Updated : 22 Nov 2022 14:25 IST

కాన్పు తర్వాత పొట్ట తగ్గలేదేం?

సమస్య - సలహా

సమస్య: నాకు తొలి కాన్పు సమయంలో సిజేరియన్‌ చేశారు. పాప పుట్టి 9 నెలలు అయ్యింది. కడుపు ఇంకా ఎత్తుగానే ఉంది. మామూలు స్థాయికి రావాలంటే ఏం చేయాలి?

- వి. అరుణ, మెట్టు పాళయం, తమిళనాడు

 

సలహా: మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తుంటే కాన్పు తర్వాత సమతులాహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం వంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించటం లేదు. గర్భం ధరించిన తర్వాత పాప ఎదగటానికి వీలుగా గర్భసంచి సైజు పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో కడుపు కండరాలూ సాగుతాయి. కాన్పయ్యాక హార్మోన్ల మార్పుల కారణంగా పొట్ట సైజూ తగ్గుతుంది. సుమారు నాలుగు వారాల్లో గర్భసంచి తిరిగి మామూలు స్థాయికి చేరుకుంటుంది. పొట్ట వద్ద పేరుకున్న కొవ్వు కరగటం ఆరంభిస్తుంది. ఇందుకు బిడ్డకు చనుబాలు పట్టటం, సమతులాహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం వంటివి తోడ్పడతాయి. మనలో చాలామంది వీటిని పట్టించుకోరు. పెద్దాపరేషన్‌ (సిజేరియన్‌) అనగానే విశ్రాంతి తీసుకోవటానికే మొగ్గు చూపుతారు. పెద్దగా కదలరు. కొందరు లేచి బిడ్డకు పాలివ్వాలన్నా కష్టంగా భావిస్తుంటారు. బిడ్డకు పాలు పడితే.. ముఖ్యంగా కాన్పయిన తొలి నెలల్లో తల్లికి రోజుకు సుమారు 500 కేలరీలు అదనంగా ఖర్చవుతాయి. దీంతో బరువూ తగ్గుతుంది. మామూలు కాన్పునకు, సిజేరియన్‌కు పెద్ద తేడా ఏమీ లేదు. సిజేరియన్‌ అయినా కూడా మామూలు కాన్పు అయినవారి మాదిరిగానే 6 వారాల తర్వాత వ్యాయామం ఆరంభించొచ్చు. ఇప్పటికే మీరు 9 నెలలు అయ్యిందన్నారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే పొట్ట అలాగే ఉండిపోవచ్చు. రెండోసారి గర్భం ధరిస్తే కండరాలు మరింత సాగొచ్చు. పొట్ట ఇంకా పెరగొచ్చు. ఆపరేషన్‌ చేసిన సమయంలో వేసిన కుట్లు విడిపోయి ఆ ఖాళీలోంచి పేగు బయటకు తోసుకురావొచ్చు (హెర్నియా). ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరు సమతులాహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటంపై దృష్టి పెట్టండి. నడవటం ఉత్తమం. రోజుకు కనీసం గంట సేపైనా వేగంగా నడవాలి. దీంతో పొట్ట చాలావరకు తగ్గుతుంది. అలాగే సాగిన కడుపు కండరాలు దగ్గరికి రావటానికి ప్రత్యేకమైన వ్యాయామాలూ చేయాలి. ఇందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. ఆసనాలతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ల కోసం ప్రత్యేకమైన జిమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీలైతే జిమ్‌లో చేరొచ్చు. శిక్షకుల సూచనలతో పొట్టను తగ్గించే వ్యాయామాలు చేయొచ్చు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు