Published : 04 Oct 2016 01:22 IST

ఆస్థమానా.. కూచోబెట్టండి!

ఆస్థమానా.. కూచోబెట్టండి!

స్థమా గలవారికి కొన్నిసార్లు సమస్య ఉన్నట్టుండి తీవ్రమవుతుంటుంది. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌, పుప్పొడి, జంతువుల బొచ్చు, దుమ్ము ధూళి, పొగ, చల్లటి గాలి వంటివి దీన్ని ప్రేరేపిస్తాయి. కొందరిలో శారీరక శ్రమ, వ్యాయామంతోనూ ఆస్థమా తీవ్రం కావొచ్చు. ఇలాంటి సమయంలో శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. పిల్లికూతలు వస్తుంటాయి.

ఆస్థమా తీవ్రమైతే కొన్నిసార్లు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి.. నాలుక, పెదవులు నీలంగా మారొచ్చు కూడా. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాలి.

ఆస్థమా బాధితుల్లో చాలామంది అప్పటికే చికిత్స తీసుకుంటూ ఉంటారు. మందులను వెంట తీసుకొని వెళ్తుంటారు కూడా. అందువల్ల ఎవరికైనా ఉన్నట్టుండి ఆస్థమా తీవ్రమై, శ్వాస తీసుకోవటానికి కష్టపడుతున్నట్టు.. మాట్లాడలేకపోతున్నట్టు చుట్టుపక్కల వాళ్లు గుర్తిస్తే ప్రథమ చికిత్స చేయటం ఎంతో మేలు చేస్తుంది. ముందుగా ఆస్థమా బాధితులను ప్రశాంతంగా కూచోబెట్టాలి. కుర్చీ వెనక భాగం వైపు ముఖం ఉండేలా.. కుర్చీ పైభాగాన చేతులు ఆనించి, ముందుకు వంగేలా కూచోబెట్టటం మరీ మంచిది. దీంతో కొంత బరువు చేతుల మీద పడుతుంది. తర్వాత వారి వద్దనున్న రిలీవర్‌ మందును స్పేసర్‌ ద్వారా పీల్చుకునేలా సాయం చేయాలి. అప్పటికీ ఫలితం కనబడకపోయినా.. మందులేవీ అందుబాటులో లేకపోయినా వెంటనే అత్యవసర అంబులెన్స్‌కు ఫోన్‌ చేయాలి. అలాగే ఆస్థమాతో బాధపడేవారి చుట్టూ ఎక్కువమంది గుమికూడొద్దు. చుట్టూ దడి కడితే పరిశుభ్రమైన గాలి అందక సమస్య మరింత తీవ్రమవుతుంది. ఆందోళన కూడా సమస్యను పెంచుతుంది. కాబట్టి ఆస్థమా బాధితులు గాబరా పడకుండా చూడాలి. వెంట ఉన్నవారు కూడా ప్రశాంతంగా ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు