Diabetes: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా?

ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం పడటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని

Published : 25 Jul 2022 18:24 IST

ఉపవాసం చెయ్యటం బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గేందుకు దోహదం పడటమేకాదు.. ఒంట్లో గ్లూకోజు నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయులూ తగ్గుతున్నాయని గ్రహించారు. రోజులోనో, వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల (దీన్నే వైద్యపరిభాషలో ఇప్పుడు ‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ - ఐఎఫ్‌’ అంటున్నారు) శరీరంలో ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అలాగే జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు ఇటీవలి కాలంలో నిర్ధారణకు వస్తున్నారు. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు. మరి మధుమహంతో బాధపడేవారు ఉపవాసం చేయొచ్చా?

మధుమేహం (Diabetes) అనేది ఒక ప్రత్యేకమైన దేహస్థితి. మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అంటారు. పిండిపదార్థాల వంటివన్నీ తీసుకుంటున్నా కూడా వీరిలో శరీరం- ఎలాగోలా తంటాలుపడి కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ స్థితిలో వీరు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉంటే ‘ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌’ అనేది బాగా పెరుగుతుంది. ఇక 6 గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో- వీరి శరీరంలో ఎసిటోన్‌, ఎసిటాల్డిహైడ్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్థాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. వీటినే ‘కీటోన్‌ బోడీస్‌’ అంటారు.

 శరీరంలో వీటి స్థాయులు పెరిగితే గుండె, ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతింటూ, క్రమేపీ అవి విఫలమైపోతుంటాయి. అందుకే మధుమేహులకు ఏదైనా సర్జరీ వంటివి చెయ్యాల్సి వచ్చి, గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా కూడా ఒకవైపు నుంచి గ్లూకోజు ఎక్కిస్తూ, మరోవైపు ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారు. ఎప్పుడైనా సరే, మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ అవసరం. కాబట్టి మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం. అయితే మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం మంచే చేస్తోందని, దీనివల్ల వారు త్వరగా మధుమేహం బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి మధుమేహం లేనివారు, త్వరలో మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు.. అప్పుడప్పుడు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం చెయ్యటం మంచిదని గుర్తించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని