ఇటు ఉత్సాహం..అటు ఉత్తేజం!

శరీరం, మనసు పరస్పర ఆధారితాలు. మనసు బాగోలేకపోతే ఒంట్లో చురుకుదనం తగ్గుతుంది. శరీరం నలతగా ఉంటే మనసులో నిరుత్సాహం ఆవహిస్తుంది. మరి ఒకదాన్ని సరిచేస్తే రెండోది కూడా గాడినపడుతుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మన మానసిక స్థితి (మూడ్‌), ఒంట్లో జీవక్రియలు (మెటబాలిజమ్‌)......

Published : 28 Nov 2017 02:17 IST

ఇటు ఉత్సాహం..అటు ఉత్తేజం!

శరీరం, మనసు పరస్పర ఆధారితాలు. మనసు బాగోలేకపోతే ఒంట్లో చురుకుదనం తగ్గుతుంది. శరీరం నలతగా ఉంటే మనసులో నిరుత్సాహం ఆవహిస్తుంది. మరి ఒకదాన్ని సరిచేస్తే రెండోది కూడా గాడినపడుతుందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మన మానసిక స్థితి (మూడ్‌), ఒంట్లో జీవక్రియలు (మెటబాలిజమ్‌).. రెండూ కూడా ఆకలి హార్మోన్‌ ‘లెప్టిన్‌’తో ముడిపడి ఉంటుండటం గమనార్హం. మనం భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండిందనే సమాచారాన్ని మెదడుకు చేరవేసే ఈ హార్మోన్‌ మానసిక స్థితినీ ప్రభావితం చేస్తుంది. సంతోషం, చురుకుదనాన్ని నియంత్రించే నాడీ సమాచార వాహిక డోపమైన్‌తోనూ గల సంబంధమే దీనికి కారణం. సాధారణంగా లెప్టిన్‌ స్థాయులు పడిపోయినప్పుడు డోపమైన్‌ ఎక్కువగా విడుదలవుతుంది. దీంతో ఉత్సాహమూ పెరుగుతుంది. అందువల్ల వీటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవటం ద్వారా ఇటు మానసికంగా ఉత్సాహంగానూ, అటు శారీరకంగా చురుకుగానూ ఉండొచ్చు.

పెందలాడే వ్యాయామం

వ్యాయామం చేయటం వల్ల లెప్టిన్‌ స్థాయులు పడిపోతాయి. కడుపులో ఆకలి ప్రేరేపితమవుతుంది. అప్పుడు ఏదైనా తినాలని లెప్టిన్‌ మన శరీరానికి సంకేతాలు పంపిస్తుంది. ఇదే సమయంలో డోపమైన్‌ ఉత్పత్తి ప్రేరేపితమై.. ఎక్కువసేపు వ్యాయామం చేయటానికి అవసరమైన ఉత్సాహాన్నీ కలగజేస్తుంది. ఇంకాస్త ఎక్కువగా వ్యాయామం చేయటం వల్ల జీవక్రియలు సైతం పుంజుకుంటాయి. ఇక ఉదయం పూట.. అల్పాహారానికి ముందే వ్యాయామం చేస్తే మరిన్ని ఎక్కువ ప్రయోజనమూ దక్కుతుంది. ఎందుకంటే అప్పటికే కడుపు చాలా సేపట్నుంచి ఖాళీగా ఉండటం వల్ల లెప్టిన్‌ స్థాయులూ తక్కువగా ఉంటాయి. వ్యాయామంతో ఇవి మరింత తగ్గుతాయి. అప్పుడు డోపమైన్‌ ఉత్పత్తి మరింత పెరుగుతుంది కూడా.

హాయిగా నవ్వటం

న శరీరం ఒక మాదిరి వ్యాయామం చేసినప్పటి మాదిరిగానే నవ్వినపుడు కూడా స్పందిస్తుంది. హాస్యం పుట్టించే సినిమా చూసిన తర్వాత లెప్టిన్‌ స్థాయులు తగ్గుతున్నట్టు కాలిఫోర్నియాలోని లోమా లిండా విశ్వవిద్యాలయ అధ్యయనంలోనూ బయటపడింది. అంతేకాదు, మనస్ఫూర్తిగా నవ్వినపుడు జీవక్రియలు 20% మేరకు పుంజుకుంటున్నట్టూ వాండర్‌బిల్ట్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. నవ్వినపుడు మనసు తేలికపడటం, అనంతరం ఉత్సాహం ఇనుమడించటం తెలిసిందే. కాబట్టి వీలైనప్పుడల్లా నవ్వుతుండటం మంచిది.

ఐరన్‌ తగ్గకుండా చూసుకోవటం

ఒంట్లో ఐరన్‌ లోపిస్తే లెప్టిన్‌-డోపమైన్‌ ప్రతిస్పందన తగ్గుముఖం పడుతుంది. మిగతావారితో పోలిస్తే ఐరన్‌ లోపించినవారిలో లెప్టిన్‌ స్థాయలు 3.2 రెట్లు ఎక్కువగానూ ఉంటాయి. ఇలా లెప్టిన్‌ స్థాయులు చాలాసేపు ఎక్కువ స్థాయులో ఉంటూ ఉంటే.. మెదడుపై దీని ప్రభావం తగ్గిపోనూ వచ్చు (లెప్టిన్‌ నిరోధకత). ఇది ముభావతకు, బరువు పెరగటానికి దారితీయొచ్చు. కాబట్టి రోజుకు సుమారు 19 మి.గ్రా. ఐరన్‌ తీసుకునేలా చూసుకోవాలి.

మంచి కొవ్వులు తినటం

సంతృప్త (సాచ్యురేటెడ్‌) కొవ్వులు ఒంట్లో అవయవాల చుట్టూ కొవ్వు పోగుపడేలా చేస్తాయి. దీంతో జీవక్రియలు నెమ్మదిస్తాయి. కుంగుబాటును ప్రేరేపించే వాపుకారక అణువులు ఉత్పత్తి అవుతాయి. లెప్టిన్‌ స్థాయులు పెరిగి.. లెప్టిన్‌ నిరోధకతకూ దారితీయొచ్చు. కాబట్టి సంతృప్త కొవ్వులతో కూడిన మాంసం వంటి వాటికి బదులు అసంతృప్త కొవ్వులతో నిండిన చేపలు.. బాదం వంటి గింజపప్పులు తీసుకోవటం మంచిది. వీటితో జీవక్రియలు, మూడ్‌ మెరుగవుతాయి

కంటి నిండా నిద్ర

నిద్ర సరిగా పట్టకపోతే చికాకుగా ఉండటమే కాదు.. జీవక్రియలూ మందగిస్తాయి. నిద్రలేమితో ఒత్తిడి పెరగటం.. దీంతో సంతృప్త కొవ్వులతో కూడిన జంక్‌ఫుడ్‌ తినటం.. ఫలితంగా ఒంట్లో వాపు ప్రక్రియ పెరగటం.. కుంగుబాటుకు లోనవటం.. ఇవన్నీ ఒక చక్రంలా కొనసాగుతూ వస్తుంటాయి. ఎంతసేపు నిద్రపోయామన్నదే కాదు, ఎంత హాయిగా నిద్రపోయాన్నదీ కీలకమే. తరచుగా మధ్యమధ్యలో మెలకువ వస్తుంటే మూడ్‌ కూడా మారిపోతుంటుంది. కాబట్టి రాత్రిపూట కనీసం 6-8 గంటల సేపు నిద్రపోయేలా చూసుకోవటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని