యాంటీబయాటిక్స్‌తో పేగుపూత ముప్పు!

యాంటీబయాటిక్‌ మందులు తరచూ వాడుతున్నారా? అదీ 40 ఏళ్లు పైబడ్డాక అతిగా వేసుకుంటున్నారా? అయితే పేగు పూత (ఐబీడీ) ముప్పు పెరుగు తుందని తెలుసుకోండి.

Published : 17 Jan 2023 00:16 IST

యాంటీబయాటిక్‌ మందులు తరచూ వాడుతున్నారా? అదీ 40 ఏళ్లు పైబడ్డాక అతిగా వేసుకుంటున్నారా? అయితే పేగు పూత (ఐబీడీ) ముప్పు పెరుగు తుందని తెలుసుకోండి. ముఖ్యంగా పేగు ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి యాంటీ బయాటిక్‌ మందులను వాడిన ఒకట్రెండు సంవత్సరాల తర్వాత దీని ముప్పు ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది మరి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఐబీడీతో బాధపడుతున్నారని అంచనా. వచ్చే దశాబ్దంలో వీరి సంఖ్య మరింత పెరుగుతుందనీ భావిస్తున్నారు. ఐబీడీలో క్రోన్స్‌ డిసీజ్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ అని రెండు సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో పర్యావరణ అంశాలు పాలు పంచుకుంటున్నట్టు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులో ఐబీడీ రావటంలో యాంటీబయాటిక్‌ మందులూ ఒక కారణమే. అయితే ఇది పెద్దవయసు వారికీ వర్తిస్తుందా అన్నది స్పష్టంగా తెలియదు. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌ పరిశోధకులు యాంటీబయాటిక్‌ మందుల ప్రభావంపై అధ్యయనం చేశారు. వీటిని వాడినవారికి ఐబీడీ తలెత్తే అవకాశం ఎక్కువైనట్టు.. 40 ఏళ్లు పైబడివారిలో దీని ముప్పు ఇంకాస్త అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. పేగు ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి ఇచ్చే నైట్రోఇమిడజోల్స్‌, ఫ్లూరోక్వినలోన్స్‌ రకం మందులతో ఎక్కువ ముప్పు పొంచి ఉంటున్నట్టూ తేలింది. ఇవి హానికారక బ్యాక్టీరియానే కాదు, మేలు చేసే బ్యాక్టీరియానూ చంపేస్తాయి. ఇదే అనంతరం జబ్బులకు కారణమవుతోందని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని