Summer: ఎండాకాలంలో చర్మ సంరక్షణ ఎలా?

ఎండ చర్మాన్ని రకరకాలుగా దెబ్బతీస్తుంది. కాబట్టి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. సన్‌స్క్రీన్‌ లోషన్లను రాసుకోవటమే కాదు

Updated : 30 May 2023 05:30 IST


ఎండ చర్మాన్ని రకరకాలుగా దెబ్బతీస్తుంది. కాబట్టి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవటం మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం. సన్‌స్క్రీన్‌ లోషన్లను రాసుకోవటమే కాదు.. ఆహార, విహార పరంగానూ మార్పులు చేసుకోవాలి.

* వీలైనంతవరకు ఉదయం 10 నుంచి 4 గంటల మధ్య ఎండకు వెళ్లకుండా చూసుకోవాలి. ఎండ మరీ ఎక్కువగా కాసే 11 నుంచి ఒంటి గంట మధ్యలో ఎండకు అసలే వెళ్లకూడదు. ఒకవేళ బయటకు వెళ్తే గొడుగు వాడుకోవాలి. వెడల్పు అంచుల టోపీ, కళ్లకు చలువ అద్దాలు ధరించాలి. 

* నూలు దుస్తులు, లేత రంగు దుస్తులు, గాలి ఆడే పలుచటి దుస్తులు ధరించాలి. జీన్స్‌ వేసుకోవద్దు. 

* ఇంట్లో, ఆఫీసులో చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్‌, విసన కర్ర, ఎయిర్‌ కూలర్‌, ఏసీలు.. ఇలా వేటినైనా వాడుకోవాలి. వీటితో చెమట పొక్కులు, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చు. 

* సమతులాహారం తీసుకోవాలి. ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఎండకాలంలో లభించే నారింజ, బత్తాయి, పుచ్చకాయ, కీర దోసకాయ, సపోటా, మామిడి పండ్లు చాలా మేలు చేస్తాయి. వీటిల్లోని బీటా కెరటిన్‌, లైకోపీన్‌ వంటి వృక్ష రసాయనాలు ఎండ ప్రభావం నుంచి కాపాడతాయి. చర్మం నిగనిగలాడేలా చేస్తాయి. 

* వేపుడు పదార్థాలు ఎక్కువగా తినొద్దు. జారుగా ఉండే కూరలు తినాలి. పెరుగు, సాంబారు, రసం తీసుకోవాలి. 

* గుమ్మడి, పుచ్చకాయ, అవిసె పలుకులు.. నువ్వులు.. బాదం, అక్రోట్ల వంటివి తినాలి. వీటిల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

* నీరు, ద్రవాలు ఎక్కువగా తాగాలి. లేకపోతే ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి, చర్మం పొడిబారొచ్చు. మజ్జిగ లేదా నిమ్మరసం నీటిలో చక్కెర, ఉప్పు కలిపి అయినా తాగొచ్చు. కూల్‌డ్రింకులు వద్దు. వీటితో దాహం తీరదు. ఇవి ఒంట్లోంచి మరింత ఎక్కువ నీటిని బయటకు వెళ్లగొడతాయి. 

* ఈతకొలనుల్లో క్లోరిన్‌ వంటి రసాయనాలు కలుపుతుంటారు. వీటితో అటోపిక్‌ ఎగ్జిమా గలవారికి దురద ఎక్కువ కావొచ్చు. బీచ్‌ల్లోనూ జాగ్రత్త అవసరం. సీఅనిమోన్స్‌, జెల్లీఫిష్‌ వంటి కొన్ని జీవులు సముద్ర తీరంలో ఉండిపోవచ్చు. ఇలాంటివి లార్వాను విడుదల చేస్తాయి. ఇది చర్మానికి అంటుకుంటే తీవ్ర డెర్మటైటిస్‌ వస్తుంది. సముద్ర తీరంలో ఈత కొడుతున్నప్పుడు ఒకోసారి జెల్లీఫిష్‌లు తమ టెంటికల్స్‌తో తాకొచ్చు. వీటితోనూ దద్దుర్లు వస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు