Heart attack: గుండె మరమ్మత్తు గుట్టు తెలిసింది

గుండెపోటు వచ్చినప్పుడు గుండె కణాలు పెద్దఎత్తున చనిపోతాయి. వీటిని భర్తీ చేయటానికి శరీరం అక్కడ మచ్చ ఏర్పడేలా చేస్తుంది. ఇది మొదట్లో గుండె కుదురుగా ఉండటానికి తోడ్పడుతుంది గానీ రాన్రానూ కండరంలో శాశ్వత భాగంగా మారుతుంది.

Published : 18 Jun 2024 00:06 IST

గుండెపోటు వచ్చినప్పుడు గుండె కణాలు పెద్దఎత్తున చనిపోతాయి. వీటిని భర్తీ చేయటానికి శరీరం అక్కడ మచ్చ ఏర్పడేలా చేస్తుంది. ఇది మొదట్లో గుండె కుదురుగా ఉండటానికి తోడ్పడుతుంది గానీ రాన్రానూ కండరంలో శాశ్వత భాగంగా మారుతుంది. దీంతో రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యం తగ్గుతుంది. అప్పుడు గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో మచ్చ భాగమూ విస్తరిస్తుంది. ఇది గుండె శాశ్వతంగా దెబ్బతినటానికి దారితీస్తుంది. గుండె దెబ్బతిన్న తర్వాత అన్ని క్షీరదాల్లోనూ ఇలాగే మచ్చ ఏర్పడుతుంది. అయితే జీబ్రా చేపలు దీనికి మినహాయింపు. ఇవి మచ్చను పూర్తిగా తొలగించుకుంటాయి. అక్కడ గుండె కణాలు తిరిగి వృద్ధి చెందుతాయి. గుండె పూర్తిగా కోలుకుంటుంది. దీనిలోని రహస్యాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ పరిశోధకులు ముందడుగు వేశారు. సాధారణంగా కొలాజెన్, పొడవైన ప్రొటీన్‌ పోచలు ఒకదానిలోకి మరోటి చొచ్చుకెళ్లి మచ్చగా ఏర్పడతాయి. అన్ని జీవుల్లో ఇది ఒకేలా జరుగుతుందని భావించేవారు. అయితే ఎలుకలను, జీబ్రా చేపలను పరిశీలించగా.. ఇది జీబ్రా చేపల్లో భిన్నంగా ఉండటం గమనార్హం. వీటిల్లో కొలాజెన్, ప్రొటీన్‌ పోచలు కాస్త వదులుగా, విడిపోయే విధంగా బిగుసుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. చేపల్లో మచ్చ భాగం మరమ్మతు కావటానికి ఇదే దోహదం చేస్తోంది. మచ్చ ఏర్పడటానికి దోహదం చేసే రసాయన మార్పు (లైసీన్‌ హైడ్రాక్సీలేషన్‌) జీబ్రా చేపల్లో అంత తీవ్రంగా కనిపించలేదు. మారలేని విధంగా మచ్చ ఏర్పడటంలో లైసీల్‌ హైడ్రాక్సీలేజ్‌ 2 అనే ఎంజైమ్‌ పాలు పంచుకుంటున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. ఈ ఎంజైమ్‌ను అడ్డుకోగలిగితే మచ్చ భాగాన్ని మరమ్మతు చేసే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే దీనిపై దృష్టి సారించారు. ఇది సాకారమైతే ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండె పోటు అనంతరం ఏర్పడే మచ్చ, గుండె వైఫల్యం కారణంగా చాలామంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఇది కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని