ఛాతీమంటకు ఆహార ఔషధం!

ఆహారమే ఔషధం! విచిత్రంగా అనిపించినా- కొన్ని సమస్యలకు మందుల కన్నా మనం తినే తిండే బాగా పనిచేస్తుంది. అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నొక్కిచెబుతున్నాయి. ముఖ్యంగా అసిడిటీ, గుండెల్లో మంటకు కూరగాయలు, పండ్లు అధికంగా గల ఆహారం తీసుకోవటం ఎంతగానో తోడ్పడుతున్నట్టు, ఇది మందుల మాదిరిగానే సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం.

Published : 17 Oct 2017 01:15 IST

ఛాతీమంటకు ఆహార ఔషధం!

హారమే ఔషధం! విచిత్రంగా అనిపించినా- కొన్ని సమస్యలకు మందుల కన్నా మనం తినే తిండే బాగా పనిచేస్తుంది. అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నొక్కిచెబుతున్నాయి. ముఖ్యంగా అసిడిటీ, గుండెల్లో మంటకు కూరగాయలు, పండ్లు అధికంగా గల ఆహారం తీసుకోవటం ఎంతగానో తోడ్పడుతున్నట్టు, ఇది మందుల మాదిరిగానే సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. తిన్న ఆహారం జీర్ణం కావటానికి మన జీర్ణాశయం ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంటుంది. అయితే ఈ ఆమ్లం కొందరిలో జీర్ణాశయాన్ని దాటుకొని పైకి గొంతులోకి ఎగదన్నుకొని (రిఫ్లక్స్‌) వస్తుంటుంది. దీంతో ఛాతీలో మంట, గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవటం, విడవకుండా దగ్గు, ముద్ద మింగటంలో ఇబ్బంది, గొంతులో ఏదో తట్టుకున్నట్టు అనిపించటం వంటివి వేధిస్తుంటాయి. రిఫ్లక్స్‌ సమస్యకు డాక్టర్లు చాలావరకు ఓమిప్రొజోల్‌ వంటి మందులు ఇస్తుంటారు. కానీ వీటిని దీర్ఘకాలం వాడితే ఎముకలు పెళుసుబారటం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఎగదన్నుకొచ్చే ఆమ్లానికి ఆహారంతోనే కళ్లెం వేయటంపై పరిశోధకులు దృష్టి సారించారు. కొందరికి కూరగాయలు, పండ్లు, పప్పులు, పొట్టుతీయని ధాన్యాలు, గింజపప్పులు (నట్స్‌) ఎక్కువగానూ మాంసం, పాల ఉత్పత్తులు పరిమితంగానూ తీసుకోవాలని సూచించారు. అలాగే ఆమ్లం ఎగదన్నుకు రావటాన్ని ప్రేరేపించే మద్యం, కాఫీ, టీ, చాక్లెట్‌, కూల్‌డ్రింకులు, వేపుళ్లు, మసాలాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలనీ చెప్పారు. ఇక మరికొందరికి ఆహార నియమాలేవీ లేకుండా మందులు మాత్రమే ఇచ్చి.. ఆరు వారాల తర్వాత ఫలితాలు బేరీజు వేశారు. మందులు వేసుకున్నవారిలో 54% మందిలో ఛాతీలో మంట వంటి లక్షణాలు తగ్గుముఖం పడితే.. కేవలం ఆహార నియమాలు పాటించినవారిలో 63% మందిలో ఇలాంటి లక్షణాలు తగ్గుముఖం పట్టటం విశేషం. అంటే మందుల కన్నా ఆహారమే మరింత బాగా పనిచేసిందన్నమాట. దీంతో మరో ప్రయోజనం ఏంటంటే బరువు కూడా సగటున 4 కిలోల వరకు తగ్గటం! అందువల్ల ఛాతీలోమంటకు ఇలాంటి ఆహార పద్ధతి సమర్థవంతమైన, చవకైన మార్గం కాగలదని నిపుణులు సూచిస్తున్నారు. పైగా దీంతో బరువు తగ్గటం వంటి అదనపు ప్రయోజనాలూ ఒనగూడటం విశేషమని అభిప్రాయపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని