blood tests: రక్త పరీక్షలు వినూత్నంగా..

రక్త పరీక్షలు కొత్త కాదు. రకరకాల జబ్బుల నిర్ధరణకు వాడుతూనే ఉన్నాం. మరి క్యాన్సర్లు, అల్జీమర్స్‌ వంటి తీవ్ర సమస్యలనూ గుర్తించగలిగితే? ఒక్క చుక్క రక్తంతోనే వాటిని పట్టుకోవచ్చు.

Published : 02 Jul 2024 00:19 IST

రక్త పరీక్షలు కొత్త కాదు. రకరకాల జబ్బుల నిర్ధరణకు వాడుతూనే ఉన్నాం. మరి క్యాన్సర్లు, అల్జీమర్స్‌ వంటి తీవ్ర సమస్యలనూ గుర్తించగలిగితే? ఒక్క చుక్క రక్తంతోనే వాటిని పట్టుకోవచ్చు. తేలికగా, చవకగా జబ్బులను నిర్ధరించొచ్చు. ఇలాంటి వినూత్న రక్త పరీక్షలు అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా. 

గుండె కొట్టుకుంటున్న ప్రతిసారీ శరీరమంతా రక్తం ప్రవహిస్తుంది. ఇది ఆక్సిజన్‌ను సరఫరా చేస్తూ ప్రాణాలను నిలుపుతుంది. కణజాలాలకు పోషకాలను అందించటమే కాకుండా వ్యర్థాలను బయటకు వెళ్లగొట్టటంలోనూ సాయం చేస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు వెళ్లి, వస్తుండటం వల్ల ఒంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి రక్తం ఉపయోగపడుతుంది. కణజాలాల నుంచి బోలెడన్ని జీవరసాయన మిశ్రమాలు రక్తంలో కలుస్తుంటాయి మరి. కాబట్టే జబ్బులను గుర్తించటానికి దీన్నొక సాధనంగా వాడుకుంటున్నారు. రక్త పరీక్షలతో జబ్బులను కనిపెట్టటం, చికిత్సలను నిర్ణయించుకోవటం కొత్తేమీ కాదు. కొన్ని పరీక్షలు గుండె జబ్బు ముప్పును తెలుసుకోవటానికి తోడ్పడితే.. కొన్నేమో మధుమేహం, విటమిన్ల లోపం, ఇన్‌ఫెక్షన్ల నిర్ధరణకు దోహదం చేస్తాయి. కొన్ని పరీక్షలను పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బుల నివారణకూ ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇవి వీటికే పరిమితం కావటం లేదు. తేలికైన రక్త పరీక్షతో డిమెన్షియా, అలాగే క్యాన్సర్‌ వంటి ప్రమాదకర సమస్యలను గుర్తించే దిశగానూ పరిశోధకులు పురోగమిస్తున్నారు.

క్యాన్సర్ల శోధనలో

శరీరంలో మామూలు కణాల మాదిరిగానే క్యాన్సర్‌ కణాలూ నిరంతరం రక్తాన్ని తాకుతుంటాయి. అంటే కణితులకు సంబంధించిన జన్యు ముక్కల వంటివి రక్తంలో కలిసే అవకాశముందన్నమాట. క్యాన్సర్‌ కణాలు సైతం కలవొచ్చు. ఇలాంటి వాటిని గుర్తించటానికి పరిశోధకులు పరీక్షలను రూపొందించారు. వీటినే ద్రవ బయాప్సీలనీ పిలుచుకుంటున్నారు. కొన్ని క్యాన్సర్లలో చికిత్స అనంతరం కణితి తిరిగి ఏర్పడుతుందా అనేది గుర్తించటానికి ఇప్పటికే ఈ పరీక్షలను వాడుకుంటున్నారు. మళ్లీ తిరగబెట్టకుండా ఏయే కణితులకు మరింత ఎక్కువ చికిత్స అవసరమో తెలుసుకోవటానికీ ఇవి ఉపయోగపడతాయా? అనే దృష్టితోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో రక్త పరీక్షలతో క్యాన్సర్‌ ఆనవాళ్లను ముందుగా పట్టుకునే అవకాశమూ ఉంది. తొలిదశలో క్యాన్సర్లను గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. ఇది ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తుంది. ఇప్పటికే రొమ్ముక్యాన్సర్‌కు మామోగ్రామ్, పెద్దపేగు క్యాన్సర్‌కు కొలనోస్కోపీ వంటి ముందస్తు పరీక్షలు (స్క్రీనింగ్‌) అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి రక్త పరీక్షలంత తేలికైనవి కావని చెప్పుకోవచ్చు. చాలా క్యాన్సర్లకు ఇప్పటికీ ముందస్తు పరీక్షలు అందుబాటులో లేవు. సగానికి పైగా క్యాన్సర్‌ మరణాలు ఇలాంటి క్యాన్సర్లతోనే సంభవిస్తుండటం గమనార్హం. ద్రవ బయాప్సీలతో వీటిని నివారించుకోవటం సాధ్యమే. ఒక్క చుక్క రక్తంతోనే చాలా రకాల క్యాన్సర్లను పట్టుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి పరీక్షలు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. వీటితో ఎలాంటి ఫలితం కనిపిస్తుందో ఇంకా కచ్చితంగా తెలియదు. కానీ కొన్నిచోట్ల కొన్ని కంపెనీలు ఈ పరీక్షలను నేరుగా నిర్వహిస్తున్నాయి. వీటి గురించి అప్రమత్తంగా ఉండటం మంచిది. క్యాన్సర్‌ లేకపోయినా ఉన్నట్టు తేలితే ఆందోళనకు గురికాక తప్పదు.

మనదేశంలోనూ

మనదగ్గరా ద్రవ బయాప్సీ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇటీవల హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తిరువనంతపురంలోని రీజినల్‌ క్యాన్సర్‌ సెంటర్‌తో కలిసి రకరకాల రొమ్ముక్యాన్సర్లను గుర్తించే రక్త పరీక్షను రూపొందించారు. ఇందుకోసం వందలాది క్యాన్సర్‌ నమూనాల్లోని మైక్రోఆర్‌ఎన్‌ఏలను విశ్లేషించారు. వీటిల్లో 439 మైక్రోఆర్‌ఎన్‌ఏలు చుట్టుపక్కల కణజాలాల్లోకి చొచ్చుకెళ్లే రకం రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించినవని గుర్తించారు. చివరికి 107 మైక్రోఆర్‌ఎన్‌ఏలు రొమ్ముక్యాన్సర్ల జీవ సూచికలుగా ఉపయోగపడు తున్నాయని తేల్చారు. రక్తంలో కనిపించే వీటి ఆధారంగా క్యాన్సర్‌ రకాలు, గ్రేడ్, దశలను గుర్తించే అవకాశం కూడా ఉండటం గమనార్హం. ఇది అందుబాటులోకి వస్తే ఒక్క రక్తం చుక్కతోనే రొమ్ముక్యాన్సర్‌ను తేలికగా గుర్తించొచ్చు.

అల్జీమర్స్‌ గుర్తింపులో

మెదడులోనూ బోలెడన్ని రక్తనాళాలుంటాయి. అందువల్ల దెబ్బతిన్న మెదడు కణాలు రక్తంలోనూ కలుస్తుంటాయి. మానసిక సమస్యలను నిర్ధరించటానికి, మెరుగైన చికిత్సల కోసం రక్త పరీక్షలను అభివృద్ధి చేయాలని పరిశోధకులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అంత సఫలం కాలేదు. అయితే తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా ముప్పు పొంచి ఉన్నవారిని గుర్తించేందుకు రూపొందించిన రక్త పరీక్షలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఈ జబ్బులు గలవారిలో దెబ్బతిన్న మెదడు కణాలకు సంబంధించిన ప్రొటీన్లను ఇప్పుడు బాగా అవగతం చేసుకున్నారు. అంటే వీటిని గణించటం సాధ్యమేనన్నమాట. వృద్ధుల్లో తలెత్తే డిమెన్షియాలో ఎక్కువగా కనిపించేది అల్జీమర్స్‌ జబ్బు. ప్రస్తుతం దీంతో ముడిపడిన ప్రొటీన్లను మెదడు స్కాన్, వెన్నుద్రవం పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. అయితే ఇవి చాలా ఖరీదైనవి. అన్నిచోట్లా అందుబాటులో లేవు. ఈ ప్రొటీన్లు రక్తంలోనూ కనిపిస్తుండటం వల్ల వీటిని గుర్తించే రక్త పరీక్షలు వస్తే చవకగానే కనుక్కోవచ్చు. పైగా తేలిక కూడా. అల్జీమర్స్‌ తొలిదశ లక్షణాలను రక్త పరీక్షలతో గుర్తించొచ్చని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటివారిని ముందుగానే గుర్తించి, చికిత్స చేసే అవకాశాలనూ పరిశోధకులు పరిశీలిస్తున్నారు. మెదడు కణాలు చనిపోవటాన్ని నివారించటానికి లేదా ఆలస్యం చేయటానికిది దోహదం చేయగలదని ఆశిస్తున్నారు. తొలిదశలోనే అల్జీమర్స్‌కు చికిత్స చేస్తే మతిమరుపు వంటి లక్షణాలు త్వరగా ముంచుకురాకుండా చూసుకోవచ్చని అధ్యయనాలూ సూచిస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని