Insulin : ఎండాలంలో ఇన్సులిన్‌ భద్రం

నాకు పదేళ్లుగా మధుమేహం ఉంది. రోజూ ఇన్సులిన్‌ తీసుకుంటున్నాను. వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నాం. ఎండాకాలంలో ఇన్సులిన్‌ భద్రంగా ఉంచుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Updated : 18 Apr 2023 08:12 IST

సమస్య: నాకు పదేళ్లుగా మధుమేహం ఉంది. రోజూ ఇన్సులిన్‌ తీసుకుంటున్నాను. వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నాం. ఎండాకాలంలో ఇన్సులిన్‌ భద్రంగా ఉంచుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

విశ్వనాథ్‌

సలహా: ఇన్సులిన్‌ ఒక ప్రొటీన్‌. దీనిపై బయటి వాతావరణం ప్రభావం చూపుతుంది. వేడికి గురైతే దెబ్బతింటుంది. ఎంత ఎక్కువసేపు బయటపెడితే అంత ఎక్కువగా చెడిపోతుంది. కింద పడినా పగలని బుడ్డిల్లో (వయల్స్‌) వచ్చే ఇన్సులిన్‌ కాస్త స్థిరంగా ఉంటుంది. అయినా కూడా అరగంట కన్నా ఎక్కువసేపు బయట పెట్టకూడదు. ఇటీవల చాలామంది ఇన్సులిన్‌ పెన్సిళ్లు (పెన్‌ ఫిల్లర్లు) వాడుతున్నారు. వీటి గ్లాసు చాలా పలుచగా ఉంటుంది. ఇది అరగంట కన్నా తక్కువ సమయంలోనే చెడిపోవటం మొదలెడుతుంది. వీటిని మెటల్‌ పెన్‌లో పెట్టుకునే ఇన్సులిన్‌ స్థిరంగా ఉంటుందని, నెలైనా చెడిపోదని చెబుతుంటారు. కానీ బయటి వాతావరణంలో ఎంత జాగ్రత్తగా దాచినా లోహం వేడెక్కే అవకాశముంది. ఇంట్లో పెట్టినా, నీడలో పెట్టినా వేడెక్కుతుంది. దీంతో ఇన్సులిన్‌ చెడిపోవచ్చు. అలాగని ఇదేమీ విష పదార్థంగా మారదు. కానీ ప్రభావం తగ్గుతుంది. పనిచేయాల్సినంతగా పనిచేయదు. సూచించిన మోతాదులో ఇన్సులిన్‌ తీసుకున్నా సరిపోకపోవచ్చు. దీంతో గ్లూకోజు అదుపులోకి రాకపోవచ్చు. కాబట్టి ఇన్సులిన్‌ను ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే భద్రపరచుకోవాలి. అయితే డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టుకోవద్దు. బయటికి వెళ్లినప్పుడూ చల్లగా ఉండేలా చూసుకోవాలి. దుకాణంలో కొనుక్కున్న వెంటనే జెల్‌ ఐస్‌ప్యాక్‌లతో కూడిన థర్మాకోల్‌ లేదా టిఫిన్‌ బాక్స్‌లో పెట్టుకొని తెచ్చుకోవాలి. బాక్స్‌లో కనీసం నాలుగు ఐస్‌ప్యాక్‌లు ఉండేలా చూసుకోవాలి. వీటి మధ్యలో ఇన్సులిన్‌ బుడ్డి లేదా పెన్సిల్స్‌ పెట్టుకోవాలి. సెలవుల్లో యాత్రలకు గానీ బయటికి ఎక్కడికైనా వెళ్లినప్పుడు గానీ దీన్ని మరవరాదు. ఇన్సులిన్‌ పెన్నులను జేబులో పెట్టుకొని తిరగ కూడదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకేసారి నెలకు సరిపడా ఇన్సులిన్‌ను అందజేస్తున్నారు. చాలామంది దీన్ని జేబులో పెట్టుకొనే తెచ్చుకుంటుంటారు. ఇది కొన్నిసార్లు మూడు నాలుగు గంటల వరకూ బయటే ఉంటుంది. ఇలా చేయటం మంచిది కాదని గుర్తించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు