Published : 15 May 2018 01:26 IST

నావల్ల ఆయనకు సమస్య వస్తుందా?

సమస్య-సలహా
నావల్ల ఆయనకు సమస్య వస్తుందా?

ప్రశ్న: నా వయసు 55 ఏళ్లు. పదేళ్ల క్రితం గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ వచ్చింది. కీమోథెరపీ, రేడియేషన్‌, లేజర్‌ చికిత్సలు తీసుకున్నాను. క్యాన్సర్‌ తగ్గిపోయిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుత నాకెలాంటి సమస్యలు లేవు. అయితే ఇటీవల నా భర్త తన అంగంలో ఏదో కదులుతున్నట్టు అనిపిస్తోందని, అప్పుడప్పుడు నొప్పిగా ఉంటోందని చెబుతున్నారు. నావల్ల ఆయనకు ఏదైనా సమస్య వచ్చే అవకాశముందా? శృంగారంలో పాల్గొన్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

- ఒక పాఠకురాలు, విశాఖపట్నం

జవాబు: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత అందరిలాగే మామూలుగానే గడపొచ్చు. శృంగార జీవితానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. సాధారణంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ 1వ దశలో ఉంటే శస్త్రచికిత్స చేస్తారు. రెండు, అంతకన్నా ఎక్కువ దశల్లో ఉంటే కీమోథెరపీ, రేడియేషన్‌ ఇస్తారు. వీటితో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పూర్తిగా తగ్గిపోతుంది. కీమోథెరపీ, రేడియేషన్‌ తీసుకుంటున్న సమయంలో యోని పొడిబారటం, మార్గం కుంచించుకుపోవటం వంటి సమస్యలు తలెత్తొచ్చు. దీంతో శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి, ఇబ్బంది వంటివి కనబడొచ్చు. కానీ ఇలాంటివన్నీ క్రమంగా కొద్దివారాల్లో సర్దుకుపోతాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేదేమీ కాదు. ఇది భాగస్వాములకు అంటుకునే అవకాశమేమీ లేదు. కాబట్టి శృంగార జీవితం గురించి భయపడాల్సిన పనిలేదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కూ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్‌కూ సంబంధం ఉండటం వల్ల చాలామంది దీని విషయంలో భయపడుతుంటారు. నిజానికి హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా అందరికీ క్యాన్సర్‌ రావాలనేమీ లేదు. చాలామంది స్త్రీ పురుషులు జీవితంలో ఎప్పుడో అప్పుడు ఒకసారి దీని బారినపడినవాళ్లే అన్నా అతిశయోక్తి కాదు. ఈ హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ 80-90% మందిలో దానంతటదే తొలగిపోతుంది కూడా. మిగిలినవారిలోనూ చాలా కొద్దిమందిలోనే దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. వీరిలోనూ కేవలం కొద్ది మందిలోనే.. ముఖ్యంగా హెచ్‌పీవీ 16, 18 రకాల ఇన్‌ఫెక్షన్లతో  క్యాన్సర్‌ ముందరి (ప్రిక్యాన్సర్‌) మార్పులకు దారితీయొచ్చు. ఇందుకు 10-20 సంవత్సరాలు పట్టొచ్చు. దీన్ని ఇన్‌ఫెక్షన్‌ దశలోనే పట్టుకుంటే క్యాన్సర్‌గా మారకుండానూ చూసుకోవచ్చు. హెచ్‌పీవీని నివారించుకోవటానికి ఇప్పుడు టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని లైంగిక జీవితం ఆరంభించకముందే.. అమ్మాయిలకు ఇప్పించటం మంచిది. ఏదేమైనా హెచ్‌పీవీ లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి శృంగారంలో పాల్గొన్నప్పుడు కండోమ్‌ ధరించటం మంచిది. దీంతో హెచ్‌పీవీని కొంతవరకు అడ్డుకోవచ్చు. ఇతరత్రా సుఖవ్యాధులు బారినపడకుండా కాపాడుకోవచ్చు. హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ మాత్రమే కాదు.. పురుషాంగ క్యాన్సర్‌, మలద్వార క్యాన్సర్‌, నోటి క్యాన్సర్‌ వంటి ఇతరత్రా క్యాన్సర్లూ వచ్చే అవకాశముంది. కాబట్టి మీ ఆయనకు ఏవైనా అనుమానాస్పద, అసాధారణ లక్షణాలు కనబడితే ఒకసారి డాక్టర్‌ను సంప్రతించి, పరీక్షించుకోవటం మంచిది. దీంతో ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడటానికి వీలవుతుంది.


మీ సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా:
సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.inTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు