Stress - Cancer: ఒత్తిడితో క్యాన్సర్‌!

క్యాన్సర్‌ పేరు వింటేనే వణికిపోతాం. ఇక దాని బారినపడితే చెప్పేదేముంది? తనకే ఎందుకొచ్చిందనే మథన మొదలవుతుంది. ఏం పాపం చేశామోనని నిందించుకోవటమూ ఎక్కువవుతుంది.

Updated : 04 Apr 2023 07:14 IST

క్యాన్సర్‌ పేరు వింటేనే వణికిపోతాం. ఇక దాని బారినపడితే చెప్పేదేముంది? తనకే ఎందుకొచ్చిందనే మథన మొదలవుతుంది. ఏం పాపం చేశామోనని నిందించుకోవటమూ ఎక్కువవుతుంది. ఇలాంటి మానసిక వేదన సమస్యను మరింత తీవ్రం చేస్తుందనే విషయం తెలుసా? క్యాన్సర్ల నుంచి కోలుకోవటమూ ఆలస్యమవుతుంది. చికిత్సలు అంత సమర్థంగా పనిచేయవు కూడా. కాబట్టే వైద్యరంగం క్యాన్సర్ల విషయంలో మానసిక ఒత్తిడిని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటోంది. తీవ్ర భావోద్వేగ సంఘర్షణలు క్యాన్సర్లను ప్రేరేపిస్తుండటం.. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే క్యాన్సర్లు త్వరగా నయం కావటం.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే తిరిగి క్యాన్సర్‌ తలెత్తే అవకాశం తక్కువగా ఉంటుండటమే దీనికి నిదర్శనం. అధ్యయనాలే కాదు.. వైద్య అనుభవాలూ ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నాయి. అందుకే క్యాన్సర్లను మానసిక ఒత్తిడి దృష్టితో చూడాలనే భావన రోజురోజుకీ బలపడుతోంది.

‘‘చాలా రకాల జబ్బులను నయం చేయటం డాక్టర్లకు తెలియదు. ఎందుకంటే వాళ్లు పూర్ణత్వమంటే ఎరుగరు. మొత్తం (శరీరం) బాగా లేకపోతే ఆ భాగం (అవయవం) బాగుండదు.’’ - గ్రీకు తత్వవేత్త ప్లేటో చెప్పిన మాటలివి. ఇటీవలి కాలంలో వీటికి ప్రాధాన్యం పెరుగుతోంది. శరీరం, మనసును వేరు చేసి చూడలేం. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి రెండూ కీలకమే. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ‘కేవలం జబ్బులు లేకపోవటమే కాదు.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పూర్తిగా బాగున్న స్థితినే ఆరోగ్యం’గా నిర్వచించింది. శరీరం, చుట్టుపక్కల పరిసరాలు, భావోద్వేగాలు, మానసిక స్థితులు, ఆహార అలవాట్లు, వ్యాయామ తీరుతెన్నుల వంటి పలు అంశాల సమతుల్యతే ఆరోగ్యమనే భావన బలపడుతోంది. ఇలాంటి సమతుల్యతను సాధించటంలో మానసిక ఒత్తిడి కీలకపాత్ర పోషిస్తోంది. ఇది గతి తప్పటమే ఆధునిక మానవుడు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు బీజం వేస్తోంది మరి!

రుజువైన సత్యం

ఆత్మీయులు తీవ్ర జబ్బుల బారినపడటం, మరణించటం వంటి గణనీయమైన సంఘటనలు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంటాయి. ఇది జీవనశైలి సమస్యలకు దారితీస్తుంది. క్యాన్సర్‌ కూడా ఒకరకంగా జీవనశైలితో ముడిపడిందే. హఠాత్తుగా విషాద వార్తలు వినటం, తీవ్ర భావోద్వేగాలకు లోనవ్వటం గుండెపోటుకు దారితీస్తున్నట్టు ఇప్పటికే రుజువైంది. అధిక రక్తపోటు, పొగ తాగటం, కొలెస్ట్రాల్‌ పెరగటం వంటి సంప్రదాయ ముప్పు కారకాల మాదిరిగానే భావోద్వేగాలతో కూడిన ఒత్తిడి సైతం గుండెజబ్బులకు కారణమవుతోందని అధ్యయనాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో రకరకాల హార్మోన్లు విడుదలవుతాయి. వీటితో రక్తపోటు ఎక్కువవుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఒత్తిడితో రక్తంలో గ్లూకోజు మోతాదులూ పెరుగుతాయి. దీంతో మధుమేహం వచ్చే అవకాశమూ పెరుగుతుంది. అప్పటికే మధుమేహం గలవారికి గ్లూకోజు మరింత ఎక్కువగా పెరుగుతుంది కూడా. ఒత్తిడి హార్మోన్ల ప్రభావంతో అధిక బరువు, ఊబకాయం ముప్పులూ పొంచి ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్‌ కారకాలే. మధుమేహం గలవారికి అన్నిరకాల ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఊబకాయంతో రొమ్ముక్యాన్సర్‌, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని ఇప్పటికే తెలుసు. ఇవి ఒకరకంగా మానసిక ఒత్తిడితో ముడిపడి ఉండటం గమనార్హం.

సంబంధం సంక్లిష్టం

ఒత్తిడి, క్యాన్సర్ల మధ్య సంబంధం సంక్లిష్టమైందనే చెప్పుకోవచ్చు. ఒకేస్థాయిలో ఒత్తిడికి గురైనా దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందరికీ క్యాన్సర్‌ కారకంగా పరిణమించాలనేమీ లేదు. కానీ ఇది రోగనిరోధక వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావమే చూపుతుంది. ఇదే క్యాన్సర్లకు దారితీస్తోంది. క్యాన్సర్‌ అనేది ఒకరకంగా గతి తప్పిన రోగనిరోధక వ్యవస్థ ఫలితమే. క్యాన్సర్‌కు మూలం జన్యుమార్పులు. ఇవి వయసు పెరుగుతున్నకొద్దీ తలెత్తుతుంటాయి. పరిసరాల ప్రభావాలు వీటిని మరింత ప్రేరేపిస్తుంటాయి. వీటిని మనం ఆపలేం. ఇదంతా ప్రాథమిక స్థాయిలో జరుగుతూనే వస్తుంది (బేసల్‌ మ్యుటేషన్‌ రేట్‌). అయితే మరోవైపు జన్యుమార్పులను సరిదిద్దే ప్రక్రియలూ కొనసాగుతూ వస్తాయి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జన్యుపరంగా మారిన కణాలను గుర్తించటానికి నిరంతరం వెతుకుతుంది. వాటిని పట్టుకొని నిర్మూలిస్తుంది. ఇలా గతి తప్పిన కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ కణితిగా ఏర్పడినా దాంతో పోరాడుతుంది. వయసుతో పాటు జన్యు మార్పులను సరిదిద్దే ప్రక్రియలు విఫలమవుతూ వస్తుంటాయి. దీనికి మానసిక ఒత్తిడి కూడా తోడైతే ఈ ప్రక్రియలు పూర్తిగా విఫలమవుతాయి. ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్‌, ఎడ్రినలిన్‌, నార్‌ఎపినెఫ్రిన్‌ వంటి హార్మోన్లు పెద్దఎత్తున విడుదలవుతాయి. నిజానికివి తాత్కాలికంగా మేలు చేసేవే. ఏదైనా ప్రమాదం, ఆపద ఎదురైనప్పుడు అక్కడ్నుంచి పారిపోవటానికో, ధైర్యంగా ఎదుర్కోవటానికో తోడ్పడతాయి. ఆయా ప్రమాదాలు తొలగిపోయాక మామూలు స్థితికి వస్తాయి. కానీ కొందరిలో మానసిక ఒత్తిడి దీర్ఘకాలంగా (క్రానిక్‌) కొనసాగుతూ వస్తుంది. అంటే ప్రమాదాల వంటివేవీ లేకపోయినా నిరంతరం శరీరం ఒత్తిడికి గురవుతూనే ఉంటుందన్నమాట. దీంతో కణస్థాయిలో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తుతుంది. రోగనిరోధక వ్యవస్థ గతి తప్పుతుంది. జన్యుమార్పులతో కూడిన కణాలను నిర్మూలించే ప్రక్రియ మందగిస్తుంది. ఇది క్రమంగా క్యాన్సర్‌కు దారితీస్తుంది. పరిశోధకులు జంతువులను ఒత్తిడికి గురిచేసి మరీ ఈ విషయాన్ని గుర్తించారు.

కోలుకోవటం సుస్పష్టం

మానసిక ఒత్తిడితో క్యాన్సర్లు వస్తాయని కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఒత్తిడిని తగ్గించుకుంటే క్యాన్సర్‌ నుంచి త్వరగా కోలుకోవటం, చికిత్సలు సమర్థంగా పనిచేయటం, హాయిగా జీవిస్తుండటం మాత్రం నిజం. అధ్యయనాలు, అనుభవాలు చెబుతున్న సత్యమిది. మానసిక ప్రశాంతతో ఒత్తిడి హార్మోన్ల మోతాదులు తగ్గుతాయి. ఫలితంగా రోగనిరోధకశక్తి పుంజుకుంటుంది. దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్ల వంటి జబ్బులను సమర్థంగా ఎదుర్కోవటాన్ని నేర్చుకుంటుంది. ఇది సిద్థాంతం మాత్రమే కాదు.. ప్రయోగాత్మకంగానూ రుజువైంది.

క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారికైనా, క్యాన్సర్‌ తగ్గినవారికైనా మానసిక ఒత్తిడిని తగ్గించే యోగా, ధ్యానం మేలు చేస్తున్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. వీరు క్యాన్సర్ల నుంచి త్వరగా కోలుకోవటమే కాదు, తిరిగి క్యాన్సర్‌ వచ్చే అవకాశమూ తగ్గుతోంది. రకరకాల క్యాన్సర్లలో మానసిక ప్రశాంతత ప్రభావాలను పరిశోధకులు పరిశీలించారు. రొమ్ముక్యాన్సర్‌ బాధితుల్లో మరింత ఎక్కువగా విశ్లేషించారు. రొమ్ముక్యాన్సర్‌ చికిత్స తీసుకున్నవారిని రెండు బృందాలుగా విభజించారు. యోగా, ధ్యాన పద్ధతులను పాటించినవారిలో చికిత్స దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. తరచూ రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవటమూ తగ్గింది. సాధారణంగా కీమోథెరపీతో కాస్త జ్ఞాపకశక్తి మందగిస్తుంది (కీమోథెరపీ ఫాగ్‌). మానసిక ప్రశాంతతో ఈ సమస్య తగ్గింది. నిద్ర కూడా బాగా పట్టింది. భుజం నొప్పి వంటి సమస్యలూ త్వరగా తగ్గాయి. తిరిగి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నట్టూ బయటపడింది. మనదేశంలోనే కాదు, విదేశాల్లో నిర్వహించిన అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడయ్యాయి. చాలామంది ఆసనాలు వేయటమే యోగా అనుకుంటారు. కానీ ధ్యానం కూడా ముఖ్యమే. ఏదేమైనా వీటి ఉద్దేశం మనసును నియంత్రించటం. శారీరకంగా చురుకుగా ఉంటే మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుంది.


జీఎన్‌ఎం సిద్ధాంతం

జర్మనీ వైద్యుడు రైక్‌ గీర్డ్‌ హ్యామర్‌ 80ల్లో జర్మన్‌ న్యూ మెడిసిన్‌ (జీఎన్‌ఎం) అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది క్యాన్సర్‌, భావోద్వేగ ఒత్తిడి మధ్య సంబంధాన్ని ప్రత్యేకంగా నొక్కి చెబుతుండటం విశేషం. వ్యక్తి మనసు, మెదడు, అవయవాలు.. అన్నీ కూడా ఒకదాంతో మరోటి సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయన్నది హ్యామర్‌ భావన. క్యాన్సర్‌తో అన్నిరకాల జబ్బులూ ఎంతో కొంత తీవ్ర మానసిక సంఘర్షణలతో ముడిపడి ఉంటున్నాయని, వాటిని తొలగించుకుంటే జబ్బులూ తగ్గిపోతాయన్నది ఆయన సిద్ధాంతం. ఒక ప్రమాదంలో కొడుకు చనిపోయిన కొన్ని నెలల తర్వాత హ్యామర్‌కు వృషణాల క్యాన్సర్‌ వచ్చింది. అంతకుముందు ఆయనకు ఎన్నడూ తీవ్రమైన జబ్బులేవీ రాలేదు. దీంతో కొడుకు పోయిన బాధకూ క్యాన్సర్‌కూ నేరుగా సంబంధం ఉండొచ్చని అనుమానం వచ్చింది. దీన్ని నివృత్తి చేసుకోవటానికి పరిశోధనలో మునిగిపోయారు. చివరికి క్యాన్సర్లకూ భావోద్వేగాలకూ సంబంధం ఉంటున్నట్టు గుర్తించారు. క్యాన్సర్‌ బారినపడ్డవారి మెదడు ఎక్స్‌రేలో కొన్ని చోట్ల ‘నల్లటి మచ్చ’లాంటిది ఏర్పడుతున్నట్టు, ఇవి ఆయా భావోద్వేగాలతో ముడిపడి ఉంటున్నట్టు ఆయన గుర్తించారు. వేర్వేరు రకాల భావోద్వేగాలు వేర్వేరు రకాల క్యాన్సర్లకు దారితీస్తున్నాయనీ కనుగొన్నారు. ఉదాహరణకు- ఆత్మన్యూనత, తమను తాము నిందించుకోవటంతో ఎముక క్యాన్సర్‌.. మరణ భయంతో ఊపిరితిత్తి క్యాన్సర్‌ వస్తున్నట్టు గుర్తించారు. ఆయా భావోద్వేగాలను తగ్గించుకుంటే వెంటనే క్యాన్సర్‌ కణాల వృద్ధి కూడా నెమ్మదిస్తున్నట్టు, మెదడులోని ‘నల్లమచ్చ’ తగ్గటమూ మొదలైనట్టు గుర్తించారు. దీని ఆధారంగా మానసిక కౌన్సెలింగ్‌తో తాను క్యాన్సర్‌ నుంచి కోలుకోవటమే కాదు.. ఎంతోమందిని దాన్నుంచి బయటపడేశారు.


మనో నిబ్బరంగా..

ఒకే గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిలోనూ మానసికంగా బలంగా ఉండి, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగుల అండ, ప్రోత్సాహం లభించినవారు త్వరగా కోలుకోవటం గమనిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం మనో నిబ్బరం, మానసిక ప్రశాంతతే. వైద్యపరంగా జబ్బు తగ్గుతుందో, లేదోననే సందేహం ఉన్నవారిలోనూ కొందరు తమకు జబ్బు తగ్గుతుందనే విశ్వాసం కలిగుంటారు. ‘మీరు వైద్యం చేయండి, జబ్బు అదే తగ్గుతుంది’ అనీ వైద్యులకు భరోసా ఇస్తుంటారు. మరికొందరు చికిత్స సాధ్యమయ్యే క్యాన్సర్‌ విషయంలోనూ తగ్గదనే భావిస్తుంటారు. వీరికి సరైన చికిత్స చేసినా జబ్బు తగ్గదు. జబ్బు అదే తగ్గుతుందని నమ్మేవారు ఒత్తిడికి గురవ్వరు, ధైర్యంగా ఉంటారు. వీరికి చికిత్సలు బాగా పనిచేస్తాయి. ఇలాంటి ధోరణి గలవారి ఒంట్లో సానుకూల హార్మోన్ల వాతావరణం, రోగనిరోధకశక్తి బలంగా ఉండటమే దీనికి కారణం. మానసిక ప్రశాంతతో ఎవరికివారే దీన్ని సాధించుకోవచ్చు.


యోగా ఒక్కటే కాదు

* యోగా, ధ్యానంతోనే కాదు.. శారీరక శ్రమ, వ్యాయామాలతోనూ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆటలు కూడా మంచివే. వీటితో ఒత్తిడి హార్మోన్ల మోతాదులు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. హుషారు ఇనుమడిస్తుంది. ఇవన్నీ క్యాన్సర్‌ నివారణకు తోడ్పడేవే. ఒకవేళ క్యాన్సర్‌ బారినపడ్డా త్వరగా కోలుకోవటానికి వీలు కల్పిస్తాయి.

* మర్దనతోనూ ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు, ఆందోళన తగ్గుముఖం పడుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. లింఫు ద్రవం శరీరంతటికీ ప్రసరించేలా చేస్తుంది. ఇది హార్మోన్లు సమతులంగా ఉండటానికి తోడ్పడుతుంది. రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. వికారం, నొప్పి, కుంగుబాటు, నిస్సత్తువ వంటి క్యాన్సర్‌ లక్షణాలు తగ్గేలా చేస్తుంది. మర్దన మూలంగా క్యాన్సర్‌ కణాలను చంపే సహజ హంతక కణాలు, లింఫోసైట్ల సంఖ్య పెరుగుతున్నట్టూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని