జబ్బులకు మెగ్నీషియం కళ్లెం!

గుండెజబ్బు, పక్షవాతం, మధుమేహం. ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న....

Published : 29 Aug 2017 01:47 IST

జబ్బులకు మెగ్నీషియం కళ్లెం!

గుండెజబ్బు, పక్షవాతం, మధుమేహం. ఆధునిక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ జబ్బుల పేర్లు వినగానే ఎవరికైనా మనసులో కలవరం మొదలవుతుంది. ఇవి ఎప్పుడెలా చుట్టుముడతాయో తెలియదు. ఎవర్ని కబళిస్తాయో తెలియదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటం అవసరం. కాస్త అప్రమత్తంగా ఉంటే వీటి బారిన పడకుండానూ చూసుకోవచ్చు. ఇందుకు మనం తినే ఆహారమే మార్గం చూపుతోంది! ఆహారం ద్వారా తగినంత మెగ్నీషియం లభించేలా చూసుకున్నవారికి గుండెజబ్బు ముప్పు 10%.. పక్షవాతం ముప్పు 12%.. మధుమేహం ముప్పు 26% తగ్గుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. మెగ్నీషియం మరింత అదనంగా లభించేలా చూసుకుంటే ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. నిర్ణీత మోతాదు కన్నా రోజుకు 100 మి.గ్రా. అదనంగా మెగ్నీషియం లభించేలా చూసుకున్నవారికి పక్షవాతం ముప్పు మరో 7%.. మధుమేహం ముప్పు 19% తగ్గుముఖం పడుతోంది కూడా.
మెగ్నీషియం.. గ్లూకోజు జీవక్రియ, ప్రోటీన్‌ ఉత్పత్తి, డీఎన్‌ఏ వంటి న్యూక్లిక్‌ ఆమ్లాల సంశ్లేషణతో పాటు పలు రకాల పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇది ప్రధానంగా ఆహారం ద్వారానే మనకు అందుతుంది. మసాలా దినుసులు, గింజపప్పులు, చిక్కుళ్లు, పొట్టుతీయని ధాన్యాలు, ఆకుకూరల వంటి వాటిల్లో మెగ్నీషయం దండిగా ఉంటుంది. సాధారణంగా మనకు రోజుకు సుమారు 300 మి.గ్రా. మెగ్నీషియం అవసరం. ఇంత చిన్నమొత్తంలో అవసరమైనా.. మన జనాభాలో దాదాపు 15% మంది దీని లోపంతో బాధపడుతున్నారని అంచనా. కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మున్ముందు పెనుముప్పులు ముంచుకురావటం ఖాయమని గుర్తించటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు