dry fruits: బాదం పప్పు పొట్టు తీయకుండా తింటే లాభమేంటి?

పోషకాహారం అనగానే మనకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పుల వంటివే గుర్తుకొస్తాయి.

Published : 25 Nov 2021 20:17 IST

పోషకాహారం అనగానే మనకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పుల వంటివే గుర్తుకొస్తాయి. కానీ బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్‌).. ఖర్జూరం, కిస్‌మిస్‌, అంజీరా వంటి ఎండుఫలాల గురించి పెద్దగా పట్టించుకోం. నిజానికివి మంచి పోషకాల గనులు. మేలిరకం కొవ్వులు, విటమిన్లతో పాటు ఫాస్ఫరస్‌, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు వీటిల్లో దండిగా ఉంటాయి. ఇవన్నీ కీలకమైన అవయవాలు సరిగా పనిచేసేలా చూడటమే కాదు.. రకరకాల జబ్బుల బారినపడకుండానూ కాపాడతాయి.

* జీడిపప్పు, బాదం వంటి వాటిల్లోని మంచి కొవ్వులు (మోనో అసంతృప్త కొవ్వులు) గుండె ఆరోగ్యం పెంపొందటానికి తోడ్పడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్‌ గుండె సమస్యలను నివారిస్తుంది. ఇక ఖర్జూరమేమో రక్తనాళాలు గట్టిపడకుండా చూస్తుంది.

* ఎండుద్రాక్ష, ఖుబానీ వంటి వాటిల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రక్తహీనత బారినపడకుండా కాపాడతాయి.

* గింజపప్పులు, ఎండుఫలాలు కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ దోహదం చేస్తాయి. జీడిపప్పులో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలోని ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి.

* పొటాషియం, విటమిన్‌ ఎ, పీచు, రాగి దండిగా గల ప్రూన్స్‌ (ఎండు అలుబుకర) ఒంట్లో శక్తి తగ్గకుండా చూస్తాయి. జీడిపప్పులో రాగి ఎక్కువగా ఉండటం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇక బాదంపప్పు కొత్త రక్తకణాల ఉత్పత్తికి, హిమోగ్లోబిన్‌ స్థాయులు మెరుగుపడటానికి తోడ్పడుతుంది.

* ఎండుద్రాక్షలో విటమిన్‌ ఎ, క్యాల్షియం దండిగా ఉంటాయి. ఇవి ఎముక పుష్టికి, చూపు బాగుండటానికి దోహదం చేస్తాయి. జీడిపప్పులోని మెగ్నీషియం, క్యాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

* బాదంపప్పులో క్యాల్షియంతో పాటు విటమిన్‌ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయి. ‘మెదడు ఆహారం’గా పేరొందిన అక్రూట్ల(వాల్‌నట్స్‌)లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని