హెపటైటిస్‌ బి మా పిల్లలకూ వస్తుందా?

ప్రశ్న: ఇటీవల మా పెద్దన్నయ్యకు హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు నిర్ధరణ అయ్యింది. ఇదేమైనా అంటువ్యాధా? ముట్టుకున్నా కూడా వస్తుందని చుట్టుపక్కలవాళ్లు...

Published : 05 Jun 2018 01:32 IST

సమస్య - సలహా
హెపటైటిస్‌ బి మా పిల్లలకూ వస్తుందా?

ప్రశ్న: ఇటీవల మా పెద్దన్నయ్యకు హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు నిర్ధరణ అయ్యింది. ఇదేమైనా అంటువ్యాధా? ముట్టుకున్నా కూడా వస్తుందని చుట్టుపక్కలవాళ్లు అంటున్నారు. ఇది నిజమేనా? మాకు చిన్న పిల్లలున్నారు. భయంగా ఉంది. దీనికి చికిత్స లేదా?

- డి.బి.ఎన్‌. వాసు (ఈమెయిల్‌ ద్వారా)

జవాబు: హెపటైటిస్‌ బి వైరస్‌ రక్తం లేదా శారీరక స్రావాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అంతేగానీ ఒకరినొకరు ముట్టుకోవటం, తాకటం, ఒకరు తాగిన గ్లాసుతో నీరు తాగటం, ఒకరు భోజనం చేసిన ప్లేటులో భోజనం చేయటం ద్వారా వ్యాపించదు. కాబట్టి మీరు భయపడాల్సిన పనేమీ లేదు. అయితే బ్లేడ్లు, సూదులు, నెయిల్‌ కట్టర్ల వంటి పదునుగా ఉండే వస్తువులను ఒకరు వాడినవి మరొకరు వాడుకోకుండా చూసుకోవాలి. అలాగే టూత్‌బ్రష్షులనూ మరొకరు వాడకూడదు. ఇప్పుడు పిల్లలకు పుట్టగానే హెపటైటిస్‌ టీకా కూడా ఇస్తున్నారు. కాబట్టి మీ పిల్లలకు హెపటైటిస్‌ టీకా ఇచ్చారో లేదో ఒకసారి నిర్ధరించుకోండి. టీకా ఇచ్చి ఉంటే వైరస్‌ సోకే అవకాశం దాదాపు లేదనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులంతా హెపటైటిస్‌ బి టీకా తీసుకోవటం మంచిది. ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్‌ బి ఉన్నట్టయితే కుటుంబ సభ్యులందరూ టీకా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేస్తోంది. మీ అన్నయ్యకు హెపటైటిస్‌ బి నిర్ధరణ అయ్యింది కాబట్టి కుటుంబంలోని అందరూ టీకా తీసుకోవటం మేలు. దీంతో వైరస్‌ బారినపడకుండా చూసుకోవచ్చు. అప్పటికే వైరస్‌ సోకిందేమోననే అనుమానమూ కొందరికి వస్తుంటుంది. అయితే దీన్ని నిర్ధరించుకోవటానికి తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలనేమీ లేదు. వీలైనవారు చేయించుకోవచ్చు. పరీక్షలేమీ చేయించుకోకపోయినా టీకా తీసుకోవచ్చు. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే- హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా కూడా కుటుంబంతో కలిసి హాయిగా జీవించొచ్చు. ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇలాంటివాళ్లు మన సమాజంలో చాలామందే ఉన్నారు. పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. హెపటైటిస్‌ బి ఇన్‌ఫెక్షన్‌కు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్‌ ఎంత కాలం నుంచి ఉంది? వైరస్‌ చురుకుగా ఉందా? నిద్రాణంగా ఉందా? వైరస్‌ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంది? అనే వాటిని బట్టి డాక్టర్లు చికిత్స చేస్తారు. కాబట్టి లేనిపోని అపోహలతో భయపడిపోవద్దు.

మీ సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా:
సమస్య - సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని