Updated : 09 Dec 2022 15:21 IST

చిన్నారుల్ని చురుగ్గా మార్చాలంటే..

ఎదిగే పిల్లలు కాస్త బద్ధకంగా తయారై, దేనిమీదా శ్రద్ధ పెట్టకపోతే తల్లిదండ్రులకు బెంగే. అలాంటి చిన్నారుల్లో మార్పు తేవాలంటే ఇలా చేసి చూడండి..

మీచిన్నారులకు పెట్టే ఆహారం, వారి జీవనశైలిని గమనించండి. వాళ్లు జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తీసుకుంటూ, కదలకుండా ఒకేచోట కూర్చుంటున్నారా అన్నది గమనించండి. ఎందుకంటే అతిగా ప్రాసెస్‌ చేసిన పదార్థాలూ, చిప్స్‌ లాంటివి ఎక్కువగా తినే చిన్నారుల్లో బద్ధకం సహజంగానే పెరిగిపోతుంది. అలాగే ఎక్కువ సమయం టీవీ లేదా కంప్యూటరు ముందు గడిపే పిల్లల్లోనూ చురుకుదనం తగ్గుతుంది. మీ పిల్లల జీవనశైలి ఇలాంటిదయితే దాన్ని మార్చే ప్రయత్నం చేయండి. ముందు పోషకాహారం ఇవ్వడం మొదలుపెట్టండి. మీరు పెట్టే స్నాక్స్‌ కూడా పోషకాలభరితంగా ఉండి, వారికి నచ్చేలా చేయండి. అలాగే ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటంటే.. రోజులో కనీసం ఆరుబయట స్నేహితులతో ఆడుకునేలా నియమం పెట్టండి. అదే సమయంలో సైకిలు తొక్కమనీ చెప్పండి. ఇవన్నీ వాళ్లను చురుగ్గా మారుస్తాయి.

* మీ చిన్నారులు ఎన్నింటికి నిద్రకు ఉపక్రమిసున్నారనేది చూడండి. లస్యంగా నిద్రపోయి, పొద్దున్నే లేచేవారికి నిద్రలేమి సమస్య సహజంగా ఎదురవుతుంది. అది చురుకుదనాన్ని తగ్గించి, మెదడును మొద్దుబారేలా చేస్తుంది. వీడియోగేమ్‌లూ, కంప్యూటర్‌లకూ అతుక్కుపోయే చిన్నారుల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుందంటోంది అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం. దాంతో రోజువారీ దినచర్యలో ఉదాసీనత, అసహనం వంటివి మొదలై, చురుకుదనం లోపిస్తుంది. ఈ పరిస్థితిని దూరం చేయాలంటే వేళకు నిద్రపోవడం అలవాటు చేయాలి. అది సెలవుల్లో అయినా సరే.. వేళపట్టున నిద్రించేలా చూడాలి.

* పిల్లల్లో ఉండే కొన్ని భయాలు కూడా వారిలోని ఉత్సాహంపై నీళ్లు చల్లేస్తాయి. అదే దీర్ఘకాలం కొనసాగితే మానసికంగా కుంగుబాటూ మొదలువుతుంది. కాబట్టి అలాంటి భయాలేవయినా వారిలో ఉన్నాయమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారు మానసికంగా దృఢంగా మారేందుకు మీ వంతు సహకరించండి. వాళ్లకు ఏ సమస్య వచ్చినా మీరు ఉన్నారనే భరోసాను ఇవ్వండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు