Updated : 20 Jan 2021 19:32 IST

గుండె ఆరోగ్యానికి చిన్న మార్పులైనా చాలు!

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం, గుండెజబ్బుల బారినపడకుండా చూసుకోవటం ఎంత ముఖ్యమో కొవిడ్‌-19 మహమ్మారి మరోసారి గుర్తుచేసింది. గుండెజబ్బులతో బాధపడేవారికి కరోనాజబ్బు తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టటం చూస్తున్నదే. కరోనాతో మరణించినవారిలో గుండెజబ్బులు గలవారి సంఖ్యా ఎక్కువగా ఉండటం తెలిసిందే. మనకు కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ-2 కొత్తదే కావొచ్చు. ఇది విసిరిన సవాళ్లు కొత్తవి కావొచ్చు. కానీ గుండెజబ్బుల మీద దశాబ్దాలుగా అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. జీవనశైలి పరమైన అలవాట్లు గుండె మీద ఎంతగానో ప్రభావం చూపుతాయన్నది ఇవన్నీ స్పష్టంగానే పేర్కొంటున్నాయి. పొగ మానెయ్యటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, చురుకుగా ఉండటం, బరువు తగ్గటం, రక్తపోటు అదుపులో ఉంచుకోవటం, కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును తగ్గించుకోవటం.. ఈ ఏడు సూత్రాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి ఒక్క గుండె ఆరోగ్యానికే కాదు, కొవిడ్‌-19, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పులు తగ్గటానికీ దోహదం చేస్తాయి.

మరీ ఏడు సూత్రాలంటే ఎలా? అన్నీ పాటించటం ఎక్కడ కుదురుతుంది? అనుకునేవారు కొన్ని ఆచరించినా చాలు. ఆ మాటకొస్తే అందరికీ బరువు తగ్గాల్సిన, గ్లూకోజు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. చాలామందికి పొగ తాగే అలవాటూ లేకపోవచ్చు. నిజానికి ఇక్కడ సూత్రాల సంఖ్య ప్రధానం కాదు. ఎంతవరకు ఆచరిస్తున్నామన్నదే ముఖ్యం. మనలో చాలామంది కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్ల వంటివి అంతగా తిననే తినరు. వ్యాయామాలూ సరిగా చేయరు. వారానికి కనీసం 150 నిమిషాల సేపు వేగంగా నడవటం వంటి ఒక మాదిరి తీవ్రమైన వ్యాయామం చేయాలన్నది నిపుణుల సిఫారసు. అలాగే వారానికి కనీసం 2 సార్లు బరువులు ఎత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయాలి. ఈ ఆహార, వ్యాయామ నియమాలు రెండింటిని పాటిస్తేనే బరువూ అదుపులో ఉంటుందనుకోండి. దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్, గ్లూకోజు సైతం నియంత్రణలో ఉంటాయి. అందువల్ల కొన్ని చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టినా పెద్ద ఫలితమే కనిపిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

ఆహారంలో మార్పు: కొవ్వు పదార్థాలు తగ్గించుకోవటం ముఖ్యం. మాంసాహారులైతే అప్పుడప్పుడు మాంసానికి బదులు చిక్కుళ్లు తినొచ్చు. వీటితో కొవ్వులేకుండానే మంచి ప్రొటీన్‌ లభిస్తుంది. వేపుళ్లు కాస్త తగ్గించినా మేలే. వనస్పతికి దూరంగా ఉంటే ఇంకా మంచిది. అలాగే బాగా పాలిష్‌ పట్టిన బియ్యం కన్నా ఒక పట్టు బియ్యం, దంపుడు బియ్యం రుచి చూడొచ్చు. ఇంతకుముందు ఎరగని కొత్త కూరగాయలనూ ఒకసారి లాగించొచ్చు. ఇవేవీ కష్టమైన పనులేమీ కాదు. 

గుండె వేగాన్ని పెంచే వ్యాయామాలు: వీటిని 10 నిమిషాలు చేసినా సరే. ఇందుకోసం ఇంటి చుట్టుపక్కల్లోనే కాస్త వేగంగా నడవొచ్చు. వీలుంటే ట్రెడ్‌మిల్‌ మీద నడవచ్చు. ఎలాంటి వ్యాయామ పరికరాలు లేవని బాధపడాల్సిన పనిలేదు. ఉన్నచోటే ఎగరటం, గుంజీలు తీసినట్టు పిరుదులను మోకాళ్ల ఎత్తు వరకు వచ్చేలా నడుమును కిందికి తేవటం, కాళ్లు లేపటం, చేతులు తిప్పటం వంటివి చేసినా చాలు.

ఆరోగ్య సంఖ్యలపై అవగాహన: గుండె ఆరోగ్యం తీరుతెన్నులను శరీరమే పట్టిస్తుంది. వీటిని గుర్తించే నేర్పే కావాలి. ఇందుకోసం కొన్ని సంఖ్యల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. ఒకసారి శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఎంతుందో చూసుకోండి. ఇది 18.5 నుంచి 25 మధ్యలో ఉండాలి. పెరిగితే జాగ్రత్త పడాల్సిందే. రక్తపోటు 120/80 కన్నా తక్కువ ఉండాలి. రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్‌ సంఖ్య 200 ఎంజీ/డీఎల్‌ కన్నా మించకూడదు. ఇక పరగడుపున రక్తంలో గ్లూకోజు 100 ఎంజీ/డీఎల్‌ కన్నా తక్కువగా ఉండాలి. అయితే ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. వయసు, ఇతరత్రా జబ్బులు, వంశపారంపర్యంగా వచ్చే స్వభావాల వంటివన్నీ వీటిపై ప్రభావం చూపొచ్చు. ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి ఆయా సంఖ్యలు ఎంత మోతాదులో ఉండాలో తెలుసుకొని, నడచుకోవాలి.

ఇవీ చదవండి..

టీకా ప్రాప్తిరస్తు!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts