క్యాన్సర్‌ రక్షణ కవచాలు!

వంటిల్లే ఆరోగ్యశాల! తిండే ఔషధం!! సరిగ్గా చూడాలే గానీ బోలెడన్ని ఆరోగ్యదాయినిలు.. అదీ ఔషధాలుగా ఉపయోగపడేవీ మన కళ్లముందే కదలాడుతుంటాయి. అలాంటివే.. యాపిల్‌, పసుపు, ద్రాక్ష! వీటి గురించి కొత్తగా తెలుసుకోవాల్సిదేముందని అనుకోకండి. ఇవి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు తేలింది మరి.

Published : 27 Jun 2017 02:00 IST

యాపిల్‌.. పసుపు.. ద్రాక్ష
క్యాన్సర్‌ రక్షణ కవచాలు!

వంటిల్లే ఆరోగ్యశాల! తిండే ఔషధం!! సరిగ్గా చూడాలే గానీ బోలెడన్ని ఆరోగ్యదాయినిలు.. అదీ ఔషధాలుగా ఉపయోగపడేవీ మన కళ్లముందే కదలాడుతుంటాయి. అలాంటివే.. యాపిల్‌, పసుపు, ద్రాక్ష! వీటి గురించి కొత్తగా తెలుసుకోవాల్సిదేముందని అనుకోకండి. ఇవి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను చాలా సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు తేలింది మరి.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌. పురుషుల్లో తరచుగా కనబడే క్యాన్సర్లలో ఇదీ ఒకటి. కొందరిలో ఇది ప్రాణాంతకంగానూ పరిణమిస్తుంది. కానీ దీన్ని తొలిదశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే తీవ్ర దశకు చేరుకోకుండా చూసుకోవచ్చు. ఈ విషయంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం కొత్త ఆశలు రేపుతోంది. యాపిల్‌, పసుపు, ఎర్ర ద్రాక్ష వంటి వాటిల్లోని రసాయనాలు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కణాల వృద్ధిని నిలువరిస్తున్నట్టు తేలటం గమనార్హం. ముఖ్యంగా యాపిల్‌ తొక్క, రోజ్‌మేరీల్లోని యూరోసిలిక్‌ ఆమ్లం.. పసుపులోని కర్‌క్యుమిన్‌.. ఎర్ర ద్రాక్ష, దాల్చిన చెక్క, బెర్రీ పండ్లలోని రెస్‌వెరట్రాల్‌ అమోఘంగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన పైనే దాడి చేయటం వల్ల తలెత్తే వాపు ప్రక్రియ, దీర్ఘకాల ఇన్‌ఫెక్షన్ల వంటి వాటి మూలంగా కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా వీటిలోని జన్యువుల పనితీరు మారిపోయి క్యాన్సర్‌ కణాలుగా మారే అవకాశమూ పెరుగుతుంది. ఇలాంటి ముప్పును యూరోసిలిక్‌ ఆమ్లం, కర్‌క్యుమిన్‌, రెస్‌వెరట్రాల్‌ తగ్గిస్తుండటం విశేషం. అంతేకాదు.. ఇవి క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందటానికి అసవరమైన గ్లుటమైన్‌ అనే అమైనో ఆమ్లాన్ని వాటికి అందకుండా చేస్తున్నాయి కూడా. ఒకరకంగా క్యాన్సర్‌ కణాలకు పోషకాలు అందకుండా చేసి అవి చనిపోవటానికి దారితీస్తున్నాయన్నమాట. మామూలు ఆహార పదార్థాల్లోనూ ఇలాంటి శక్తిమంతమైన రసాయనాలు దాగున్నట్టు గుర్తించటం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో గొప్ప ముందడుగని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను నిలువరించేంత మొత్తంలో యాపిల్‌, ద్రాక్ష, పసుపు వంటి వాటిని మనం తీసుకోకపోవటం కుదరకపోవచ్చు. అందువల్ల వీటిల్లోని రసాయనాలను పెద్దమొత్తంలో సేకరించి.. మనం వాడుకోవటానికి అనువుగా తీర్చిదిద్దటంపైనా పరిశోధకులు దృష్టి సారించారు. యాపిల్‌, పసుపు, ద్రాక్ష వంటి వాటితో ఇతరత్రా పోషకాలు కూడా లభిస్తాయి కాబట్టి వీటిని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని