విటమిన్‌ డి రక్ష!

విటమిన్‌ డి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. రక్తనాళాలను కాపాడుతుంది.

Published : 17 Jan 2017 01:10 IST

తలనొప్పి
విటమిన్‌ డి రక్ష!

విటమిన్‌ డి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. రక్తనాళాలను కాపాడుతుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి సరిగా జరిగేలా చూస్తుంది. అందుకే శారీరక శ్రమ తగ్గిపోయి రకరకాల జీవనశైలి సమస్యలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో విటమిన్‌ డి ప్రాధాన్యత మరింత పెరిగింది. దీని లోపంతో ఆకలి మందగించటం, బరువు తగ్గటం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ వంటి సమస్యలు వేధిస్తాయి. దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. విటమిన్‌ డి లోపంతో తలనొప్పి తలెత్తుతున్నట్టు వెల్లడైంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది స్పష్టంగా కనబడుతుండటం గమనార్హం. విటమిన్‌ డి స్థాయులు 20 ఎన్‌జీ/ఎంఎల్‌ నుంచి 50 ఎన్‌జీ/ఎంఎల్‌ వరకు ఉండటాన్ని నార్మల్‌గా భావిస్తారు. దీని కన్నా తగ్గితే తలనొప్పి రావటం ఎక్కువవుతున్నట్టు ఫిన్‌లాండ్‌ అధ్యయనం పేర్కొంటోంది. విటమిన్‌ డి స్థాయులు 17.6 ఎన్‌జీ/ఎంల్‌ గలవారితో పోలిస్తే 15.3 ఎన్‌జీ/ఎంఎల్‌ గలవారు కనీసం వారానికి ఒకసారి తలనొప్పి బారినపడుతున్నట్టు బయటపడింది. విటమిన్‌ స్థాయులు తగ్గుతున్నకొద్దీ తలనొప్పి రావటం కూడా పెరుగుతూ వస్తోంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు బయట అంతగా గడపకపోవటం, శరీరానికి ఎండ సరిగా తగలక పోవటం దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిజానికి విటమిన్‌ డి- ఆహారం ద్వారా చాలా తక్కువగా లభిస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు దీన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది. అందువల్ల రోజూ చర్మానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో తలనొప్పి ఒక్కటే కాదు. ఇతరత్రా జబ్బులనూ నివారించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని