పసి నోటికి.. ఏంటీ బాధ?

పిల్లల మనసే కాదు.. శరీరమూ సున్నితమే. కల్లాకపటం లేని వారి ముఖంపై నవ్వులు విరబూస్తుంటే.. నోటి వెంట ముద్దుముద్దు మాటలు రాలుతుంటే పెద్దవాళ్ల మనసు ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. అదే వారికి ఏదైనా ఇబ్బంది వస్తే.....

Updated : 30 Dec 2022 09:50 IST

పిల్లల మనసే కాదు.. శరీరమూ సున్నితమే. కల్లాకపటం లేని వారి ముఖంపై నవ్వులు విరబూస్తుంటే.. నోటి వెంట ముద్దుముద్దు మాటలు రాలుతుంటే పెద్దవాళ్ల మనసు ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. అదే వారికి ఏదైనా ఇబ్బంది వస్తే.. ముఖ్యంగా మాట్లాడటానికీ, తినటానికీ తోడ్పడే నోటికి ఏదైనా సమస్య తలెత్తితే ఆందోళనతో విలవిలలాడిపోతుంది. ‘నోట్లో నాలుక లేని’ అమాయకులే కావొచ్చు గానీ పిల్లలకూ నోటి సమస్యలు రావొచ్చు. మామూలు నోటిపూత దగ్గర్నుంచి నాలుక అతుక్కుపోవటం, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ వరకూ రకరకాల ఇబ్బందులు తలెత్తొచ్చు. వీటి మూలంగా సరిగా మాట్లాడలేకపోవచ్చు. తిండి తినక పోషణ లోపం బారిన పడొచ్చు. నోటి శుభ్రత దెబ్బతినొచ్చు. కొన్ని సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మున్ముందూ వెంటాడొచ్చు. కాబట్టి వీటిపై అవగాహన కలిగుండటం, అపోహలకు తావివ్వకుండా చూసుకోవటం ఎంతో అవసరం. అందుకే పిల్లల నోటి సమస్యలపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ.

పిల్లలు గట్టిగా ఏడ్చినా, అరిచినా ‘వాడి నోరు పెద్దది’ అని సరదాగా ఆట పట్టిస్తుంటాం గానీ కేవలం మాట్లాడటానికే కాదు. రకరకాల రుచులను ఆస్వాదించటానికీ నోరే కీలకం. తిన్న ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ మొదలయ్యేది కూడా ఇక్కడ్నుంచే. మనం నమిలిన ముద్ద నోట్లో వూరే లాలాజలంతో కలిసి మృదువుగా మారటం మూలంగానే తేలికగా మింగటం సాధ్యమవుతోంది. రకరకాల రుచులను తెలిపే నాలుక, నోటిని పొడిబారకుండా చూసే లాలాజల గ్రంథులు, ఆహారం నమలటానికి తోడ్పడే పళ్లు, రోగనిరోధకవ్యవస్థకు రక్షక భటులుగా నిలిచే టాన్సిల్స్‌ వంటి కీలకమైన భాగాలన్నింటికీ నోరే ఆలవాలం. పెదవులు, బుగ్గలు, అంగిలి వంటి నోటి కుహరంలోని భాగాలన్నింటినీ ప్రత్యేకమైన, సున్నితమైన జిగురుపొర నిరంతరం కాపాడుతుంటుంది. వీటిల్లో ఎక్కడ సమస్య తలెత్తినా ఇబ్బందే. నొప్పి, మంట వంటి వాటికి పెద్దవాళ్లు కాస్త ఓర్చుకోగలరేమో గానీ పిల్లలు బాధతో అల్లాడిపోతారు. వీటిని సకాలంలో గుర్తించి, సత్వరం చికిత్స చేయించటం చాలా కీలకం.

నోట్లో తిత్తి 

తొమ్మిదేళ్ల నిధికి కింది పెదవి మీద చిన్న బుడిపె తలెత్తింది. అది క్రమంగా పెరుగుతూ బఠానీ గింజంత అయ్యింది. నొప్పేమీ లేదు గానీ చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తోంది. ఏమిటిది? ఎందుకు పెరుగుతోంది? ఇది మరీ పెద్దగా అవుతుందా? అని తల్లిదండ్రులకు కంగారు మొదలైంది.

ది లాలాజల నాళాలు మూసుకుపోవటం వల్ల తలెత్తే సమస్య. దీన్నే ‘మ్యూకస్‌ రిటెన్షన్‌ సిస్ట్‌’ అంటారు. మన నోట్లో సుమారు 800-1000 చిన్న లాలాజల గ్రంథులుంటాయి. వీటి నుంచి వెలువడే లాలాజలం వాటి నాళాల ద్వారా నోట్లోకి వస్తుంటుంది. దెబ్బలు తగలటం, పెదవులు కొరుక్కోవటం వంటి వాటి మూలంగా కొందరిలో ఈ నాళాలు మూసుకుపోతుంటాయి. దీంతో నాళాల్లోంచి బయటకు రావాల్సిన జిగురుద్రవం పోగుపడి.. నెమ్మదిగా తిత్తిలా ఏర్పడుతుంది. తరచుగా పెదవులు కొరుక్కునే పిల్లల్లో ఇలాంటివి ఎక్కువ. ఇవి కింది పెదవి లోపల తరచుగా కనబడుతుంటాయి. బుగ్గల లోపల, నాలుక కింద కూడా ఏర్పడొచ్చు. కొందరిలో పై జ్ఞానదంతం పొడుచుకొని వచ్చే సమయంలోనూ చుట్టుపక్కల ఇలాంటి తిత్తులు ఏర్పడొచ్చు. ఇవి సుమారు 2-5 సెంటీమీటర్ల వరకూ పెరుగుతాయి. కొద్దిరోజులకు పగిలిపోయి మళ్లీ ఏర్పడుతుంటాయి. వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదు గానీ కొందరిని నొప్పితో వేధిస్తుంటాయి. వీటిని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. అవసరమైతే మళ్లీ మళ్లీ ఏర్పడకుండా పక్కనున్న లాలాజల గ్రంథిని కూడా తొలగించాల్సి ఉంటుంది.
* కొందరికి లాలాజల నాళం పగిలిపోయి వాటి నుంచి వెలువడిన స్రావాలు గూడుకట్టి నాలుక కింద పెద్ద తిత్తిలా ఏర్పడుతుంటాయి. వీటినే రాన్యులా అంటారు. తిత్తి పెద్దగా ఉండటం వల్ల నాలుక ఒక వైపు నుంచి పైకి లేచినట్టూ కనబడుతుంది. ఫలితంగా ముద్ద మింగటంలో, మాట్లాడటంలో ఇబ్బంది పడతారు. వీటిల్లో కొన్ని తిత్తులు నోటి వరకే పరిమితమైతే (ఓరల్‌ రాన్యులా).. మరికొన్ని మెడదాకా విస్తరిస్తుంటాయి (ప్లంజింగ్‌ రాన్యులా). తిత్తి చిన్నగా ఉండి, పెరగకపోతుంటే, లక్షణాలేవీ లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ ముద్ద మింగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటే తిత్తి పైభాగాన్ని కొంతవరకు తొలగించాల్సి (మార్సుపలైజేషన్‌) ఉంటుంది. దీంతో తిత్తిలోని ద్రవం నోటిలోకి వచ్చేస్తుంది. ఇక మెడవరకూ విస్తరించిన తిత్తిని ఆపరేషన్‌ ద్వారా పూర్తిగా తొలగించాలి. దాని పక్కనున్న లాలాజల గ్రంథిని కూడా తీసేయాల్సి ఉంటుంది.

నాలుక చీరుకుపోయినప్పుడు.. గాయం 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువుంటే.. లోపలి కండరాలు పైకి కనబడుతుంటే.. నాలుక పక్కభాగాలు తెగిపోతే.. పక్కభాగాలు కలిసి ఉండి, మధ్యలో కిందా పైనా రెండువైపులా చీరుకుపోతే.. యు ఆకారంలో గాయాలైతే.. నాలుక కొనభాగం తెగి వేలాడుతుంటే.. గాయం మూలంగా విపరీతమైన రక్తస్రావం అవుతుంటే.. తప్పకుండా కుట్లు వేయాలి.

నాలుక చీరుకుపోవటం  

వణ్‌కు మూడేళ్లు. చాలా అల్లరివాడు. ఒకరోజు ఇంట్లో కింద పడిపోవటంతో నోటి నిండా రక్తం చిమ్ముకొచ్చింది. తల్లి శుభ్రం చేసి చూస్తే నాలుక చీరుకుపోయి కనిపించింది. నాలుకకు కుట్లు వేయించొద్దని, కుట్లు వేస్తే మాటలు రావని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే వెంటనే కుట్లు వేయాలని చెప్పారు. వీటిల్లో ఏది నిజం?

శ్రవణ్‌ ఒక్కడే కాదు. కింద పడిపోయి నాలుకకు దెబ్బలు తగిలించుకునే పిల్లలు ఎందరో. బ్లేడ్ల వంటి పదునైన వస్తువులను నోట్లో పెట్టుకోవటం, ప్రమాదాలు, ఏదైనా బలంగా గుద్దుకోవటం, ఫిట్స్‌తో కింద పడటం వంటివన్నీ నాలుక గాయాలకు దారితీస్తాయి. సాధారణంగా పిల్లలు నోరు తెరచుకొని ఆడుకుంటుంటారు. దీంతో కింద పడ్డప్పుడు పళ్ల మధ్య నాలుక నలిగిపోతుంటుంది. ఫిట్స్‌ మూలంగా కింద పడ్డప్పుడు నాలుక లోతుగా చీరుకుపోవచ్చు కూడా. సాధారణంగా నాలుకకు చాలా ఎక్కువగా రక్త ప్రసరణ జరుగుతుంది. అందువల్ల చిన్న గాయమైనా రక్తం ధారాళంగా వస్తుంటుంది. కొన్నిసార్లు ఇది నోటి నిండా నిండుకుపోయి శ్వాస ద్వారా వూపిరితిత్తుల్లోకీ వెళ్లిపోవచ్చు. నాలుక ఆకారం దెబ్బతినటం, కదలికలు అస్తవ్యస్తం కావటం, ఇన్‌ఫెక్షన్‌, వాపు వంటివీ తలెత్తొచ్చు. అందువల్ల ఇలాంటి గాయాలకు వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. ముందుగా గాయాన్ని పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. లోపల పంటి ముక్కల వంటివేమైనా చిక్కుకున్నాయేమో చూసి, అలాంటివి ఉంటే తొలగించాలి. పైపైన చీరుకుపోయిన గాయాలు మందులు వేసుకుంటే నయమవుతాయి. వీటికి కుట్లు వేయాల్సిన అవసరమేమీ లేదు. కానీ నాలుక లోతుగా తెగిపోతే.. తీవ్రతను బట్టి జాగ్రత్తగా కుట్లు వేయాల్సి ఉంటుంది. దీంతో రక్తస్రావం చాలావరకు ఆగిపోతుంది. నాలుక కదలికలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. గాయం కూడా త్వరగా మానిపోతుంది. కుట్లు వేస్తే మాటలు రావని అనుకోవటం నిజం కాదు. లోతుగా చీరుకున్నప్పుడు కుట్లు వేయకపోతే రక్తస్రావం ఎక్కువ కావటం, ఇన్‌ఫెక్షన్‌, నాలుక మధ్యలో ఖాళీ ఏర్పడటం వంటి ముప్పులు తలెత్తుతాయి. గాయం 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటే.. నాలుక లోపలి కండరాలు పైకి కనబడుతుంటే.. నాలుక పక్కభాగాలు తెగిపోతే.. పక్కభాగాలు కలిసి ఉండి, మధ్యలో కిందా పైనా రెండువైపులా చీరుకుపోతే.. యు ఆకారంలో గాయాలైతే.. నాలుక కొనభాగం తెగి వేలాడుతుంటే.. గాయం మూలంగా విపరీతమైన రక్తస్రావం అవుతుంటే.. తప్పకుండా కుట్లు వేయాలి. కొందరికి నాలుక తెగిపోయి ముక్క ఎక్కడో పడిపోతుంటుంది. ఇలాంటివారికి 30% లోపు నాలుక కోల్పోతే చివర్లను కలిపి కుట్లు వేయాల్సి ఉంటుంది. అదే 30% కన్నా ఎక్కువ కోల్పోతే నిపుణులతో మరమ్మతు చేయించాల్సి ఉంటుంది. మామూలుగానైతే నాలుక గాయాలు తగ్గటానికి 3-4 వారాలు పడుతుంది. పది రోజుల్లోగా వాపు సైతం తగ్గుతుంది.

నాలుక కింద బుడిపె 

సిమ్రాన్‌కు ఆరేళ్లు. కొంతకాలం నుంచీ ఆమె నాలుక బయటకు చాచుకొని వస్తున్నట్టు తల్లి గమనించింది. నాలుక కింద తెల్లటి తిత్తి ఉండటం.. చూస్తుండగానే దాని ఉబ్బు మెడ వరకూ వ్యాపించటంతో కలవర పడిపోయింది.

దీన్ని డెర్మాయిడ్‌ సిస్ట్‌ అంటారు. ఇది పుట్టుకతోనే తలెత్తే సమస్య. పిండం ఎదుగుతున్న దశలో ఆయా భాగాల్లోని చర్మం పైపొర కణాలు ఒకదగ్గర చిక్కుకొని పోవటం దీనికి మూలం. ఇలాంటి తిత్తులు ఒంట్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు. సుమారు 7% తిత్తులు నోటి అడుగున తలెత్తుతుంటాయి. చాలా నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి కాబట్టి పెద్దగా అయ్యేంతవరకూ స్పష్టంగా కనబడవు. తిత్తి పెద్దగా అవుతున్నకొద్దీ నాలుక పైకి లేస్తూ వస్తుంది. తిత్తి లోపలి వైపునకు పెరుగుతుంటే గవద కిందికి జారినట్టుగా కనబడుతుంది. తిత్తి ఉన్నా చాలావరకు ఎలాంటి నొప్పీ ఉండదు. కానీ తిత్తి ఏర్పడిన చోటు, సైజును బట్టి నొప్పి, ఇన్‌ఫెక్షన్‌ వంటివి వేధిస్తాయి. అరుదుగా కొందరిలో ఇది క్యాన్సర్‌గానూ పరిణమించొచ్చు. ఈ తిత్తులను శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిందే. గవద వైపు తిత్తి పెరిగితే బయటి నుంచి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది.

నాలుక అతుక్కోవటం

రిష 9 నెలల పాపాయి. ఉగ్గు తినిపిస్తుంటే నాలుక బయటకు చాచటం లేదు. నవ్వినపుడు, ఏడ్చినపుడు నాలుక చివర్లో కింది భాగాన రబ్బరుబ్యాండు లాగా మందంగా ఏదో పట్టుకొని ఉన్నట్టు కనిపిస్తోంది. తనకు కూడా ఇలాగే ఉండేదని, ఇది మన కుటుంబంలో కనబడేదేనని త్రిష తాతయ్య అంటుండేవాడు. ఆయన ఉచ్చారణ సరిగా ఉండదు. కొన్ని పదాలనూ కష్టంగా పలుకుతుంటాడు. త్రిష కూడా ఆయనలాగే అవుతుందా? అని తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే పాప నాలుక చివర్లోని కింది పొర నోటి అడుగుకు అతుక్కుపోయిందని (టంగ్‌ టై) చెప్పారు.

ది పుట్టుకతో వచ్చే సమస్య. దీన్నే ఆంకిలోగ్లోసియా అనీ అంటారు. ఇందులో నాలుక చివర్లో కింది భాగంలో ఉండే సన్నటి పొర నోటి అడుగు భాగానికి అంటుకొని ఉంటుంది. దీంతో నాలుక సరిగా కదలదు. సాధారణంగా పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఈ పొర నాలుక చివర నుంచి క్రమంగా వెనక్కు తగ్గుతూ పోతుంది. ఒకవేళ ఈ పొర మందంగా ఉండి, అలాగే అతుకొన్ని ఉంటే నాలుక సరిగా కదలదు. సుమారు 4-11% మంది పిల్లలు ఈ సమస్యతో పుడుతుంటారు. కొందరిలో ఇది వంశపారంపర్యంగానూ వస్తుంటుంది. అమ్మాయిల కన్నా అబ్బాయిల్లోనే ఎక్కువ. టంగ్‌ టై మూలంగా పిల్లలు పాలు సరిగా తాగలేరు. దీంతో తల్లిపాలు పట్టటానికి ఎక్కువ సమయం పడుతుంది. పిల్లలు ఎప్పుడూ ఆకలితో ఉన్నట్టు కనిపిస్తారు. సరిగా బరువు పెరగరు. పిల్లలు తల్లిపాలు తాగే సమయంలో చనుమొనకు పిల్లల కింది దవడకు మధ్య నాలుక అడ్డుగా ఉంటుంది. అయితే పిల్లల నాలుక సరిగా ముందుకు రాకపోతే చనుమొనకు పంటి గాట్లు పడే అవకాశముంది. ఇది రొమ్ముల ఇన్‌ఫెక్షన్‌కూ దారితీయొచ్చు. సాధారణంగా నాలుక అంచు త్రికోణాకారంలో ఉంటుంది. అయితే కింది పొర లాగుతుండటం వల్ల అంచు మధ్యలో వెనక్కి లాగినట్టుగా అయ్యి నాలుక చివర గుండె ఆకారంలో కనబడుతుంది. నాలుకను పై పళ్లకు తాకించటం, పక్కలకు కదలించటం, నాలుకను ముందుకు చాచి కింది పళ్లకు తాకించటమూ కష్టమవుతుంది. దీంతో మాటలు సరిగా రాకపోవటమే కాదు.. కొన్ని అక్షరాలనూ సరిగా పలకలేరు. ఈ పొర పలుచగా ఉంటే కత్తిరించటం (ఫ్రెనోటమీ).. మందంగా ఉంటే కత్తిరించి, సరిచేయటం (ఫ్రెనులోప్లాస్టీ) చేస్తారు. పిల్లలకు 9-12 నెలల వయసులోపు పొరను కత్తిరించటం మేలు. చాలామంది పొరను కత్తిరించొద్దని భావిస్తుంటారు. నిజానికి ఏడాది వయసు వరకూ సమస్య అలాగే ఉండిపోతే తప్పకుండా కత్తిరించాలి. లేకపోతే ఉచ్చారణ దెబ్బతినటం, నోరు సరిగా శుభ్రం చేసుకోలేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నాలుక మీద పొక్కులు

తొమ్మిదేళ్ల రమేశ్‌కు పుట్టినప్పట్నుంచీ క్రమంగా నాలుక మందంగా అవుతూ వస్తోంది. నాలుక మీద లేత గులాబీ రంగులో చిన్న చిన్న పొక్కులు కూడా కనబడుతున్నాయి. కాస్త కారం తగిలినా చుర్రుమంటుంది. దీంతో తిండి తినటమూ తగ్గిపోయింది.

మేశ్‌ను వేధిస్తున్న సమస్య లింఫాంజియోమా. పుట్టుకతోనే లింఫ్‌ వ్యవస్థలో తలెత్తే లోపాలు దీనికి కారణం. ఈ పొక్కులు కొందరిలో కొంత భాగానికే పరిమితమైతే.. మరికొందరిలో నాలుక మొత్తం కనబడొచ్చు. పెదవులు, బుగ్గల లోపల.. నోటి అడుగున, అంగిలి మీద కూడా ఇవి ఏర్పడొచ్చు. పైపై పొక్కులు లేత గులాబీ, పసుపుపచ్చ రంగులో కనబడుతుంటాయి. లోతుకు చొచ్చుకొని పోయే పొక్కులతో నాలుక మందంగానూ అవుతుంది. దీంతో సరిగా మాట్లాడలేరు. తినటానికీ ఇబ్బంది పడతారు. ఈ పొక్కులు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తే ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కొద్దిభాగంలోనే ఉన్న పొక్కులను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించొచ్చు. అక్కడక్కడా వ్యాపిస్తే లోపలికి ఇంజెక్షన్‌ ఇవ్వటం, ఎలక్ట్రోకోయాగ్యులేషన్‌, లేజర్‌ వంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

తీవ్ర నోటి ఇన్‌ఫెక్షన్‌

సౌమ్యకు రెండేళ్లు. ఒకరోజు ఉన్నట్టుండి నోట్లో వాపు, ఎరుపు మొదలైంది. తర్వాత నొప్పి, జ్వరం కూడా పట్టుకున్నాయి. వాపు వేగంగా పెరుగుతూ నోటి అడుగు భాగం మొత్తం వ్యాపించింది. శ్వాస తీసుకోవటమూ కష్టమైంది. ఆసుపత్రికి తీసుకెళ్తే వెంటనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. ఇంతకీ ఏమిటీ సమస్య?

దీని పేరు లుడ్విగ్స్‌ యాంజైనా. నోటి అడుగున తలెత్తే ఇది చాలా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌. త్వరగా నోరంతా వ్యాపిస్తుంది. చిగుళ్ల్ల ఇన్‌ఫెక్షన్‌, దెబ్బ తగలటం, మెడలో లింఫ్‌ గ్రంథుల ఇన్‌ఫెక్షన్‌ వంటివి వచ్చాక మొదలవుతుంటుంది. దీనికి చికిత్స చేయకపోతే శ్వాస తీసుకోవటమూ కష్టమై బిడ్డ ప్రాణాల మీదికీ రావొచ్చు. అందువల్ల ఆసుపత్రిలో చేర్చి నోరు లేదా ముక్కు ద్వారా గొట్టాన్ని లోపలికి పంపించి శ్వాస సరిగా ఆడేలా చూడాల్సి ఉంటుంది. అవసరమైతే మెడ దగ్గర్నుంచి శ్వాసమార్గం లోపలికి చిన్న రంధ్రం చేయాల్సి రావొచ్చు.
* పెదవి అంచున దద్దు: కొందరికి పెదవుల చివర్లో తరచుగా పగుళ్లు, పుండ్లు పడుతుంటాయి. దీన్నే యాంగ్యులర్‌ చిలైటిస్‌ అంటారు. నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, పోషణ లోపం, రోగనిరోధకశక్తి బలహీనపడటం వంటివి దీనికి దోహదం చేస్తాయి. ఐరన్‌, బీ కాంప్లెక్స్‌ మాత్రలు, యాంటీబయోటిక్‌ మలాములతో ఇది చాలావరకు కుదురుకుంటుంది.

నోటి పూత

నికిత తరచుగా నోట్లో పుండ్లు, పొక్కులతో బాధపడుతుంటుంది. వీటి మూలంగా తీవ్రమైన నొప్పితో తిండి కూడా సరిగా తినదు. బరువు కూడా సరిగా పెరగటం లేదు.

ది తరచుగా చూసే సమస్యే. నోటి పూత, నంజు పొక్కులు.. ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునే దీన్ని ‘ఆఫ్తస్‌ స్టొమటైటిస్‌’ అంటారు. తీవ్రమైన నొప్పి, మంటతో వేధించే ఇవి కొందరిలో మాటిమాటికీ వస్తూ పోతుంటాయి. నోటి పూత ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. టి కణాలతో ముడిపడిన రోగనిరోధక వ్యవస్థకూ నోట్లోని సున్నితమైన జిగురు పొరలు దెబ్బతినటానికీ బలమైన సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కొందరు ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. గ్లిజరిన్‌ వంటి మలాములు, నోట్లో రాసుకోవటానికి వీలైన నొప్పి మలాములు, చర్మం మొద్దుబారేలా చేసే మలాములతో నొప్పి చాలావరకు తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని