పేగు బ్యాక్టీరియాకు కొవిడ్‌ దెబ్బ

మన పేగుల్లో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ వంటి రకరకాల సూక్ష్మక్రిములు నివసిస్తుంటాయి. ఇవన్నీ సమతులంగా కొనసాగుతూ చాలా మేలు చేస్తుంటాయి.

Updated : 28 Feb 2023 00:58 IST

న పేగుల్లో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ వంటి రకరకాల సూక్ష్మక్రిములు నివసిస్తుంటాయి. ఇవన్నీ సమతులంగా కొనసాగుతూ చాలా మేలు చేస్తుంటాయి. అయితే కొవిడ్‌-19 మూలంగా పేగుల్లో సూక్ష్మక్రిముల మధ్య సమతుల్యత దెబ్బతింటున్నట్టు న్యూయార్క్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో బయటపడింది. ఇది రక్తంలోకి హానికారక బ్యాక్టీరియా చేరుకునేలా చేసి తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కూ దారితీస్తున్నట్టు వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా ఎలుకలకు సార్స్‌-కొవీ 2 వైరస్‌ సోకేలా చేసి, పేగుల్లోని బ్యాక్టీరియాను పరిశీలించారు. వీటిల్లో తేడాలు తలెత్తినట్టు, సూక్ష్మక్రిముల సంఖ్య కూడా తగ్గినట్టు గుర్తించారు. అనంతరం కొవిడ్‌-19 బారినపడ్డవారి మలం నమూనాలను పరిశీలించారు. ప్రతి నలుగురిలో ఒకరిలో ఒకేరకం బ్యాక్టీరియా పెద్దమొత్తంలో ఉంటున్నట్టు తేల్చారు. వీటిల్లో కొంత బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌ మందులను తట్టుకునే సామర్థ్యాన్నీ సంతరించుకోవటం గమనార్హం. రక్తంలోకి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిన వారి పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యం తక్కువగా ఉండటమే కాదు.. రక్తంలో ఉన్న బ్యాక్టీరియా పేగుల్లోనూ కనిపించింది. కొవిడ్‌-19 పేగు బ్యాక్టీరియాను అస్తవ్యస్తం చేస్తున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇదే పేగుల్లో హానికర బ్యాక్టీరియా మనుగడకు వీలు కల్పిస్తోంది. పేగు గోడ పొరను దెబ్బతీసి, బ్యాక్టీరియా తేలికగా రక్తంలోకి వ్యాపించేలా చేస్తోంది కూడా. కొవిడ్‌-19 బారినపడ్డవారిలో రక్త ఇన్‌ఫెక్షన్‌ ముప్పు గలవారిని గుర్తించటానికి ఈ  అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు