World Asthma Day 2023: ఆస్థమా శాపం కాదు!
ఆస్థమా దీర్ఘకాల సమస్యే కావొచ్చు. జీవితాంతం వేధించేదే కావొచ్చు. అంతమాత్రాన భయపడాల్సిందేమీ లేదు. శాపంగా భావించాల్సిన పనీ లేదు. దీనికిప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటే ఆస్థమాను చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
నేడు వరల్డ్ ఆస్థమా డే
ఆస్థమా దీర్ఘకాల సమస్యే కావొచ్చు. జీవితాంతం వేధించేదే కావొచ్చు. అంతమాత్రాన భయపడాల్సిందేమీ లేదు. శాపంగా భావించాల్సిన పనీ లేదు. దీనికిప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటే ఆస్థమాను చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే మనదేశంలో మందులపై సరైన అవగాహన లేకపోవటం.. జబ్బు మీద అపోహలు, భయాలు నెలకొనటం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్థమా బాధితులతో పోలిస్తే మనదేశంలో 13% మంది దీంతో బాధపడుతుండగా.. ఆస్థమా మరణాల్లో 42% మనదగ్గరే సంభవిస్తుండటం గమనార్హం. ఇలాంటి వ్యత్యాసాలను తగ్గించే ఉద్దేశంతోనే ‘ఆస్థమా చికిత్స అందరికీ’ అని వరల్డ్ ఆస్థమా డే నినదిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్థమా ఎందుకు వస్తుంది? ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చు? అనేవి తెలుసుకొని ఉండటం మంచిది.
ఆస్థమా ప్రధానంగా ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాల సమస్య. దీనికి మూలం అలర్జీ. కంట్లో నలుసు పడితే దురద పుడుతుంది కదా. కన్ను ఎరుపెక్కటం, నీరు కారవటమూ మొదలవుతాయి. సరపడని పదార్థాలు తగిలినపుడు ఊపిరితిత్తుల్లోనూ ఇలాగే జరుగుతుంది. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి.. మళ్లీ చిన్నచిన్న గొట్టాలుగా విడిపోతూ.. అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. సాధారణంగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గు రావటం మామూలే. ఇది హాని కారకాలు లోపలికి ప్రవేశించకుండా, వాటిని బయటకు నెట్టివేయటానికి శరీరం చేసే ప్రయత్నమే. అయితే ఆస్థమా వచ్చే స్వభావం (అటోపీ) గలవారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారతాయి. దుమ్మూ ధూళి, పుప్పొడి, రసాయనాల వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి. ఆస్థమాకు మూలం ఇదే. గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) మొదలవుతుంది. అప్పుడు గాలిగొట్టాల గోడలు ఉబ్బి, లోపలి మార్గం సన్నబడుతుంది. గాలి గొట్టాల్లో జిగురుద్రవం ఉత్పత్తీ పెరుగుతుంది. ఇది లోపలే చిక్కుకు పోతుంది. చుట్టుపక్కలా వాపు మాదిరి మార్పులు మొదలవుతాయి. దీంతో శ్వాస తీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. ఫలితంగా దగ్గు, పిల్లికూతలు, ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు కొందరిలో కొద్దిసేపే ఉండొచ్చు. ఒకట్రెండు లక్షణాలే ఉండొచ్చు. కొందరికి ప్రత్యేకించి కొన్ని సమయాల్లోనే తలెత్తొచ్చు. కొందరికి నిరంతరం వేధిస్తుండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానూ ఆస్థమా ఉండొచ్చు (సైలెంట్ చెస్ట్).
ఎవరికి? ఎందుకు?
పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ ఎవరికైనా ఆస్థమా రావొచ్చు. అయితే ఆస్థమా బాధితుల్లో సుమారు సగం మందికి పదేళ్ల వయసులోపే తొలి లక్షణాలు మొదలవుతుంటాయి. ఆస్థమాతో బాధపడే పిల్లల్లో చాలామందిలో ఆరేళ్లలోపే తొలిసారి ఆస్థమా దాడి చేయటం చూస్తుంటాం. దీనికి ప్రధాన కారణం వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులు. అయితే తల్లిదండ్రులకు ఆస్థమా ఉన్నంత మాత్రాన పుట్టే పిల్లలకు తప్పకుండా రావాలనేమీ లేదు. తల్లిదండ్రులిద్దరికీ ఆస్థమా ఉంటే పిల్లలకు 70% వరకు రావొచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే ఆస్థమా ఉంటే 30% వరకు వచ్చే అవకాశముంది. అదేపనిగా అలర్జీ కారకాలకు గురవుతున్నప్పుడు జన్యువులు లేకపోయినా ఆస్థమా దాడి చేయొచ్చు. ఆస్థమా బాధితుల్లో సుమారు 6% మంది ఇలాంటివారే. పుట్టుకతో ఆస్థమా జన్యు స్వభావం ఉన్నా అందరికీ సమస్యలు తెచ్చిపెట్టకపోవచ్చు. చాలావరకు నిద్రాణంగానే ఉంటుంది. అలర్జీ కారకాల ప్రభావానికి గురైనప్పుడు ఈ జన్యు స్వభావం బయటపడుతుంది. ఎండుగజ్జి లేదా ఆహార అలర్జీ గల పిల్లలకు ఆస్థమా ముప్పు ఎక్కువ. మానసిక ఆందోళన, ఒత్తిడి, కొన్నిరకాల వృత్తులు, ఇన్‌ఫెక్షన్ల వంటివీ ఆస్థమాను ప్రేరేపించొచ్చు.
లక్షణాలేంటి?
దగ్గు.. ముఖ్యంగా పడని వాతావరణంలో దగ్గు వస్తుంటుంది. శ్వాస తీసుకోవటం, వదలటంలో ఇబ్బంది కలుగుతుంది. ఛాతీ బరువుగా, బిగుతుగానూ అనిపించొచ్చు. శ్వాసిస్తున్నప్పుడు, దగ్గినప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. అయితే అందరిలో అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు. కొందరికి దగ్గు ఒక్కటే ఉండొచ్చు. పిల్లికూతలు, ఆయాసం అంతగా ఉండకపోవచ్చు. దీని లక్షణాలూ వస్తూ పోతుంటాయి కూడా. కొందరికి ఉన్నట్టుండి తలెత్తొచ్చు. తీవ్రంగానూ ఉండొచ్చు. ఇలాంటి సమయంలో శ్వాస తీసుకోవటం చాలా కష్టమైపోతుంది.
ఇన్‌హేలర్లపై అనుమానాలొద్దు
ఇన్‌హేలర్లు సురక్షితం. ఆందోళన, అనుమానాలు వద్దు. ఆస్థమా చాలా తీవ్రంగా ఉంటేనే, చివరిదశలోనే ఇన్‌హేలర్లు వాడుతారని అనుకోవద్దు. ఇవి ప్రాథమిక, ఉత్తమ చికిత్స సాధనాలని తెలుసుకోవాలి. వీటితో తీసుకునే మందు మోతాదు మైక్రోగ్రాముల్లో ఉంటుంది. నేరుగా శ్వాసమార్గాల్లోకే చేరుకుంటుంది. కాబట్టి పెద్దగా నష్టమేమీ ఉండదు. ఈ మందులకు అలవాటు పడటమనేది ఉండదు.
* ఆస్థమా పిల్లల విషయంలో- ‘పెరిగే వయసు కదా. ఇప్పట్నుంచే ఇన్‌హేలర్లు ఎందుకు?’ అని కొందరు వెనకాడుతుంటారు. స్టిరాయిడ్ల వాడకంతో ఎదుగుదల కుంటుపడుతుందని భయపడుతుంటారు. ఇది తప్పు. ఆస్థమా నియంత్రణలో లేకపోతేనే ఎదుగుదల దెబ్బతింటుంది. డాక్టర్ సూచించిన మోతాదులో మందు వాడితే ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు.
* ఇన్‌హేలర్లు ఖరీదైనవని మరికొందరి అభిప్రాయం. మాత్రలతో పోలిస్తే వీటి ధర ఎక్కువే కావొచ్చు. కానీ వీటిని సరిగా వాడకపోవటం వల్ల ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చుతో పదేళ్లకు సరిపడిన ఇన్‌హేలర్ మందులు కొనుక్కోవచ్చు.
* బయటి ఊళ్లకు వెళ్లినా వెంట ఇన్‌హేలర్లు తీసుకెళ్లాలి. వీటి వాడుకోవటాన్ని నామోషీగా భావించొద్దు. ఇన్‌హేలర్ వాడకంలో తప్పులు చేయొద్దు. దీన్ని నొక్కుతూనే మందును లోనికి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఇన్‌హేలర్‌కు స్పేసర్‌ను జోడించి మందు పీల్చుకోవటం అన్ని విధాలా మంచిది.
భయాలు, సందేహాలు వద్దు
* ఆస్థమా అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు.
* ఆస్థమాను నిర్లక్ష్యం చేయొద్దు. నియత్రణలో ఉంచుకోకపోతే తీవ్రమై ప్రాణాల మీదికీ తేవొచ్చు.
* చిన్నపిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఆస్థమా తగ్గిపోతుందన్నది అపోహ. అలర్జీ కారకాలను బట్టి, వీటికి ఎంతవరకు గురవుతున్నామనే దాన్ని బట్టి ఆస్థమా దాడి చేస్తుంది. పిల్లల్లో కొందరిలో ఆస్థమా లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చు. అలాగని నయమైనట్టు కాదు. వయసుతో పాటు ఊపిరితిత్తులు పెరగటం వల్ల జబ్బు తీవ్రత తగ్గుతుండొచ్చు గానీ పూర్తిగా నయమైందని అనుకోవటానికి లేదు.
* ఆస్థమా గల మహిళలు గర్భం ధరించినా ఎప్పటి మాదిరిగానే మందులు వాడుకోవాలి. ఆమాటకొస్తే మరింత జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది కూడా. ఆస్థమా నియంత్రణలో లేకపోతే గర్భస్రావం, నెలలు నిండకముందే కాన్పవ్వటం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టటం, బిడ్డలో ఊపిరితిత్తులు పరిపక్వం కాకపోవటం వంటి అనర్థాలు తలెత్తొచ్చు. ఇన్‌హేలర్ ద్వారా గర్భిణి తీసుకునే మందులు కడుపులో బిడ్డపై ఎలాంటి విపరీత ప్రభావాలు చూపవు.
పరీక్షలు-నిర్ధరణ
* స్పైరోమెట్రీ: ఆస్థమా నిర్ధరణకు ఇదే ప్రామాణిక పరీక్ష. చాలా తేలికైంది. గట్టిగా శ్వాస తీసుకొని స్పైరోమీటర్ గొట్టంలోకి గాలిని ఊదటం ఇందులో కీలకాంశం. ఆస్థమా బాధితులు గాలిని ఊదటానికి కాస్త సమయం తీసుకుంటారు. అంత బలంగానూ ఊదలేరు. గాలిని ఊదటానికి పట్టిన సమయం, గాలి ప్రవాహం, పీడనం ఆధారంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని లెక్కిస్తారు. ఒకసారి ఈ పరీక్ష చేశాక- శ్వాసనాళాలను విప్పార్చే మందును ఇచ్చి మరోసారి పరీక్షిస్తారు కూడా. ఈ రెండింటి ఫలితాల్లో 12 శాతానికి పైగా తేడా కనిపిస్తే ఆస్థమాగా నిర్ధరిస్తారు. గాలిగొట్టాలు సంకోచించేలా చేసే మందు ఇచ్చి కూడా ఈ పరీక్ష చేయొచ్చు. గాలిగొట్టాలు 20% కన్నా ఎక్కువ సంకోచించినట్టు తేలితే ఆస్థమాగా భావిస్తారు.
* పీక్‌ఫ్లో మీటర్: గాఢంగా గాలి పీల్చుకొని దీని గొట్టంలోకి గట్టిగా ఊదితే ఊపిరితిత్తుల నుంచి గాలి ఎంత బలంగా బయటకు వస్తోందనేది బయటపడుతుంది. పరికరం మీదుండే ముల్లు కదలటాన్ని బట్టి గాలి ఎంత బలంగా ఊదుతున్నారో తెలుస్తుంది. ఇది ఆస్థమా నిర్ధరణకే కాదు.. మందులు వేసుకుంటున్నప్పుడు అవెలా పనిచేస్తున్నాయో తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది.
* చర్మ పరీక్ష: అలర్జీ కారకాలను కచ్చితంగా గుర్తించటానికి స్కిన్ ప్రిక్ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇందులో అలర్జీ కారకాలను సూది ద్వారా కొద్దిగా ఇచ్చి పరీక్షిస్తారు. అలర్జీ తలెత్తితే అక్కడంతా ఎర్రగా అవుతుంది.
* ఎక్స్‌రే: ఆస్థమా బాధితులకు ఎక్స్‌రే తీసినా ఊపిరితిత్తుల్లో ఎలాంటి మార్పులు కనిపించవు. కానీ క్షయ, సీఓపీడీ, న్యుమోనియా, క్యాన్సర్, ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ) వంటి సమస్యల్లోనూ దగ్గు ఉంటుంది. అందువల్ల ఎక్స్‌రే తీసి చూడటం మంచిది. ఇతరత్రా సమస్యలేవైనా ఉంటే బయటపడతాయి.
అలర్జీ కారకాలకు దూరంగా..
కొందరికి ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో ఆస్థమా ఉద్ధృతమవుతుంటుంది. ఇది ఎప్పుడెప్పుడు ఎక్కువవుతుందనేది ఆస్థమా బాధితులకు తెలుస్తుంటుంది కూడా. కొందరికి చల్లగాలి పడకపోవచ్చు. వాన నీటిలో తడిస్తే సమస్య ఎక్కువ కావొచ్చు. ఎండాకాలంలో దుమ్మూధూళితో ఇబ్బంది కలగొచ్చు. కొందరికి ఏసీ, కొన్ని రకాల పదార్థాలు పడకపోవచ్చు. ఇలాంటి అలర్జీ కారకాలను గుర్తించి, వీటికి దూరంగా ఉంటే ఆస్థమాను చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ప్రధాన అలర్జీ కారకాలు
* పుప్పొడి * దుమ్ము ధూళి
* తవిటి పురుగులు (డస్ట్‌మైట్స్)
* వాహనాలు, సిగరెట్లు, అగరుబత్తీల పొగ
* పెంపుడు జంతువుల నూగు
* గోడలకు పట్టే చెమ్మ, నాచు
* సెంట్లు, సుగంధ ద్రవ్యాలు
* వంటింటి పోపు వాసనలు
* చల్లటి నీరు, కలుషిత గాలి
* బొద్దింకలు, నల్లుల వంటి కీటకాలు
జాగ్రత్తలు తప్పనిసరి
* బయటే కాదు, ఇంట్లో కాలుష్యమూ తక్కువేమీ కాదు. గాలి ధారాళంగా వచ్చిపోయేలా చూసుకోవాలి.
* ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చీపురుతో చిమ్మకుండా బట్టతో తుడుచుకోవాలి. గోడల మీద తేమ, చెమ్మ లేకుండా చూసుకోవాలి.
* దుప్పట్లు, దిండు కవర్లను వారానికోసారి శుభ్రంగా ఉతుక్కోవాలి. వీటిని వేడి నీటిలో జాడించి, ఎండలో ఆరబెట్టి వాడుకోవాలి.
* వాతావరణం మారే సమయంలో ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలి.
* పంటలకు పురుగు మందులు చల్లటం.. బొగ్గు గనుల్లో, రాళ్ల గనుల్లో పనిచేయటం వంటి కొన్ని వృత్తులతోనూ కొందరికి ఆస్థమా ప్రేరేపితం కావొచ్చు. ఇలాంటివాళ్లు ముక్కుకు, నోటికి మాస్కు లేదా రుమాలు చుట్టుకోవాలి. ఏసీ పడనివారు ముఖానికి నేరుగా గాలి తగలకుండా, గాలి మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి.
మందులు క్రమం తప్పకుండా..
అలర్జీ కారకాలకు దూరంగా ఉండటంతో పాటు మందులను క్రమం తప్పకుండా వాడుకోవటమూ ముఖ్యమే. ఆస్థమాకు ప్రధానంగా రెండు రకాల మందులు ఉపయోగపడతాయి. మార్పులు కనిపిస్తుంటాయి. ఒకటి- అలర్జీ కారకాల ప్రభావంతో గాలిగొట్టాలు ఉబ్బిపోయి.. లోపలి మార్గం సన్నబడటం. రెండోది- శ్వాసకోశ వ్యవస్థలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) కొనసాగటం. గాలిగొట్టాలు సంకోచించటమనేది అప్పటికప్పుడు తలెత్తుతుంది. కానీ వాపు ప్రక్రియ నిరంతరం ఉంటుంది. ఇదీ గాలిగొట్టాలు సంకోచించేలా చేస్తుంది. అందువల్ల ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని చికిత్స ఆధారపడి ఉంటుంది.
రిలీవర్లు (బ్రాంకోడైలేటర్లు): ఇవి ఆస్థమా లక్షణాల నుంచి తక్షణం ఉపశమనం కలిగిస్తాయి. ఇన్‌హేలర్ ద్వారా లోపలికి పీల్చుకున్నప్పుడు ఇవి గాలి గొట్టాలు విప్పారేలా చేస్తాయి. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. అయితే వీటి అవసరం మూడు నాలుగు రోజులకు మించి ఉండదు.
కంట్రోలర్లు: ఆస్థమా నియంత్రణలో ఉండటానికివి ఉపయోగపడతాయి. శ్వాసనాళాల్లో ఇలా సమస్య తరచూ తలెత్తకుండా చూస్తాయి. ఆస్థమా లక్షణాలు లేకపోయినా వీటిని వాడుకోవాలి. చాలామంది రిలీవర్లతో లక్షణాలు తగ్గగానే సమస్య నయమైందని అనుకుంటారు. ఇది తప్పు. లోపల వాపుప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆస్థమాను ఎప్పుడైనా ఉద్ధృతం చేయొచ్చు. కాబట్టి కంట్రోలర్లనూ విధిగా వాడుకోవాలి. వీటిని ఎంతకాలం వాడుకోవాలనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. కొందరికి నెలల్లోనే లక్షణాలు తగ్గొచ్చు. కొందరికి రెండు, మూడేళ్లు పట్టొచ్చు. కంట్రోలర్లు ఆపేసినా లక్షణాలు లేకపోతే పూర్తిగా మానేసే అవకాశమూ ఉంది. ఒకవేళ లక్షణాలు వస్తున్నట్టయితే జీవితాంతం వాడుకోవాల్సిందే.
* ఇలాంటి జాగ్రత్తలతో ఆస్థమాను నియంత్రణలో ఉంచుకోవచ్చు. అత్యవసరంగా ఆసుపత్రిలో చేరటాన్ని తప్పించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం
-
Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న
-
Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు