తల్లీ... ఈ కోతలెందుకు?

తల్లీ... ఈ కోతలెందుకు? అమ్మ కడుపులో... అపురూపంగా.. అత్యంత సహజంగా పెరిగే నలుసు.. అంతే సహజంగా బయటకు రావాలి! ఈ ప్రకృతిలో ఏ జీవిని చూసినా జరిగేది అదే...మనకు మేధస్సు ఉంది. వైద్యపరంగా.. వైజ్ఞానికంగా ఎంతో పురోగమించాం.

Published : 11 Apr 2017 01:55 IST

తల్లీ... ఈ కోతలెందుకు?

అమ్మ కడుపులో... అపురూపంగా.. అత్యంత సహజంగా పెరిగే నలుసు.. అంతే సహజంగా బయటకు రావాలి!
ఈ ప్రకృతిలో ఏ జీవిని చూసినా జరిగేది అదే...
ఒక్క మనిషిని తప్ప!
మనకు మేధస్సు ఉంది. వైద్యపరంగా.. వైజ్ఞానికంగా ఎంతో పురోగమించాం. ఎన్నో సాధించాం. కాన్పు కష్టమై తల్లీబిడ్డలకు ఏదైనా ముప్పు తలెత్తినా.. వారిని కాపాడుకునేందుకు అద్భుతమైన ఆపరేషన్‌ విధానాన్ని ఆవిష్కరించుకున్నాం!
అది మన ఘనతే!
అయితే.. ఇప్పుడు ఈ పురోగమనమే పక్కదారి పడుతోంది. ఈ అద్భుత విధానమే మన పాలిట వైపరీత్యంలా పరిణమిస్తోంది. సహజ ప్రసవాల సంఖ్య తగ్గిపోతూ... సిజేరియన్‌ కాన్పులు పెరుగుతున్నాయని తాజా గణాంకాలు ఘోషిస్తున్నాయి. దీనర్థం మనం ఎటుపోతున్నాం?
సిజేరియన్‌ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే విధానం. కానీ మనం అనవసరంగా, అడ్డదిడ్డంగా సిజేరియన్లను ఆశ్రయిస్తున్నామంటే లేనిపోని విపరిణామాలను కొని తెచ్చుకోవటమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే కలవరపాటులో ఉంది. సిజేరియన్లను తగ్గించి.. కాన్పులు సహజంగా జరిగేలా చూసుకోవటం అవసరమని నొక్కి చెబుతోంది. అందుకే దీనికి సంబంధించిన వివరాలను సమగ్రంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

తల్లీబిడ్డలిద్దరికీ ఎలాంటి హానీ లేకుండా.. సుఖ ప్రసవం జరగాలంటే ఆసుపత్రి కాన్పులు పెరగాల్సిందే! అందులో సందేహమేం లేదు. దీనివల్ల కాన్పు సమయంలోగానీ, ఆ తర్వాతగానీ ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే తల్లీబిడ్డలిద్దరినీ సంరక్షించుకునేందుకు వీలుంటుంది. అయితే గణాంకాలు చూసినప్పుడు.. ఆసుపత్రుల సంఖ్య, వైద్యుల అందుబాటు పెరుగుతున్న కొద్దీ సిజేరియన్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు వెల్లడవుతుండటం ఆందోళనకరమైన వాస్తవం. ఇందుకు పట్టణ ప్రాంతాల్లో సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా కనబడుతుండటమే స్పష్టమైన నిదర్శనం. ఇదే సమయంలో- నానాటికీ ఆసుపత్రుల్లో విపరీత ధోరణులు పొడసూపుతూ, లాభాపేక్షతో అవసరం లేకపోయినా సిజేరియన్లు చేసేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి.. కాన్పు సహజంగా జరిగేలా చూసేందుకు ఏం చెయ్యాలి? ఎప్పుడు సిజేరియన్‌ అవసరమవుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా, అత్యవసరంగా సిజేరియన్‌ కాన్పు చెయ్యాలన్న దానిపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. వీటిని పాటించినంత కాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ మన ప్రాంతంలో సిజేరియన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం ప్రస్తుతం ఆందోళనకరంగా పరిణమిస్తోంది.

అత్యవసరమైతేనే జోక్యం
ప్రకృతి సహజంగా జరిగిపోయే పురిటి నొప్పులు, కాన్పుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకపోవటమే ఉత్తమం. కృత్రిమంగా నొప్పులు తెప్పించే ప్రయత్నాలు చేయకుండా.. సాధ్యమైనంత వరకూ సహజంగా జరిగేలా చూడాలి.
* తల్లీబిడ్డల పరిస్థితులన్నీ బాగుంటే- నెలలు పూర్తిగా నిండి, గడువు తేదీ దాటినా కూడా.. కృత్రిమంగా నొప్పులు తెప్పించాల్సిన అవసరమేమీ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా పేర్కొంటోంది. ఇలా వారం వరకూ కూడా వేచి చూడొచ్చు.
* 39 వారాల నుంచీ కూడా గర్భిణి చెకప్‌కు వచ్చినపుడు ‘స్ట్రిప్పింగ్‌’ చేస్తే కాన్పు సహజంగా అయ్యే అవకాశం పెరుగుతున్నట్టు ఇప్పుడు స్పష్టంగా గుర్తించారు. ఈ సమయంలో యోనిని పరీక్షించటంతో పాటు గర్భాశయ ముఖద్వారంలోకి మృదువుగా వేలును పోనిచ్చి మాయ పొరలను కొద్దిగా వేరు చేయటానికి ప్రయత్నిస్తారు. దీంతో కృత్రిమంగా నొప్పులు తెప్పించాల్సిన అవసరం తగ్గి, సహజంగా నొప్పులు వచ్చే అవకాశముంది.
* కృత్రిమ నొప్పులతో సిజేరియన్‌ అవసరం పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు వీలైనంత తగ్గించాలి. గతంలో మధుమేహం వచ్చి, ఇన్సులిన్‌ మీద ఉన్న గర్భిణికి, 38 వారాల తర్వాత- కృత్రిమంగానైనా నొప్పులు తెప్పించాలని భావించే వాళ్లు. కానీ ఇది అవసరం లేదని ఇప్పుడు స్పష్టంగా గుర్తించారు. మధుమేహం నియంత్రణలో ఉండి, కడుపులో బిడ్డ బాగుంటే.. వీరి విషయంలోనూ వేచి చూడటమే ఉత్తమం.
* కాన్పు నొప్పులు మొదలైన తర్వాత కూడా... ఎక్కడైనా గాడి తప్పుతుంటేనే వైద్యుల జోక్యం అవసరమవుతుంది. అందుకే వైద్యులు పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తూ... కాన్పు దానంతట అదే ముందుకు సాగుతుండేలా వేచి చూడటం మంచిది. సహజ కాన్పుకు కొన్నిసార్లు 12-18 గంటలు కూడా పట్టొచ్చు. కాబట్టి సుశిక్షితులైన ప్రసూతి వైద్యులు, నర్సులు, మత్తు డాక్టర్లు, పిల్లల డాక్టర్లు.. వీరంతా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం అవసరం. వీరంతా కూడా సాధ్యమైనంత వరకూ సహజంగానే కాన్పు చెయ్యాలన్న సంకల్పంతో ఉండాలి. అప్పుడే సిజేరియన్లు తగ్గి.. సహజ ప్రసవాలు పెరుగుతాయి.

ముందు నుంచే సంసిద్ధత!
గర్భిణి ఆరోగ్యవంతంగా ఉండి, లోపల బిడ్డ చక్కగా పెరుగుతూ, గర్భధారణ కాలమంతా కూడా సజావుగా సాగిపోతే... ఆమెకు కాన్పు చాలా వరకూ సహజంగానే జరిగే అవకాశం ఉంటుంది.
* గర్భధారణ తర్వాత కూడా చక్కటి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చెయ్యటం, బరువు పెరగకుండా- వూబకాయం రాకుండా చూసుకోవటం ముఖ్యం. రోజూ 45 నిమిషాల చొప్పున తేలికపాటి నడక వల్ల వీరిలో శ్రమను తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే కాన్పు దగ్గర పడుతున్న కొద్దీ బిడ్డ తల కిందికి దిగి, కటి ప్రాంతంలో కుదురుకుని, పరిస్థితి సహజ కాన్పుకు అనువుగా తయారవుతుంది. క్రమం తప్పకుండా వైద్యులకు చూపించుకుని చెకప్‌ చేయించుకోవటం.. రక్తహీనత లేకుండా, రక్తంలో హిమోగ్లోబిన్‌ తగినంత ఉండేలా చూసుకోవటం, ఒకవేళ అది తక్కువుంటే మందులు వేసుకోవటం, క్యాల్షియం మాత్రలు వేసుకోవటం.. ఇవన్నీ చాలా ముఖ్యం. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ‘మనం సహజ కాన్పు కోసమే ప్రయత్నించాలన్న’ దృఢ సంకల్పంతో, విశ్వాసంతో ఉండాలి. ఇటీవలి కాలంలో ‘ప్రీనేటల్‌ క్లాసులంటూ’ గర్భిణులకు ప్రత్యేక అవగాహనా తరగతులు, శిక్షణ ఇస్తున్నారు. సహజ కాన్పు కోసం సిద్ధమవటంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.


నొప్పుల మత్తు

కాన్పు నొప్పుల తీవ్రత అంతగా తెలియకుండా ‘ఎపిడ్యూరల్‌ మత్తు’ ఇచ్చే సదుపాయం నేడు అందుబాటులో ఉంది. తొలిచూరు కాన్పుల్లో దీంతో ప్రయోజనం అధికం. వీళ్లు నొప్పులు పెరగ్గానే ఇక తట్టుకోలేమనీ, సిజేరియన్‌ చేసెయ్యండనీ వైద్యుల మీద విపరీతంగా ఒత్తిడి తెస్తుంటారు. మత్తు సదుపాయంతో దీన్ని నివారించుకోవచ్చు. కాకపోతే ఈ రకం మత్తు ఇచ్చినప్పుడు- సర్విక్స్‌ పూర్తిగా విప్పారినా కూడా వెంటనే కాన్పు చెయ్యకూడదు. మత్తు వల్ల ఆమె వెంటనే ముక్కి, బిడ్డను కిందికి బలంగా నెట్టలేదు. కాబట్టి కొంత సమయం తీసుకుని.. బిడ్డ తల పూర్తిగా కిందికి వచ్చే వరకూ వేచిచూసి కాన్పు చేయాలి.


సిజేరియన్‌ ఎప్పుడు అవసరం?

కాన్పు కావటం సహజమే అయినా.. కొన్ని సందర్భాల్లో సిజేరియన్‌ అవసరం తలెత్తొచ్చు. దీనిపై కొన్ని సందర్భాల్లో ముందే నిర్ణయం తీసుకోవచ్చు. కాన్పు సమయంలో తలెత్తే సమస్యల మూలంగా అప్పటికప్పుడు సిజేరియన్‌ చేయాల్సిన అవసరమూ ఉండొచ్చు.

ముందుగా నిర్ణయించుకునే సందర్భాలు..
* బిడ్డ, తల శరీరం పెద్దగా ఉండి.. తల్లి కటిభాగం నుంచి సురక్షితంగా వెళ్లలేని పరిస్థితి తలెత్తటం. బిడ్డ సైజు కంటే తల్లి కటి భాగం చిన్నగా ఉండటం.
* ఒకసారి సిజేరియన్‌ చేయించుకున్నా తర్వాత సహజ కాన్పు కావొచ్చు. కానీ సహజ కాన్పుతో గర్భాశయం చిట్లే ముప్పు వంటివి గలవారికి తిరిగి సిజేరియన్‌ చేయాల్సిన అవసరముండొచ్చు.
* సహజ కాన్పులో కవలలు పుట్టటం తరచుగా చూసేదే. అయితే ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది పుట్టే అవకాశమున్నప్పుడు కొందరికి సిజేరియన్‌ అవసరముండొచ్చు.
* మాయ పొర గర్భాశయ గోడకు చాలా కిందికి అంటుకొని ఉండి, గర్భాశయ ముఖద్వారం గుండా బిడ్డ బయటకు వెళ్లకుండా అడ్డుపడుతుండటం.
* బిడ్డం అడ్డం తిరగటం.
* తలకు బదులు బిడ్డ కాళ్లు ముందు వైపునకు ఉండటం. కడుపును నొక్కుతూ బిడ్డ తల ముందు వైపునకు తీసుకురాలేకపోతే సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది.

అత్యవసరంగా చేయాల్సిన సందర్భాలు..
* గర్భాశయ ముఖద్వారం వెడల్పు కావటం మధ్యలోనే ఆగిపోవటం. బిడ్డ ముందుకు కదలకుండా నిలిచిపోవటం.
* బొడ్డుతాడు బిడ్డ మెడకు చుట్టుకోవటం. బిడ్డ తలకు, తల్లి కటిభాగానికి మధ్యలో బొడ్డుతాడు పట్టేసుకోవటం.
* గర్భాశయ ముఖద్వారం నుంచి బిడ్డ కన్నా ముందే బొడ్డు తాడు ముందుకు తోసుకురావటం.
* బిడ్డ పుట్టకముందే గర్భాశయం గోడ నుంచి మాయ పొర విడిపోవటం.
* కాన్పు సమయంలో ఒత్తిడి మూలంగా బిడ్డ గుండె వేగం పెరగటం వంటి సమస్యలు తలెత్తటం. ఇలాంటి సమయంలో బిడ్డ కాన్పును ఏమాత్రం తట్టుకోలేదని భావిస్తే వెంటనే సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది.


5% కంటే తగ్గకూడదు!
15% కంటే పెరగకూడదు!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా సిజేరియన్లనేవి నూటికి 15 కంటే మించకూడదు. అంతకు మించి జరుగుతున్నాయంటే ఎక్కడో తప్పు జరుగుతోందని, దాన్ని కచ్చితంగా చక్కదిద్దాల్సిందేనని అర్థం. అదే సమయంలో ఏ ప్రాంతంలోనైనా 5% కంటే తక్కువగా జరుగుతున్నాయంటే.. అక్కడి ప్రజలకు అసలు ‘సిజేరియన్‌’ వంటి కీలకమైన, అత్యవసరమైన, ప్రాణరక్షణ వైద్య సదుపాయం అందుబాటులో లేదేమోనని చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకే సిజేరియన్లు 5-15% మధ్యే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోందిగానీ.. మన ప్రాంతంలో ముఖ్యంగా.. మన తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల సిజేరియన్ల సంఖ్య విపరీతమైపోయిందని, ఎన్నడో 27% దాటిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో అయితే ఇది ఏకంగా 35.2% మించిపోతోంది. దీనర్థం అనవసర కోతలు పెరిగిపోతున్నాయనే! అనవసర సిజేరియన్ల వల్ల సమస్యలు పొంచి ఉంటాయనే వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం. ఇకనైనా మనం కళ్లు తెరిచి.. కోతలకు స్వస్తి పలికి.. సహజ కాన్పుల కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


సిజేరియన్లు: కుటుంబ ఒత్తిడీ కారణమే!

తేలికగా పని పూర్తి చేసుకునేందుకు వైద్యులు, డబ్బు కోసం ఆసుపత్రులే అనవసరంగా సిజేరియన్లు చేస్తున్నారన్న భావన మన సమాజంలో బలంగా వినిపిస్తోంది. అయితే వాస్తవాలను పరిశీలించినప్పుడు సిజేరియన్‌ చెయ్యాలని గర్భిణి కుటుంబం నుంచి ఒత్తిళ్లు వస్తున్న సందర్భాలు కూడా తక్కువేం కాదు. ఇందులో ప్రధానంగా మూడు రకాలు కనబడుతున్నాయి.

1. నొప్పుల భయం
నేటి తరం పిల్లల్లో కాన్పు నొప్పుల తీవ్రతను తట్టుకునేంటి ఓర్పు, సత్తువ అంతగా ఉండటం లేదు. దీంతో చాలామంది ముందుగానే సిజేరియన్‌ కోసం సిద్ధపడిపోతున్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని.. ‘పిల్ల నొప్పులకు అతలాకుతలమైపోతోంది, ఇక ఆపరేషన్‌ చేసెయ్యండి డాక్టరుగారూ!’ అని తొందరపెడుతున్నారు కూడా. కొందరేమో గతంలో కాన్పు సమయంలో ఎదురైన నొప్పులను తల్చుకుని వణికిపోతుంటారు. వీటన్నింటి వల్లా.. సహజ కాన్పు కోసం చూద్దామని వైద్యులు సర్దిచెప్పినా సిజేరియన్‌ కోసం ఒత్తిడి పెంచటం పెరిగిపోతోంది. సిజేరియన్‌ అనేది ఆపరేషనే అనీ, దానివల్ల తర్వాత నొప్పులు తప్పవన్న వాస్తవాన్ని వీరు గుర్తించటం లేదు.

2. బిడ్డకు హాని చేస్తుందనే భయం
లేటుగా పెళ్లి, లేటు వయసు గర్భాలు సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో.. చాలామంది తమకు సహజ కాన్పు అయ్యే అవకాశం తక్కువనీ, దానికంటే సిజేరియనే మేలని భావిస్తున్నారు. సహజ కాన్పులో బిడ్డకేమైనా హాని జరుగుతుందేమోనన్న భావన చాలామందిలో బలంగా నాటుకుపోయింది. పండంటి బిడ్డ కోసం ఆ మాత్రం కోతను భరించలేమా? అని అలోచించేవారూ పెరుగుతున్నారు. ఇది సరైన ధోరణి కాదు.

3. నక్షత్రాలూ, మూహూర్తాలూ!
మంచి ఘడియల్లో పుట్టిన బిడ్డకు దివ్యమైన భవిష్యత్తు ఉంటుందని నమ్ముతూ.. ముహూర్తాలు పెట్టించుకుని మరీ సిజేరియన్‌ చేయించుకునే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది. అలాగే మరికొందరు ఏదో ఒక ప్రత్యేక తేదీని ఎంచుకొని, ఆ రోజే సిజేరియన్‌ చెయ్యాలని వైద్యులను వేడుకొంటున్నారు. ఈ ధోరణుల వల్లా సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది.

మనం ఎంత తేలికగా చెప్పుకొంటున్నా సిజేరియన్‌ అనేది వాస్తవానికి పెద్ద ఆపరేషన్‌. దీంతో అస్సలు దుష్ప్రభావాలు ఉండవని చెప్పలేం. రక్తం ఎక్కువగా పోవచ్చు, ఇన్ఫెక్షన్లు రావచ్చు. మత్తు సమస్యలూ ఎదురవ్వచ్చు. ఏ రకంగా చూసుకున్నా సహజ కాన్పుకంటే సిజేరియన్‌తో సమస్యలు ఎక్కువే!


సహజమే లాభం!

* సహజ కాన్పుతో పొట్ట మీద కోత, మచ్చలుండవు. చాలా త్వరగా కోలుకుంటారు. బిడ్డకు సత్వరమే పాలివ్వటం ఆరంభిస్తారు. అదే సిజేరియన్‌ అయితే- కొన్ని రోజుల వరకూ కూడా కదల్లేకపోవటం, నొప్పి వంటి సమస్యలుంటాయి. గాయాలు మానటానికి కొన్నిసార్లు ఒకటి రెండు నెలలు కూడా పట్టొచ్చు.
* సిజేరియన్‌ చేసే సమయంలో మూత్రాశయానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కోత పెట్టినప్పుడు నాడులు తెగే అవకాశం ఉంటుంది. దీంతో రకరకాల మూత్ర సమస్యలు తలెత్తచ్చు. కోతబెట్టిన చోట సూక్ష్మమైన రక్తపు గడ్డలు ఏర్పడి, అవి రక్తప్రవాహంలో కలిసి ­పిరితిత్తుల్లో చేరి, ప్రాణాల మీదికీ రావొచ్చు.
* ఒకసారి సిజేరియన్‌ చేస్తే.. మళ్లీ రెండోసారీ సిజేరియన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎక్కువసార్లు సిజేరియన్‌ చేస్తే చాలా సమస్యలు ఎదురవుతాయి.
* సిజేరియన్‌ కోత మచ్చ దగ్గర నొప్పి, బాధలు చాలాకాలం ఉండొచ్చు. నూటికి 10 మందికి ఈ నొప్పి దీర్ఘకాలం వేధిస్తోందని గుర్తించారు.
* కాన్పు తర్వాత లేచి తిరుగుతూ నడుము కండరాలను ఎంత త్వరగా బలోపేతం చేస్తే అంత మంచిది. కానీ సిజేరియన్‌ కారణంగా అవేమీ చెయ్యలేరు, ఫలితంగా తర్వాతి కాలంలో నడుము నొప్పుల వంటివి ఎంతోమందిని వేధిస్తుంటాయి.
* సిజేరియన్‌ చేయించుకున్న వారికి భవిష్యత్తులో గర్భసంచీ తీసేయ్యాల్సి వస్తే ల్యాప్రోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేయటం కష్టం. పొట్ట మీద పెద్దకోత పెట్టే ఆపరేషన్‌ చెయ్యాలి. ఈ కోతల వల్ల పేగు పైకి తోసుకొచ్చే, హెర్నియాల ముప్పు పెరుగుతుంది.
* సిజేరియన్‌ ద్వారా పుట్టిన బిడ్డలకు ఆస్థమా వంటి శ్వాస సమస్యల ముప్పు ఎక్కువ.

సిజేరియన్‌తో పోలిస్తే.. సహజ కాన్పులో సమస్యలు తక్కువే అయినా.. ఒక్కోసారి ఉన్నట్టుండి పరిస్థితులు మారిపోవచ్చు. తల్లికి బీపీ పెరిగిపోవటం, బిడ్డ గుండె స్పందనలు తగ్గటం వంటివి ఎదురైతే ఆగమేఘాల మీద సిజేరియన్‌ చేసేయాల్సి ఉంటుంది. ఇందుకు తగిన సదుపాయాలు, సంసిద్ధత ఎప్పుడూ ఉండాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని