంది. ఇది- నోటిలో ఆహారం పెట్టుకున్నది మొదలు ఆమాశయాన్ని చేరి... అక్కడి నుంచి చిన్నపేగును (క్షుద్రాంత్రం) దాటి పెద్దపేగు (బృహదాంత్రం)లోకి వచ్చే వరకూ కూడా 3 భాగాల్లో సాగుతుంది. వీటిని 1. అవస్థా పాకం 2. భూతాగ్ని పాకం 3. నిష్టా పాకం.. అని మూడు దశలుగా చెబుతోంది ఆయుర్వేదం. ఈ మూడు పాకాలూ సజావుగా సాగుతున్నప్పుడే తిన్నది సంపూర్ణంగా జీర్ణమైనట్టు! అందుకే వీటిని వివరంగా చూద్దాం.

అవస్థా పాకం
 కఫ-వాత-పిత్తాలనే త్రిదోషాల్లో... జీర్ణ ప్రక్రియలో ఒక్కో దశలో ఒక్కో దోషం బలమైన పాత్ర పోషిస్తుంటుంది! వీటిలో తొలిగా చెప్పుకోవాల్సింది కఫ అవస్థా పాకం. ఆ తర్వాత.. పిత్త అవస్థా పాకం.. చివరిగా వాత అవస్థా పాకం.. ఈ మూడూ ప్రబలంగా ఉంటాయి.
1. కఫ అవస్థా పాకం: జీర్ణప్రక్రియ మనం ఆహారాన్ని నమలటంతోటే ఆరంభమవుతుంది. నమిలేటప్పుడు లాలాజలంతో కలుస్తూ ఆహార పచనం ఆరంభమవుతుంది. ఇది నోటి నుంచి ఆమాశయంలోకి చేరుతుంది. అందులో రకరకాల జీర్ణరసాలుంటాయి. ఇదంతా ద్రవరూపమైన జలీయాంశం. వీటిలో ఆహారం బాగా నాని, చక్కగా చక్కటి పచనానికి సిద్ధమవుతుంది. ఈ ద్రవాంశం లేకుండా.. కేవలం అగ్నిప్రక్రియ మాత్రమే జరిగితే.. ఆహారం అతిగా దగ్ధమైపోతుంది. అందుకే ఆమాశయంలో ఆహారం కఫ, ద్రవాంశంలోకి మార్చటం జరుగుతుంది. దీన్ని కఫ అవస్థాపాకం పాకం అంటారు.

2. పిత్త అవస్థా పాకం: ద్రవరూప ఆహారం.. ఆమాశయం నుంచి చిన్నపేగుల్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ అగ్ని ప్రారంభమవుతుంది. ఇది జఠరాగ్ని. దీని ప్రభావంతో పచనం ఆరంభమవుతుంది.

3. వాత అవస్థా పాకం: జఠరాగ్నిలో బాగా పచనమైన ఆహారం నుంచి సారాన్నీ, మలాన్నీ వేరు చేసే ప్రక్రియ అంతా మూడో అవస్థలో సాగుతుంది. ఆహారంలోని ఈ సారం మన శరీర పరిపోషణకు అవసరమైన ధాతురూపంలోకి మారగా.. మిగిలిన వ్యర్థ మల భాగం పెద్దపేగులోకి వెళ్లి.. గుదమార్గం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. ఇది తృతీయ అవస్థా పాకం.

మన జీర్ణక్రియ యావత్తూ ఈ మూడు అవస్థల్లో సాగుతుంది. ఈ మూడు దశల్లో ఎక్కడ సమస్య తలెత్తినా ఆహార పరిణామం సరిగా జరగక అజీర్ణం తలెత్తుతుంది.

భూతాగ్ని పాకం
ఆహారం నుంచి కేవలం సారం వేరుపడగానే సరికాదు. దాన్ని మన శరీరం తనకు అవసరమైన, అనువైన ధాతువుల రూపంలోకి మార్చుకోవాలి. ఇది అత్యంత కీలకం. అందుకే ఆహారం నుంచి వేరుపడిన సార భాగం తిరిగి.. తదుపరి దశలో.. భూతాగ్ని పాకంలోకి వెళుతుంది. ముందే చెప్పుకొన్నట్టు మన శరీరమే కాదు, ఆహారమూ పంచభూతాత్మకమే. ఆహారంలోని పంచభూతాత్మకమైన తత్వాలను.. శరీరంలోని పంచభూతాత్మకమైన 13 అగ్నులు గ్రహిస్తాయి. తొలిగా జఠరాగ్ని పచనం చేస్తే.. పంచభూతాగ్నులు.. ఆ సారాన్ని మన శరీరంలోని పంచభూతాగ్ని భావనలుగా మారుస్తాయి.

ధాత్వగ్ని పాకం
పంచభూతాల నుంచి వచ్చిన భావాలను సప్తధాతువులు తమకు అనువైన ధాతురూపంలోకి పరిణామం చెందిస్తాయి. దీన్నే భూతాగ్ని పాకం/నిష్టాపాకం అంటారు. అప్పుడు మన శరీరం ధాతుపుష్టిని పెంచుకుంటుంది. దీంతో జీర్ణప్రక్రియ పూర్తి అయినట్లు! ఇదీ స్థూలంగా మన జీర్ణప్రక్రియ!

మన ఒంట్లో నీరు, నిప్పు, గాలి
మనం ఆహారం వండేటప్పుడు.. పైన పాత్రలో నీరు, వండాల్సిన పదార్ధాలు ఉంచుతాం. కింద మంట పెడతాం. వాయువు లేకుండా నిప్పు ఉండదు కాబట్టి.. కింది నుంచి గాలి వీస్తుంటే.. అగ్ని ప్రజ్జ్వలితమై.. పైన పాత్రలోని నీరు, ఆహారం బాగా ఉడుకుతుంది.

మన శరీరంలోనూ.. మన జీర్ణవ్యవస్థలో కూడా.. సరిగ్గా ఇదే జరుగుతుంటుంది. మన శరీర వూర్ధ్వ భాగంలో కఫం(నీరు).. మధ్య భాగంలో పిత్తం(అగ్ని).. అధో భాగంలో వాతం(వాయువు).. బలీయంగా ఉంటాయి.

కింద ఉండే వాతం.. వాయువులా వూతమిస్తుంటే.. మధ్యన ఉండే పిత్తం.. అగ్ని ప్రజ్వరిల్లజేస్తే.. పైన ఉండే కఫం (ఆహారం).. పచనమవుతుంది! వాయువు, అగ్ని, నీరు కలిసి ఏ విధంగా ఆహారాన్ని ఉడికిస్తున్నాయో.. అదే తీరులో మన శరీరంలో కూడా ఆహారం పచనమవుతుంది!

ఎందుకొస్తాయి?
*సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం  *సరిగా వండని, అపక్వమైన ఆహారం తీసుకోవటం
*అతిగా ఎక్కువ, లేదంటే మరీ తక్కువ తీసుకోవటం

*తిన్నది అరగక ముందే మళ్లీ తీసుకోవటం, అతిగా నీరు తాగుతుండటం
*ముఖ్యంగా- క్రోధం, ఈర్ష్య, ద్వేషాల వంటి తీవ్ర మానసిక భావోద్వాగాలకు లోనవుతున్నా అజీర్ణం తలెత్తుతుంది.
*నూనెల వంటి గురువైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం  *రాత్రిపూట బరువైన ఆహారం తీసుకోవటం

  నియమితమైన కాలానికి ఆహారం సంపూర్ణంగా జీర్ణమైపోయి ఏవిధమైన బాధలు లేకుండా తిరిగి ఆకలివేస్తుంటే జీర్ణ ప్రక్రియ సజావుగా ఉన్నట్లు! అలా జరగటం లేదంటే వివిధ అవస్థాపాకాల్లో.. వివిధ దశల్లో ఎక్కడో సమస్య తలెత్తి.. అజీర్ణం బారినపడుతున్నామనే అర్థం! అందుకే అజీర్ణాన్ని ప్రధానంగా నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు.

1.ఆమాజీర్ణం

ఆహార పచనానికి జఠరాగ్ని మూలం. జఠరాగ్ని మాంద్యం వల్ల ఆహారం సరిగా పచనం కాకుండా అరిగీ అరగని ‘ఆమం’గా ఉండిపోతుంటే ఈ రకం అజీర్ణం తలెత్తుతుంది. ఆహారాన్ని సరిగా నమలకపోయినా, తగినంత ద్రవాలు లేకపోయినా పచనం సరిగా జరగదు. జీర్ణ పరిణామంలో.. అగ్నిప్రక్రియ ఆరంభం కాకముందే.. కఫ ప్రక్రియలో వికృతి వల్ల..జఠరాగ్ని అల్పత్వంతో ఆమం ఏర్పడి.. దాని కారణంగా వచ్చే అజీర్ణమిది.

లక్షణాలు
లక్షణాలు ఎక్కువగా పొట్టలో వూర్థ్వ భాగంలోనే కనబడతాయి. 

*పొట్ట బరువుగా ఉండటం  *వికారం, కొన్నిసార్లు వాంతి కావటం
*ఏ ఆహారం తీసుకుంటే ఆ ఆహారానికి సంబంధించిన తేన్పులు.  *కొన్నిసార్లు తిన్న పదార్ధాలే నోటిలోకి వస్తుండటం
*కళ్ల కింద, దవడల భాగంలో కొద్దిగా ఉబ్బినట్లు, వాపు.

ఔషధాలు
*ఆమాన్ని పచింపజెయ్యటం కోసం.. జఠరాగ్నిని పెంచటం కోసం ఆమపాచనం జరగాలి. అందుకు ఉపవాసం/లంఖణం మంచిది. పూర్తి లంఖణం, లేదంటే కేవలం నీరు మాత్రమే తాగే లంఖణం.. ఇలా రోగి స్థితిని బట్టి వైద్యులు ఒకటి, రెండుపూటలు లంఖణం సూచిస్తారు.
*అగ్నితుండి వటి, చిత్రకాది వటి మాత్రలు  *జీరకాది చూర్ణం, లేదా భాస్కర లవణ చూర్ణం తీసుకోవచ్చు.
*జీరకాద్యరిష్ట కూడా మంచిదే. పుల్లటి తేన్పుల వంటివి ఉంటే మాత్రం దీన్ని తీసుకోకపోవటం మంచిది.

2. విదగ్ధాజీర్ణం

అగ్ని కర్మ ఎక్కువ కావటం వల్ల వచ్చే సమస్య ఇది. ఆమాశయం కింది నుంచి చిన్నపేగు చివరి భాగం వరకూ ఉండే పచ్చ్యమానాశయంలో... అగ్ని వికృతి వల్ల వచ్చే సమస్య ఇది. దీనివల్ల కడుపులో ఆమ్లపిత్తం (అసిడిటీ) తరహా లక్షణాలు ఎక్కువగా కనబడతాయి.

లక్షణాలు
*పేగుల్లో, పొట్టలో గుడగుడా శబ్దం
*పిత్తప్రధానంగా, పులుపుగా తేన్పులు. తేన్పులు వేడిగా కూడా వస్తుంటాయి (సోడా తాగినప్పటిలా)
*కొద్దిగా మగతగా, తలదిమ్ముగా ఉంటుంది.

ఔషధాలు
దీనిలో క్షార స్వభావం ఉండే ఔషధాలు ప్రత్యేకమైనవి. గ్యాస్‌ పైకి వస్తుంటుంది కాబట్టి ‘వాతానులోమనం’ చేయించటం అవసరం.
* అవిపత్తికర చూర్ణం ఒక స్పూను వేసుకుని వేడినీరు తాగొచ్చు. ఇలా లక్షణాలు తగ్గే వరకూ వేసుకోవచ్చు. * శంఖవటి, శంఖభస్మం, మహా శంఖ వటి తీసుకోవచ్చు.
*లఘు సూతశేఖర రసం, కామదుగ్ధవటి, ముక్తాభస్మం, సుక్తి భస్మం.. దీనికి మంచి ఔఫధాలు.

3. విష్టబ్ధాజీర్ణం

ఇది వాత ప్రధానమైన సమస్య. దీని ప్రభావం పక్వాశయంలో.. పెద్దపేగుల్లో ఎక్కువగా కనబడుతుంటుంది కాబట్టి పొట్ట కింది భాగంలో.. బరువుగా, ఏదో సంచారం చేసినట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మలబద్ధకం, అతిగా మలవిసర్జన.. రెండూ వెంటవెంటనే వస్తుంటాయి. మూత్రవిసర్జన ఎక్కువకావటమో, తక్కువ కావటమో ఉంటుంది.

లక్షణాలు
*పొట్టకింది భాగంలో బరువుగా, ఉబ్బరించినట్లుండటం  *పొట్ట స్తంభించినట్టుగా, ఇబ్బందిగా, భారంగా ఉంటుంది.
*అపానవాయువులూ రావు. మలబద్ధకం దీని ముఖ్య లక్షణం. అరుదుగా అతి విరేచనాలూ ఉంటాయి.

ఔషధాలు
*ఇది వాత ప్రధానమైనది కాబట్టి స్నేహస్వేద కర్మలు చేయించాలి. పొట్టపై వేడి కాపడం మంచిది.
*పొట్టపైన మహానారాయణతైలం, ధన్వంతరి తైలం వంటివి మర్దన చేసి కాపడటం పెట్టాలి. దీంతో లోపలి వాయువు క్రమేపీ బయటకుపోతుంది.
*హింగ్వష్టక చూర్ణం, తాళిసాది చూర్ణం సమాన భాగాల్లో వేడి నీటితో తీసుకుంటే విరేచనం అయ్యి.. అజీర్ణ సమస్య ఉపశమిస్తుంది.
*చిత్రకాది వటి మాత్రలు, జీరకాది చూర్ణం దీనిలోనూ తీసుకోవచ్చు.

4. రసశేషాజీర్ణం

మనం తీసుకున్న ఆహారమంతా ఒక రసంగా తయారవుతుంది.. అది రసధాతువుల్లోకి వెళుతుంది.. అది మిగతా ధాతువులను పోషిస్తుంది. ఇదీ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఆహార పచనం సంపూర్ణంగా జరిగినప్పటికీ కూడా.. ఆ రసం ధాతువుల్లో కలవకుండా.. కొద్దిగా మిగిలిపోతుండటం దీనికి మూలం. ఇదేమీ పెద్ద వ్యాధి కాదు. కానీ ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.

లక్షణాలు
*ఆహారం తీసుకోబుద్ధి కాకపోవటం, అన్నద్వేషం  *తేన్పులు వచ్చినా స్వచ్ఛంగానే ఉంటాయి.
* ఆకలి కాదు.. అన్నం తినాలని బుద్ధిపుట్టదు.  * నోటిలో నీరు వూరుతున్నట్టుండటం, రుచి లేకపోవటం
*నోరంతా పూసుకున్నట్టుగా ఏదో రుచిగా ఉంటుంది.  *ఒళ్లంతా బరువుగా అనిపిస్తుండటం

ఔషధాలు
*ఇదేమంత వ్యాధి కాదు. పగటిపూట కొద్దిసేపు నిద్రపోతే అదే తగ్గిపోతుంది. నిద్రలేమి కూడా దీనికి ప్రధాన కారణం. ఆహారం తీసుకోవటానికి ముందు ఒక గంట నిద్రపోతే సరిపోతుంది. అయితే ఆహారం తినకుండా పడుకోవాలి.. నిద్రతో అది చక్కబడుతుంది.
*తగ్గకపోతే చిద్రకాది వటి మాత్రలు వాడుకోవచ్చు.

ఆహార సంభవం వస్తు రోగాహ్యాహార సంభవాః
మనిషి పుట్టుకకు మూలం ఆహారమే. అతనికి పుట్టే వ్యాధులకు కూడా మూలం ఆహారమే. కాబట్టి ఆహారం, నిద్ర వంటి విషయాల్లో క్రమబద్ధత పాటిస్తే అజీర్ణం వంటి వ్యాధులు దరిజేరవు.

అజీర్ణం రాకుండా...
* రాత్రిపూట తేలికపాటి ఆహారం.. అదీ మితంగా తీసుకోవటం మేలు. రాత్రిపూట సాధ్యమైంత త్వరగా ఆహారం తీసుకుని.. కొంత సమయం మేలుకుని ఉన్న తర్వాత అప్పుడు నిద్రించటం మేలు.
* భుక్త్వా శతపదం గచ్ఛత్‌ అన్నది సూత్రం. పగటిపూట ఆహారం తీసుకున్న తర్వాత కొద్ది నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుని నడవటం.. రాత్రిపూట తినగానే నడిచి ఆ తర్వాత విశ్రాంతికి ఉపక్రమించటం మంచిది. కనీసం వంద అడుగులు వేయాలి.
* సాధ్యమైనంత వరకూ తాజాగా, అప్పుడే వండిన వేడివేడి ఆహారం తీసుకోవటం మంచిది.
* దుంపలు తక్కువ తింటూ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం, పప్పు తదితరాలు మితంగా తీసుకోవటం మేలు.

ఏ అజీర్ణంలోనైనా
* జీలకర్ర.. సోపు సమాన భాగాలుగా పొడి చేసుకొని, ఒక గ్లాసు నీటిలో చెంచా పొడిని మరిగించి.. ఆ కషాయాన్ని తాగటం మంచిది. ఇలాగే శుంఠి-జీలకర్ర, శుంఠి-సోపు కషాయం కూడా తీసుకోవచ్చు.
* మజ్జిగలో జీలకర్రపొడి వేసుకుని తాగొచ్చు. జీలకర్ర పొడిలో తినే సున్నం లేదా తినే సోడా కలుపుకొని కూడా తినొచ్చు.
ఈ లక్షణాలు తాత్కాలికంగా కనిపిస్తుంటే దీన్ని కేవలం ‘అపచనం’ అనే అంటారు. అలాకాకుండా ఇవి రోజుల తరబడి వేధిస్తుంటే మాత్రం దీన్ని ‘అజీర్ణమనే’ వ్యాధిగా పరిగణించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు