Food Habits: రోజంతా నోరాడిస్తున్నారా?... అయితే, ఇవి తెలుసుకోవాల్సిందే!

ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉండాలా.. ఈ మాట మీరు చాలాసార్లు ఇంట్లో వినే ఉంటారు. తింటే తప్పేముంది అనే డౌట్‌ కూడా మీకు వచ్చి ఉంటుంది. దానికి సమాధానమే ఈ కథనం.

Updated : 22 Jan 2023 17:16 IST

కొందరు ఎప్పుడూ మిఠాయిలు, జంతికల వంటి చిరుతిళ్ల వంటివి ఏదో ఒకటి నోట్లో వేసుకొని నములుతూనే ఉంటారు. తినేది కాస్తే కదా ఏమీ కాదులే అని భావిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి సహేతుక కారణాలే ఉన్నాయి.

  • మనం ఏదైనా తిన్నాక రెండు గంటల వరకు పళ్ల మీద ఎనామిల్‌ క్షీణిస్తూ ఉంటుంది. అందుకే భోజనం చేశాక పళ్లు తోముకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇక తరచూ ఏదో ఒకటి నములుతూ, బ్రష్‌ చేసుకోకుండా ఉన్నట్టయితే ఎనామిల్‌ దెబ్బతినే ప్రక్రియ రోజంతా కొనసాగుతూనే ఉంటుంది. దీంతో దంతాలు క్షీణించే ముప్పూ పెరుగుతుంది.
  • తినటం మొదలు పెట్టిన వెంటనే రక్తంలో ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. కొన్ని చిరుతిళ్లు (మిఠాయిల వంటివి) ప్లేట్‌లెట్‌ కణాలు జిగురుగా అయ్యేలా చేస్తాయి. దీంతో రక్తం గడ్డ కట్టే స్వభావం పెరుగుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పూ ఎక్కువవుతుంది. మరోవైపు తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్‌ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. అదేపనిగా ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంటే రక్తంలో ఇన్సులిన్‌ మోతాదులు నిరంతరం ఎక్కువ స్థాయిలోనే ఉండే ప్రమాదముంది. ఇది ఊబకాయం, గుండెపోటు వంటి సమస్యల ముప్పు పెరిగేలా చేస్తుంది.
  • చిరుతిళ్లతో మరో సమస్య- కడుపు నిండినట్టు అనిపించకపోవటం. దీంతో ఎక్కువెక్కువగా తింటారు. బరువు తగ్గాలని అనుకునేవారికిది చేటే.
  • ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటే నిద్ర కూడా అస్తవ్యస్తం కావొచ్చు. కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్‌ తింటున్నట్టయితే పోషణ లోపానికీ దారితీయొచ్చు.
  • మనం ఏదైనా తిన్నప్పుడు జీర్ణకోశానికి రక్తం ఎక్కువగా సరఫరా అవుతుంది. కండరాలు, మెదడుకు తక్కువగా అందుతుంది. అందువల్ల ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటే రక్తసరఫరా వ్యవస్థ క్రమం అస్తవ్యస్తమవుతుంది. అదేపనిగా తినటం అజీర్ణం, ఛాతీలో మంట వంటి సమస్యలకూ దారితీయొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని