పెరటి ఆరోగ్యం!

పెరటి వైద్యం పనికిరాదంటారు. కానీ పెరటి తోటలు మాత్రం బాగానే పనికొస్తాయి. పెరట్లో కాసిన కూరగాయలను అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే వాటి రుచే వేరు.

Published : 21 Mar 2017 01:33 IST

పెరటి ఆరోగ్యం!

పెరటి వైద్యం పనికిరాదంటారు. కానీ పెరటి తోటలు మాత్రం బాగానే పనికొస్తాయి. పెరట్లో కాసిన కూరగాయలను అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే వాటి రుచే వేరు. అప్పుడే పూసిన పూవుల వాసన ముక్కుకు తగలగానే మనసు గాల్లో తేలిపోతుంది. తోటల పెంపకానికి పడే శ్రమ కూడా వృథా కాదు. శరీరాన్ని ఫిట్‌గా ఉండేందుకు, ఫలితంగా ఒత్తిడి తగ్గేందుకూ తోడ్పడుతుంది. ఇలా పెరటి తోటల పెంపకం మానసికంగా, శారీరకంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పెరటి తోటల పెంపకంతో ఒనగూడే ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు సొంతం కావటం. ఇష్టపడి, కష్టపడి పెంచుకున్న కూరగాయలు, పండ్లు. పైగా మరింత రుచిగానూ ఉంటాయాయె. అందువల్ల పీచు, ఖనిజాలు, విటమిన్లతో నిండిన పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం అలవాటవుతుంది. దీంతో పక్షవాతం, గుండెజబ్బులతో పాటు కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పూ తగ్గుతుంది. పేగుల కదలికలు మెరుగుపడటం వల్ల మలబద్ధకమూ దరిజేరదు. కొవ్వు పదార్థాలు, ఎక్కువ కేలరీలను ఇచ్చే వాటికి బదులు పండ్లు, కూరగాయలను తీసుకుంటే బరువు తగ్గటానికీ తోడ్పడుతుంది. తోటల పెంపకంలో పిల్లలనూ పాలు పంచుకునేలా చేస్తే వారిలోనూ మంచి ఆహార అలవాట్లు పెంపొందుతాయి. రోజుకు 2,000 కేలరీలు తీసుకునేవారు విధిగా 2.5 కప్పుల కూరగాయలు, 2 కప్పుల పండ్లు తీసుకోవాలన్నది నిపుణుల సూచన. కానీ మనలో చాలామంది దీని కన్నా చాలా తక్కువగానే తింటున్నారు. పెరట్లో పండించటం ద్వారా కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతుందనటంలో సందేహం లేదు. సహజమైన వాతావరణాల్లో శారీరక శ్రమ చేస్తే ప్రకృతితో మమేకమయ్యామన్న భావన కలుగుతుంది. ఇది మానసిక స్థితి మెరుగుపడటం, ఆందోళన తగ్గటం, ఆత్మవిశ్వాసం పెరగటం వంటి వాటికి దోహదం చేస్తున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అయితే చాలామంది పెరటి తోటల పెంపకానికి స్థలం లేదని భావిస్తుంటారు. మనసుంటే మార్గం దొరక్కపోదు. నిజానికి పాలకూర, టమోటా, పచ్చిమిరప వంటి వాటికి పెద్దగా స్థలం అవసరం ఉండదు కూడా. వీటిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. దీంతో ఇటు రుచికి రుచీ.. అటు ఆరోగ్యానికి ఆరోగ్యమూ సొంతమవుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని