కండను కాపాడుకోండి

అంతా మామూలుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కంటికి ఎలాంటి మార్పూ కనబడదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత లోలోపల ఏటా 1% కండరం మోతాదు తగ్గుతూ వస్తుంది.

Published : 26 Apr 2016 00:49 IST

కండను కాపాడుకోండి

అంతా మామూలుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కంటికి ఎలాంటి మార్పూ కనబడదు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత లోలోపల ఏటా 1% కండరం మోతాదు తగ్గుతూ వస్తుంది. క్రమంగా కండర క్షీణత వేగమూ పెరుగుతుంది. నిజానికి 20ల్లో, 30ల ఆరంభంలో అల్పాహారం మానేసినా, ఫాస్ట్‌ ఫుడ్‌ తిన్నా, వ్యాయామం చేయకపోయినా పెద్దగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం తీవ్రమైన ప్రభావాన్నే చూపుతాయి. అయినా మించి పోయిందేమీ లేదు. చిన్న చిన్న జాగ్రత్తలతో కండర క్షీణత వేగాన్ని తగ్గించుకోవచ్చు.

బరువుపై కన్ను: బరువును నియంత్రణలో ఉంచుకోవటం అన్నింటికన్నా ముఖ్యం. కొందరు కొంతకాలం పాటు బరువు పెరగుతుంటారు. తర్వాత కొంతకాలం తగ్గుతుంటారు. ఇలాంటి ధోరణి అదేపనిగా కొనసాగుతుంటే ఒంట్లో కొవ్వు స్థాయులు పెరుగుతుంటాయి. పైగా కండర మోతాదు తగ్గుముఖం పడుతుంటుంది.

ప్రోటీన్‌ కీలకం: కండరాలు పుంజుకోవటంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. చాలామంది మధ్యవయసులో ఆహారం తీసుకోవటం తగ్గిస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. రోజుకు మూడు సార్లు భోజనం చేయాలి. రకరకాల కూరగాయలు, పండ్లతో కూడిన పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పప్పులు, పాలు, పెరుగు, చికెన్‌, చేపలు, గుడ్లు, మాంసం తీసుకోవాలి. వీటితో తగినంత ప్రోటీన్‌ లభిస్తుంది. ఇది కండర దృఢత్వం తగ్గకుండా చూస్తుంది. తిరిగి పుంజుకునేలానూ చేస్తుంది. చిరుతిళ్ల జోలికి వెళ్లకపోవటం మంచిది.

వ్యాయామంతో దన్ను: రోజూ వ్యాయామం చేయటమూ కీలకమే. అరగంట సేపు వ్యాయామం చేసినా చాలా మార్పు కనబడుతుంది. దీంతో కండరాలు బలోపేతమవుతాయి. వయసుతో పాటు కండరం క్షీణించే వేగమూ తగ్గుతుంది. మధ్యవయసులో దాడి చేసే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల బారినపడకుండానూ చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని