మధుమేహం ఉంది

గత ఐదేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నాను. మధుమేహం ఉన్నవాళ్లు మామిడిపండ్లు తినకూడదని కొందరు భయపెడుతున్నారు. నాకేమో మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం....

Published : 24 Apr 2018 02:04 IST

సమస్య - సలహా
మధుమేహం ఉంది

*మామిడిపండు తినొచ్చా?
గత ఐదేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నాను. మధుమేహం ఉన్నవాళ్లు మామిడిపండ్లు తినకూడదని కొందరు భయపెడుతున్నారు. నాకేమో మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం. ఇవి ఏడాదికి ఒకసారే వస్తుంటాయి కదా. రుచి చూడకుండా ఉండలేకపోతున్నాను. మధుమేహం ఉన్నవాళ్లు మామిడి పండు తింటే ఏమైనా ఇబ్బందా?

- సి. వసంతలక్ష్మి, వరంగల్‌

జవాబు: రక్తంలో గ్లూకోజు స్థాయులు అదుపులో గలవారు మామిడి పండు తిన్నా ఫర్వాలేదు. మనం రోజూ తీసుకునే బియ్యం, గోధుముల్లోనే కాదు.. జొన్నలు, రాగుల వంటి చిరుధాన్యాల్లోనూ పిండి పదార్థం 60-80% వరకు ఉంటుంది. అలాగే పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు వంటి పప్పుల్లో కూడా పిండి పదార్థం 60% కన్నా ఎక్కువగానే ఉంటుంది. అదే మామిడిపండులోనైతే పిండి పదార్థం 20% కన్నా తక్కువే. అందువల్ల వీటిని మధుమేహులు తిన్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. మామిడిపండ్లలోని పిండి పదార్థం గ్లూకోజుగా మారి త్వరగా రక్తంలో కలవటం (గ్లైసిమిక్‌ ఇండెక్స్‌) నిజమే గానీ ఆ గ్లూకోజు ఎక్కువసేపు అలాగే ఉండిపోదు. అరగంట, గంట తర్వాత తగ్గిపోతుంది. సాధారణంగా ఆహారం తీసుకున్న 3 గంటల వరకూ రక్తంలో కలిసే గ్లూకోజు స్థాయులను బట్టి గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ను నిర్ధరిస్తుంటారు. ఇతరత్రా ధాన్యాలు, పప్పులతో పోలిస్తే మామిడిపండులో పిండి పదార్థం పరిమాణం (గ్లైసిమిక్‌ లోడ్‌) తక్కువ కాబట్టి గ్లూకోజు స్థాయులు పెరిగినా అవి మరీ ఎక్కువసేపు అలాగే ఉండిపోవు. కాబట్టి రక్తంలో గ్లూకోజు అదుపులో ఉన్నవారు అప్పుడప్పుడు మామిడిపండ్లను తీసుకోవచ్చు. పైగా వీటితో ఇతరత్రా ప్రయోజనాలూ లభిస్తాయి. మామిడిపండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. దీంతో పేగులు కదలికలు మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌ల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఫలితంగా తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇక మామిడిపండుకు పసుపురంగును తెచ్చిపెట్టే బీటాకెరొటిన్‌, అలాగే సి విటమిన్‌ వంటివి క్యాన్సర్‌ నివారణకూ తోడ్పడతాయి. అయితే గ్లూకోజు అదుపులో లేనివారు మాత్రం మామిడిపండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో గ్లూకోజు పరగడుపున 120 మి.గ్రా. కన్నా ఎక్కువ, భోజనం చేశాక 200 మి.గ్రా. కన్నా ఎక్కువ గలవారు.. ట్రైగ్లిజరైడ్లు 150 మి.గ్రా. కన్నా ఎక్కువ గలవారు మామిడిపండ్లను ఎక్కువగా తినకపోవటమే మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని