Published : 10 Apr 2018 01:32 IST

మా ‘మంచి’ ఆరోగ్యానికి!

అలవాట్లు
మా ‘మంచి’ ఆరోగ్యానికి!

మంచి అలవాట్లు మనం హాయిగా జీవించటానికి, ఆయుష్షును పెంపొందించుకోవటానికి ఎంతగానో తోడ్పడతాయన్నది తెలిసిందే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, వేళకు నిద్రపోవటం, పొగ మానెయ్యటం, ఒత్తిడి తగ్గించుకోవటం వంటి ప్రయత్నాలు ఇప్పటికే చేసి ఉండొచ్చు. కానీ కొనసాగించటమే కష్టం. దీంతో చాలామంది మధ్యలోనే మానేస్తుంటారు. కొన్ని జాగ్రత్తలతో వీటిని కొనసాగించటం కష్టమేమీ కాదు.
అలవాట్లపై కన్నేయండి
మనకు ఆనందాన్ని కలిగించే పనులను పదేపదే చేస్తుంటే కొంతకాలానికి అలవాట్లుగా మారిపోతుంటాయి. వీటిని మార్చుకోలేని విధంగా మెదడులో స్థిరపడిపోతుంటాయి. అందువల్ల ప్రవర్తనను మార్చుకోవాలంటే ముందుగా మనం రోజువారీ చేస్తున్న పనులపై దృష్టి పెట్టాలి. అనారోగ్యకరమైన, చెడ్డ అలవాట్లను ప్రోత్సహిస్తున్న అంశాలేవో తెలుసుకోవాలి. టీవీ చూస్తూ మరింత ఎక్కువ లాగించేస్తుండొచ్చు. పనిలో విరామం తీసుకున్నప్పుడు స్నేహితుడితో కలిసి సిగరెట్‌ ముట్టిస్తుండొచ్చు. ఇలాంటి విషయాలను గమనించగలిగితే చెడు అలవాట్లను దూరం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. టీవీ చూసే సమయంలో ఆహార పదార్థాలు దగ్గరలో లేకుండా చూసుకోవటం, స్నేహితుడితో కలిసి సిగరెట్‌ ముట్టించటానికి బదులు ఆఫీసు ప్రాంగణంలో అటూఇటూ కాసేపు నడవటం వంటి మార్పులు చేసుకోవచ్చు.
ప్రణాళికా బద్ధంగా..
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితం చూపిస్తాయి. కాబట్టి కాస్త భిన్నంగా ఆలోచించటం, రోజూ చేసే పనుల్లో మార్పులను చేసుకోవటం మంచిది. మనసుంటే మార్గం లేకపోలేదు. రోజూ మధ్యాహ్నం పూట చిరుతిళ్లు తినే అలవాటుంటే పండ్లు, సలాడ్ల వంటివి వెంట తీసుకెళ్తే ఆఫీసులో జంక్‌ఫుడ్‌ కొనుక్కునే అలవాటును దూరం చేసుకోవచ్చు. ఇలా మంచి అలవాట్లను ఒంట బట్టించుకోవటానికి చేయాల్సిందేంటో గుర్తించగలిగితే లక్ష్యం మరింత చేరువవుతుంది. సన్నిహితులతో కలిసి వ్యాహ్యాళికి వెళ్లటం, పుస్తకాలను చదవటం వంటి వాటి ద్వారా పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. వీటిని క్రమం తప్పకుండా చేస్తుంటే మెదడు తీరు కూడా మారుతుంది. చెడు అలవాట్ల గురించి ఆలోచించటం తగ్గుతుంది. మన ఆరోగ్య ప్రవర్తనలు కుటుంబ సభ్యులు, స్నేహితుల అలవాట్లకు ప్రతిబింబాలేనని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి మంచి అలవాట్ల విషయంలో వారి సాయం తీసుకోవటం, ఎక్కడైనా దారి తప్పుతున్నారని చెబితే వెంటనే సరిదిద్దుకోవటం మంచిది. అనివార్య పరిస్థితులను, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? మద్యం వంటివి మనసును కవ్విస్తుంటే ఎలా అధిగమిస్తారు? అనే అంశాలను వారిని అడిగి తెలుసుకోవచ్చు. మనం చేస్తున్న పనులను నోట్‌ పుస్తకంలో రాసి పెట్టుకోవటమూ మేలే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు