వెరీకోజ్‌ వీన్స్‌ ఉన్నాయి.. చికిత్స ఏంటి?

గత ఆరేళ్లుగా రెండు కాళ్లలో సిరల ఉబ్బుతో (వెరికోజ్‌ వీన్స్‌) బాధపడుతున్నాను. దీనికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? చికిత్స ఏంటో తెలుపగలరు?

Published : 17 Jul 2018 01:12 IST

సమస్య - సలహా
వెరీకోజ్‌ వీన్స్‌ ఉన్నాయి.. చికిత్స ఏంటి?

సమస్య: గత ఆరేళ్లుగా రెండు కాళ్లలో సిరల ఉబ్బుతో (వెరికోజ్‌ వీన్స్‌) బాధపడుతున్నాను. దీనికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? చికిత్స ఏంటో తెలుపగలరు?

-బి.పాపారావు, విజయనగరం

సలహా: ఆరేళ్లుగా కాళ్లలో సిరల ఉబ్బుతో బాధపడుతున్నానని అంటున్నారు కాబట్టి ఒకసారి నిపుణులైన వాస్క్యులర్‌ సర్జన్‌ను సంప్రతించటం మంచిది. సమస్య తీవ్రతను బట్టి చికిత్సను నిర్ధరిస్తారు. వెరికోజ్‌ వీన్స్‌కు ప్రధాన కారణం కాలి సిరల్లోని కవాటాల సామర్థ్యం తగ్గటం. దీంతో రక్తం పైకి చేరుకోకుండా కిందికి జారిపోతూ.. అక్కడే ఎక్కువగా నిల్వ ఉండిపోతుంటుంది. దీంతో రక్తనాళాలు ఉబ్బిపోయి.. పైకి మెలికలు తిరిగినట్టుగా కనబడుతుంటాయి. చూడటానికి ఇబ్బందిగా కనబడుతుంది గానీ ఇదంత ప్రమాదకరమైందేమీ కాదనే చెప్పుకోవాలి. చర్మం కిందే ఉండే సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడటం.. అవి ఊపిరితిత్తులకు చేరుకోవటమనేది అరుదు. కాకపోతే సిరల ఉబ్బు సమస్యను సరిగా గుర్తించటం, తగు చికిత్స తీసుకోవటం అవసరం. సమస్య తీవ్రమైతే నొప్పి, వాపు, చర్మం రంగు మారటం, పుండ్లు పడటం వంటివి తలెత్తుతాయి. సిరల ఉబ్బును కలర్‌ డాప్లర్‌ పరీక్ష ద్వారా నిర్ధరిస్తారు. ఇది చాలా తేలికైన, సులువైన పరీక్ష. అయితే దీన్ని నిలబడినప్పుడు, కూచున్నప్పుడే చేయాలి. పడుకున్నప్పుడు చేయకూడదు. వేరికోజ్‌ వీన్స్‌ గలవారు ముందుగా కాళ్లకు బిగుతైన మేజోళ్లు ధరించటం, కొన్ని రకాల మందులు వేసుకుంటే సరిపోతుంది. వీటితో ఫలితం కనబడకపోతే.. చర్మం రంగు మారటం, పుండు పడటం వంటివి ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడే చేయాల్సిన పనేమీ లేదు. వీలును చూసి చేయించుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్‌ సర్జరీతో పాటు లేజర్‌ లేదా రేడియో ఫ్రిక్వెన్సీ అబ్లేషన్‌, స్క్లీరోథెరపీ వంటి అధునాతన పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. లేజర్‌, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ పద్ధతుల్లో చర్మానికి ఎలాంటి కోత పెట్టకుండా లోపలి నుంచే సిరలను మూసేయొచ్చు. ఇలాంటి చికిత్సలు చేయటం కుదరని వారికి చర్మానికి కోత పెట్టి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఇందులో సమస్య ఉన్న సిరను పై నుంచి కింది వరకూ తొలగిస్తారు. స్క్లీరోథెరపీలోనైతే లోపలికి రసాయనాన్ని పంపించి సిరను మూసేస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని