రాళ్లు మోయొద్దు!

కిడ్నీలో రాళ్ల సమస్య ఒకసారితో పోయేది కాదు. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 50% మందికి ఏడేళ్లలోపే ఇవి రెండోసారి పుట్టుకు వచ్చే అవకాశముంది. అలాగని వీటిని నివారించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే కాస్తంత దృఢ నిశ్చయం అవసరం.

Published : 11 Jul 2017 01:22 IST

రాళ్లు మోయొద్దు!

కిడ్నీలో రాళ్ల సమస్య ఒకసారితో పోయేది కాదు. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు. సుమారు 50% మందికి ఏడేళ్లలోపే ఇవి రెండోసారి పుట్టుకు వచ్చే అవకాశముంది. అలాగని వీటిని నివారించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే కాస్తంత దృఢ నిశ్చయం అవసరం. మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవటం వల్ల తలెత్తే స్ఫటికాలు కిడ్నీలో రాళ్లకు దారితీస్తాయి. ఇవి మూత్రకోశంలో కదులుతుంటాయి కూడా. ఒకవేళ మూత్రమార్గంలో ఇరుక్కుపోతే మూత్రం సరిగా రాకపోవటం, మంట, నొప్పి వంటివి వేధిస్తాయి. సాధారణంగా ఆక్జలేట్‌ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల ఏర్పడే రాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన శరీరం ప్రోటీన్‌ను వినియోగించుకునే క్రమంలో వెలువడే యూరిక్‌ ఆమ్లంతోనూ రాళ్లు ఏర్పడొచ్చు. మరి వీటిని నివారించుకోవటమెలా? ఇవి ఏర్పడే పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవటమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. ఇందుకు తేలికైన పద్ధతులెన్నో ఉన్నాయి.
* నీరు ఎక్కువగా తాగటం: నీరు ఎక్కువగా తాగటం వల్ల రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి రోజుకు 2 లీటర్ల మూత్రం వచ్చేలా తగినంత నీరు తాగాలి. నిమ్మరసం కలిపిన నీళ్లు, బత్తాయి రసం తీసుకున్నా మంచిదే. ఇలాంటి పుల్లటి పండ్లు రాళ్లు ఏర్పడకుండానూ కాపాడతాయి.
* తగినంత క్యాల్షియం: ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం తీసుకోకపోతే మూత్రంలో ఆక్జలేట్‌ స్థాయులు పెరిగి రాళ్లు ఏర్పడొచ్చు. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి. అదీ ఆహారం ద్వారా అందేలా చూసుకుంటేనే మేలు. ఎందుకంటే క్యాల్షియం మాత్రలతో కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన మగవారికి రోజుకు 1,000 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. అలాగే 800-1,000 ఐయూ విటమిన్‌ డి కూడా తీసుకోవాలి. ఇది క్యాల్షియాన్ని శరీరం గ్రహించుకోవటంలో తోడ్పడుతుంది.
* ఉప్పు పరిమితం: సోడియం అధికంగా తీసుకుంటే మూత్రంలో క్యాల్షియం స్థాయులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు పరిమితంగానే తీసుకోవాలి. రోజుకు 2,300 మిల్లీగ్రాముల సోడియం తీసుకోవచ్చు. సోడియంతో కిడ్నీ రాళ్లు ఏర్పడే స్వభావం గలవారైతే రోజుకు 1,500 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. ఇది రక్తపోటు తగ్గటానికి, గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.
* మాంసాహారం మితంగా: మాంసం, చికెన్‌, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటివి ఎక్కువగా తింటే వీటి ద్వారా లభించే ప్రోటీన్‌.. మూత్రంలో యూరిక్‌ ఆమ్లం మోతాదులు పెరిగేలా చేసి కిడ్నీ రాళ్లకు దారితీయొచ్చు. ప్రోటీన్‌ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్‌ స్థాయులు కూడా పడిపోతాయి. కాబట్టి మాంసాహారం మితంగా తీసుకోవటం మంచిది.
* ఆక్జలేట్‌ పదార్థాలు వద్దు: బీట్‌రూట్‌, చాక్లెట్‌, పాలకూర, తేయాకు, గింజపప్పుల వంటి వాటిల్లో ఆక్జలేట్‌ అధికంగా ఉంటుంది. ఇక శీతల పానీయాల్లో ఫాస్ఫేట్‌ ఎక్కువ. ఇవి రెండూ కిడ్నీ రాళ్లకు దారితీసేవే. అందువల్ల కిడ్నీ రాళ్లతో బాధపడేవారు వీలైతే వీటికి దూరంగా ఉండటమే మేలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని