Anxiety: 5.. 4.. 3.. 2.. 1.. చిట్కా గురించి తెలుసా?

తీవ్ర ఆందోళన రోజువారీ పనుల మీద విపరీత ప్రభావం చూపుతుంది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంబంధాలనూ దెబ్బతీస్తుంది. ఏదో అయిపోతుందనే భావన మనసును తెగ వేధిస్తుంటుంది.

Updated : 10 Jul 2022 18:21 IST

తీవ్ర ఆందోళన రోజువారీ పనుల మీద విపరీత ప్రభావం చూపుతుంది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సంబంధాలనూ దెబ్బతీస్తుంది. ఏదో అయిపోతుందనే భావన మనసును తెగ వేధిస్తుంటుంది. కొన్ని పద్ధతులతో ఇలాంటి ఆలోచనా ధోరణిని మార్చుకోవచ్చు. కావాలంటే 5 - 4 - 3 - 2 - 1 చిట్కాను పాటించి చూడండి. మన జ్ఞానేంద్రియాలతో ముడిపడిన ఇది చాలా తేలికైంది. ఎక్కడైనా, ఎవరైనా పాటించొచ్చు.


5️⃣ చుట్టుపక్కల కనిపించే ఏవైనా అయిదు వస్తువులను తేరిపార చూడండి. పెన్ను, ఫ్యాన్, టేబుల్‌.. ఇలా ఏవైనా సరే.


4️⃣ తాకటానికి వీలైన నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకుతున్నప్పుడు చేతికి కలిగే స్పర్శను మనసులో ఊహించుకోండి. ఉదాహరణకు: పెంపుడు కుక్కను నిమురుతున్నప్పుడు వేళ్లకు తాకే మెత్తదనం, చల్లటి బాటిల్‌ను ముట్టుకున్నప్పుడు తగిలే చల్లదనం వంటివి. 


3️⃣ మీకు వినిపించే మూడు శబ్దాలను వినండి. అవి పక్షుల కిలకిలలు కావొచ్చు, పిల్లాడి నవ్వు కావొచ్చు, బూట్ల చప్పుడు కావొచ్చు. ఏవైనా సరే. శ్రద్ధగా ఆలకించండి. 


2️⃣ వాసన వచ్చే ఏవైనా రెండు పేర్లను ఉచ్చరించండి. వాటిని తలచుకుంటున్నప్పుడు ఆయా వాసనలనూ మనసులో ఊహించుకోండి. ఒకవేళ మల్లెపూల పరిమళం ఇష్టమైతే.. అవి అందుబాటులో ఉంటే వాటి వాసననూ పీల్చుకోవచ్చు. 


1️⃣ రుచి చూడగలిగిన ఒక వస్తువును గుర్తించండి. చుట్టుపక్కల అలాంటివేవీ కనిపించకోతే జేబులో చాక్లెట్‌ వంటిదేదైనా ఉంటే నోట్లో వేసుకొని చప్పరించండి.


ఇలా చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద దృష్టి సారిస్తే మనసు వర్తమానంలోకి వచ్చేస్తుంది. గతాన్ని తలచుకొని బాధపడటం, భవిష్యత్తును ఊహించుకొని బెంగపడటం తగ్గుతుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని