Published : 19 Jun 2018 01:48 IST

‘డీ’లా పడిపోవద్దు!

‘డీ’లా పడిపోవద్దు!

విటమిన్‌ డి తీరే వేరు. అవటానికిది విటమినే అయినా హార్మోన్‌ మాదిరిగా పనిచేస్తుంది. చర్మానికి ఎండ తగిలినపుడు కొలెస్ట్రాల్‌ నుంచి దీన్ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. కొవ్వుతో కూడిన చేపల వంటి వాటిల్లోనూ విటమిన్‌ డి ఉన్నప్పటికీ ఆహారం ద్వారా దీన్ని తగినంత తీసుకోవటం చాలా కష్టం. శరీరంలోని పలు వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపే విటమిన్‌ డి లోపంతో ఎంతోమంది బాధపడుతున్నారు. పైకి ఎలాంటి లక్షణాలూ కనబడకపోవటం వల్ల చాలామంది దీన్ని పట్టించుకోవటం లేదు. నిజానికి విటమిన్‌ డి లోపం పలు సమస్యలకు దారితీయొచ్చు. కొన్ని కొన్ని లక్షణాల ఆధారంగా దీని లోపాన్ని గుర్తించొచ్చు.

తరచుగా జబ్బుపడటం: రోగనిరోధక వ్యవస్థ బలంగా పనిచేయటంలో విటమిన్‌ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడే కణాలతో ఇది నేరుగా చర్య జరుపుతుంది. అందువల్ల విటమిన్‌ డి లోపిస్తే జలుబు, ఫ్లూ వంటివి తరచుగా దాడిచేస్తుంటాయి.
నిస్సత్తువ: అలసట, నిస్సత్తువకు దారితీసే అంశాల్లో విటమిన్‌ డి లోపం ఒకటి. దురదృష్టవశాత్తు చాలామందికి విటమిన్‌ డి లోపమన్నదే గుర్తుకురాదు. రక్తంలో దీని స్థాయిలు తగ్గితే తీవ్రమైన నిస్సత్తువకు దారితీస్తుంది.
వెన్నునొప్పి: ఎముకల దృఢంగా, ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్‌ డి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మనం తిన్న ఆహారం నుంచి శరీరం క్యాల్షియాన్ని మరింత ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. అందువల్ల విటమిన్‌ డి లోపిస్తే వెన్నునొప్పి, ఎముకల నొప్పుల వంటివి బయలుదేరొచ్చు. దీని లోపంతో చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగే ప్రమాదముంది.
కుంగుబాటు: ఎప్పుడూ విచారంతో ఉంటున్నట్టు గమనిస్తే విటమిన్‌ డి లోపం కూడా కారణం కావొచ్చని అనుమానించాలి. రక్తంలో విటమిన్‌ డి స్థాయులు తగ్గటానికీ కుంగుబాటుకూ సంబంధం ఉంటున్నట్టు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
పుండ్లు మానకపోవటం: ఏదైనా దెబ్బ తగిలినపుడు, సర్జరీల వంటివి చేయించుకున్నప్పుడు గాయం, కోతలు త్వరగా మానకుండా వేధిస్తుంటే విటమిన్‌ డి లోపం ఉందేమో ఒకసారి పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే పుండు మానే క్రమంలో కొత్త చర్మం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించే రసాయనాల ఉత్పత్తికి విటమిన్‌ డి తోడ్పడుతుంది మరి. అంతేకాదు, వాపు నియంత్రణలోనూ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటంలోనూ ఇది పాలు పంచుకుంటుంది.
జుట్టు ఊడటం: వెంట్రుకలు ఊడిపోతుంటే ముందుగా ఒత్తిడే గుర్తుకొస్తుంది. కానీ కొన్ని జబ్బులతో పాటు విటమిన్‌ డి లోపం సైతం జుట్టు ఊడిపోవటానికి దోహదం చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు