కీళ్లకు వ్యాయామ రక్షణ

కీళ్లు బిగుసుకుపోవటం, నడుస్తుంటే నొప్పి.. ఇలా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ (కీళ్లవాతం) బారినపడ్డవారు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే నొప్పి పుడుతుంది కదా అని కదలకుండా ఉండిపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది...

Published : 22 May 2018 01:40 IST

కీళ్లకు వ్యాయామ రక్షణ

కీళ్లు బిగుసుకుపోవటం, నడుస్తుంటే నొప్పి.. ఇలా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ (కీళ్లవాతం) బారినపడ్డవారు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. అయితే నొప్పి పుడుతుంది కదా అని కదలకుండా ఉండిపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి వీలైనంతవరకు అటూఇటూ కదలటం, శారీరక శ్రమ చేయటం మంచిది. ముఖ్యంగా వ్యాయామాలు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి కీళ్లు బలోపేతం కావటానికి, కదలికలు తోడ్పడటానికే కాదు.. ఇతరత్రా జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి.
* గుండె,  శ్వాస వేగం పెరిగేలా చేసే ఏరోబిక్‌ వ్యాయామాలు మధుమేహం, పక్షవాతం, గుండెజబ్బుల వంటి వాటి బారినపడకుండా కాపాడతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇవి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ బాధితులకూ ఎంతో మేలు చేస్తాయి. వీరికి గుండెజబ్బు ముప్పు ఎక్కువ కాబట్టి మరింత ఉపయోగపడతాయి కూడా. కాబట్టి ఈత, సైకిల్‌ తొక్కటం, నడవటం వంటి వ్యాయామాలు చేయటం మంచిది.
* కండరాలు బలహీనపడితే చిన్న చిన్న పనులకే ఆయాసం ముంచుకొస్తుంది. కీళ్లు కుదురుగా ఉండక అటూఇటూ కదలిపోతాయి. అందువల్ల కండరాలు వ్యాకోచించి, సంకోచించేలా చేసే చప్పట్లు కొట్టటం, చేతులను బిగించి పట్టుకోవటం వంటి ఐసోమెట్రిక్‌ వ్యాయామాలు చేయటం మంచిది.
* కీళ్లవాతం మూలంగా దెబ్బతిన్న కీళ్లు అంత తేలికగా కదలవు. దీంతో ఆయా పనులు చేయటం కష్టమవుతుంది. కీళ్ల చుట్టుపక్కల కండరాలను సాగదీసి, వాటిని బలోపేతం చేసే వ్యాయామాలతో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అందువల్ల యోగాసనాలు, తై చీ సాధన చేయటం మంచిది.
* ఒక కాలు మీద నిలబడటం వంటి బ్యాలెన్సింగ్‌ వ్యాయామాలతో శరీరం పట్టు తప్పకుండా.. కింద పడిపోకుండా చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని