Published : 25 Jul 2017 01:33 IST

తిన్నాక నీరసం!

తిన్నాక నీరసం!

కొందరికి ఏదైనా తిన్న వెంటనే అలసట, నీరసం ఆవరిస్తుంటాయి. నిద్ర ముంచుకొస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చాలామంది తమకు మధుమేహం వచ్చిందేమోననీ భయపడుతుంటారు. కానీ కొందరిలో భోజనం చేసిన తర్వాత ఎలాంటి కారణం లేకుండానే రక్తంలో గ్లూకోజు స్థాయులు పడిపోయిన మాదిరిగా లక్షణాలు కనబడొచ్చు. దీన్నే ‘ఇడియోపతిక్‌ పోస్ట్‌-పాండ్రియల్‌ హైపోగ్లైసీమియా’ (ఐపీఎస్‌) అంటారు. వీరికి రక్తపరీక్ష చేస్తే గ్లూకోజు స్థాయులు మామూలుగానే ఉంటాయి. పిండి పదార్థం అధికంగా గల పదార్థాలు తినటం మూలంగా ఇది మరింత ఎక్కువవుతూ ఉంటుంది. దీంతో కాళ్లు చేతులు వణకటం, ఆందోళన, చెమట, చలి, చిరాకు, చూపు మసకబారటం వంటి లక్షణాలు కనబడతాయి. ఐపీఎస్‌ ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. గ్లూకోజు స్థాయులు మామూలుగా ఉన్న సమయంలో ఎపినెఫ్రిన్‌ అనే హార్మోన్‌ (అడ్రినలిన్‌) రక్తంలోకి పెద్దమొత్తంలో విడుదల కావటం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుండొచ్చని అనుమానిస్తున్నారు. ఐపీఎస్‌ గలవారిలో చాలామందికి ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. జీవనశైలిని మార్చుకోవటం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు, పప్పుల వంటి పీచు అధికంగా ఉండే పదార్థాలు.. తేలికైన ప్రోటీన్‌ వంటివి తీసుకోవటం మంచిది. అలాగే పెద్దమొత్తంలో కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువసార్లు భోజనం చేసినా మంచి ఫలితం కనబడుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, శుద్ధిచేసిన పిండి పదార్థాలను పరిమితం చేసుకోవటమూ మేలే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు