చేతి నొప్పికి వ్యాయామాలు

పళ్లు తోముకుంటాం. చొక్కా గుండీలు పెట్టుకుంటాం. భోజనం చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే చేతులతో చేసే పనులెన్నో. చిన్నాచితకా పనుల దగ్గర్నుంచి పెద్ద పెద్ద పనుల వరకూ అన్నింటినీ అలవోకగా చేసేస్తుంటాం.

Published : 23 Aug 2016 02:01 IST

చేతి నొప్పికి వ్యాయామాలు

ళ్లు తోముకుంటాం. చొక్కా గుండీలు పెట్టుకుంటాం. భోజనం చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే చేతులతో చేసే పనులెన్నో. చిన్నాచితకా పనుల దగ్గర్నుంచి పెద్ద పెద్ద పనుల వరకూ అన్నింటినీ అలవోకగా చేసేస్తుంటాం. కానీ ఎప్పుడైనా అరచేతుల్లో నొప్పి తలెత్తితే మాత్రం చిన్న పనులైనా పెద్ద కష్టంగా మారిపోతాయి. కండరాలపై ఒత్తిడి పడటం దగ్గర్నుంచి నాడీసంబంధ సమస్యల వరకు రకరకాల కారణాలు చేతిలో నొప్పికి దారితీయొచ్చు. చాలామందిలో కనబడే సమస్య కీళ్లవాపు (ఆర్థ్రయిటిస్‌). అరచేతి నొప్పిని తగ్గించటానికి మందులు, శస్త్రచికిత్స వంటివి అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాయామాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా కండరాలను, కండర బంధనాలను సాగదీసే వ్యాయామాలు ఎంతగానో మేలు చేస్తాయి. టైప్‌ చేయటం, వస్తువులు పైకెత్తటం వంటి పదేపదే చేసే పనులతో కండరాల పొడవు తగ్గొచ్చు. వాటిని బిగుతుగా చేసి నొప్పి కలిగించొచ్చు. సాగదీత వ్యాయామాలతో కండరాలు, కండర బంధనాల పొడవు పెరిగి మంచి ఉపశమనం లభిస్తుంది.

మణికట్టు ముడవటం

** ఒక చేయిని మోచేతి వద్ద వంచి ఛాతీకి సమానంగా ఉంచాలి.
** రెండో చేతితో బొటనవేలు వైపు నుంచి పట్టుకొని మణికట్టును నెమ్మదిగా కిందికి వంచాలి.
** ఇంకాస్త ఎక్కువగా సాగటానికి చిటికెన వేలి వైపు చేతిని వంచాలి.
** చేయిని ముందుకు చాచి కూడా దీన్ని చేయాలి.
** రెండో చేతితోనూ ఇలాగే చేయాలి.


మణికట్టు తెరవటం

** చేయిని మోచేతి వద్ద వంచి ఛాతీకి సమానంగా ఉంచాలి.
** రెండో చేతితో వేళ్లను పట్టుకొని, నెమ్మదిగా వెనక్కి వంచాలి.
** చేయిని ముందుకు చాచి కూడా దీన్ని చేయాలి.
** రెండో చేతితోనూ ఇలాగే చేయాలి.


ఐసోమెట్రిక్‌ వ్యాయామం

** బల్లకు అరచేతిని ఆనించాలి.
** రెండో చేయిని దానిపై పెట్టాలి.
** కింది చేతిని పైకి లేపేందుకు ప్రయత్నించాలి. కానీ పైచేయితో దాన్ని కదలనీయకుండా చూడాలి.
** రెండో చేయితోనూ అలాగే చేయాలి.
** అరచేయి పైకి ఉండేలా పెట్టి కూడా దీన్ని చేయాలి.

ఈ వ్యాయామాలను నెమ్మదిగా కండరం సాగినట్టు అనిపించేంతవరకు చేయాలి. అయితే నొప్పి కలిగించేలా ఉండకూడదు.
ఒకో వ్యాయామాన్ని 15-30 సెకండ్ల పాటు చేస్తూ.. మధ్యమధ్యలో 30 సెకండ్ల సేపు విరామం ఇవ్వాలి. ఒకో వ్యాయామాన్ని నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఇవి కండరబంధనాల వాపు, మణికట్టు కండరాల బిగువు తగ్గటానికి బాగా ఉపయోగపడతాయి. దీంతో నొప్పి నుంచీ ఉపశమనం లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని