Pineapple: పైనాపిల్‌ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

కోయటం కాస్త కష్టమేమో గానీ పైనాపిల్‌ ముక్కల రుచే వేరు. పుల్లపుల్లగా.. తీయతీయగా ఉండే వీటిల్లో విటమిన్లు, పోషకాలు సైతం దండిగానే ఉంటాయి

Published : 26 Dec 2021 17:29 IST

కోయటం కాస్త కష్టమేమో గానీ పైనాపిల్‌ ముక్కల రుచే వేరు. పుల్లపుల్లగా.. తీయతీయగా ఉండే వీటిల్లో విటమిన్లు, పోషకాలు సైతం దండిగానే ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.

విటమిన్‌ సి గని: ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలు తీసుకుంటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్‌ సి లభించినట్టే. దీంతో రోగనిరోధకశక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమ్మతులోనూ విటమిన్‌ సి పాలు పంచుకుంటుందన్న సంగతి తెలిసిందే.

బరువు తగ్గడానికీ..: యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం ముంచుకురాకుండానూ.. క్యాన్సర్‌, గుండెజబ్బు వంటి జబ్బులు దరిజేరకుండానూ చూస్తాయి. వ్యాయామం చేసేవారిలో విటమిన్‌ సి స్థాయులు తగ్గితే కేలరీలు తక్కువగా ఖర్చవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంటే పైనాపిల్‌ బరువు తగ్గటానికీ తోడ్పడుతుందన్నమాట.

జీర్ణక్రియ మెరుగు: పైనాపిల్‌తో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలూ దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువెక్కువ తినకుండానూ చూస్తుంది. అలాగే మలబద్ధకం దరిజేరకుండా కాపాడుతుంది.

చర్మం నిగనిగ: పైనాపిల్‌లో మ్యాంగనీసు ఖనిజం కూడా దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మ్యాంగనీసు లభిస్తుంది. ఇది విటమిన్‌ సితో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బతినకుండానూ కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని