క్యాన్సర్‌ను జయించాక..

క్యాన్సర్‌కు చికిత్స తీసుకొని, దాన్నుంచి బయటపడ్డాక చాలామందిని వేధించే ప్రశ్న ‘జబ్బు తిరగబెడుతుందా?’ అనే. నిజానికి క్యాన్సర్‌...

Published : 29 Mar 2016 02:45 IST

క్యాన్సర్‌ను జయించాక..

క్యాన్సర్‌కు చికిత్స తీసుకొని, దాన్నుంచి బయటపడ్డాక చాలామందిని వేధించే ప్రశ్న ‘జబ్బు తిరగబెడుతుందా?’ అనే. నిజానికి క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాక వూబకాయం లేదా అధికబరువు, గుండె సమస్యలు, ఎముకలు సన్నబడటం లేదా విరగటం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ ఎక్కువ కావటం, మధుమేహం వంటి సమస్యల బారినపడే అవకాశం లేకపోలేదు. అయితే చికిత్స తీసుకుంటున్నప్పుడు, ఆ తర్వాతా మంచి జీవనశైలిని పాటిస్తే రెండోసారి క్యాన్సర్‌ బారినపడకుండా చూసుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

* తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వివిధ రంగుల పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నివారణకు తోడ్పడతాయి. అలాగే కొవ్వు పదార్థాలు తగ్గించాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో మంచిది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించటంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. బరువు అదుపులో ఉండటానికి, గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి, కండరాలు, ఎముకలు బలోపేతం కావటానికీ తోడ్పడుతుంది.

* పొగ తాగే అలవాటుంటే పూర్తిగా మానెయ్యాలి. గుట్కాలు, జర్దాల వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అలాగే మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఇప్పటికే మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.

* మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని వినటం, పుస్తకాలు చదవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోకుండా వీలైనప్పుడల్లా నలుగురితో కలివిడిగా గడపటం మంచిది. దీంతో మానసిక ఉల్లాసం, ఆనందం కలుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని