Overweight: అధిక బరువుతో ఆడవారికి పక్షవాతం ముప్పు

అధిక బరువు, ఊబకాయం ఆరోగ్యం మీద రకరకాలుగా ప్రభావం చూపుతాయి. ఇవి పక్షవాతానికీ దారితీస్తాయి. వీటి మధ్య సంబంధం గురించి మరో కొత్త సంగతి బయటపడింది.

Published : 18 Jun 2024 00:06 IST

అధిక బరువు, ఊబకాయం ఆరోగ్యం మీద రకరకాలుగా ప్రభావం చూపుతాయి. ఇవి పక్షవాతానికీ దారితీస్తాయి. వీటి మధ్య సంబంధం గురించి మరో కొత్త సంగతి బయటపడింది. యుక్తవయసులో, సంతానం కనే వయసులో అధిక బరువు, ఊబకాయం గల ఆడవారికి మధ్యవయసులో పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు అమెరికన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ పత్రికలో ప్రచురితమైన శాస్త్రీయ అధ్యయనం పేర్కొంది. మెదడు రక్తనాళాల్లో అడ్డంకి తలెత్తటం వల్ల సంభవించే పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుండటం గమనార్హం. పక్షవాతం బారినపడుతున్న వారిలో సుమారు 87% మందిలో ఇలాంటి రకమే కనిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సంస్థ నిర్వహించిన తాజా అధ్యయన ఫలితాలు మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తున్నాయి.

అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన అమెరిన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ చేపట్టిన ఈ అధ్యయనాన్ని ఫిన్‌లాండ్‌లో నిర్వహించారు. మొత్తం 50 ఏళ్ల ఆరోగ్య సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. 14 ఏళ్ల వయసులో అధిక బరువు గల మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు తేలింది. వీళ్లు 31 ఏళ్ల వయసులో బరువు తగ్గినా ఈ ప్రమాదం పొంచి ఉంటోంది. అలాగే 14 ఏళ్ల వయసులో మామూలు బరువుండి, 31 ఏళ్ల వయసులో బరువు పెరిగినా పక్షవాతం ముప్పు పెరుగుతుండటం గమనార్హం. మగవారిలో ఇలాంటి ధోరణి కనిపించలేదు గానీ 31 ఏళ్ల వయసులో అధిక బరువు గల ఆడవారితో పోలిస్తే వీరికి మెదడులో రక్తస్రావం మూలంగా సంభవించే పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది.

తాత్కాలికంగా పెరిగినా..

తాత్కాలికంగా బరువు అధికంగా పెరిగినా మున్ముందు ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఉర్సులా మికోలా చెబుతున్నారు. అందువల్ల చిన్న వయసులో అధిక బరువు, ఊబకాయం మీద డాక్టర్లు ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకర ఆహారం తినేలా.. శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని అంటున్నారు. అయితే ఊబకాయం, అధిక బరువు తగ్గించే విధానాలు పిల్లలు సిగ్గుపడేలా, తమను తాము నిందించుకునేలా ఉండకూడదని హితవు పలికారు. 

1966 నాటి సమాచారంతో

వేర్వేరు వయసుల్లో బరువు, పక్షవాతం ముప్పు మధ్య గల సంబంధాన్ని విశ్లేషించటానికి పరిశోధకులు నార్తర్న్‌ ఫిన్‌లాండ్‌ బర్త్‌ కోహార్ట్‌ 1966 అధ్యయనాన్ని ఎంచుకున్నారు. నెలలు నిండక ముందే పుట్టటం, శిశు మరణాలకు సంబంధించిన అంశాలను పరిశీలించటానికి ఈ అధ్యయనాన్ని ఆరంభించారు. అప్పట్లో 12వేలకు పైగా గర్భిణులు ఇందులో నమోదు చేసుకున్నారు. వీరికి పుట్టిన 10వేలకు పైగా మందికి ఇప్పుడు 50 ఏళ్లు దాటాయి. చిన్నప్పటి నుంచీ వీరి ఆరోగ్య వివరాలను పరిశోధకులు చాలా అధ్యయనాలకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా అధ్యయనమూ నిర్వహించారు. 

ఎత్తు బరువుల నిష్పత్తితో

చిన్నప్పుడు, పెద్దయ్యాక అధిక బరువు, ఊబకాయం లేనివారితో పోలిస్తే- ఇవి ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం రావటానికి భిన్నమైన ముప్పు కారకమేదైనా ఉంటోందా అని పరిశోధకులు అధ్యయనంలో నిశితంగా విశ్లేషించారు. ఇందుకు శరీర ఎత్తు బరువు నిష్పత్తి (బీఎంఐ)ని కొలమానంగా తీసుకున్నారు. 14 ఏళ్ల వయసులో బీఎంఐని నమోదు చేసి, దాదాపు 39 ఏళ్ల పాటు.. 31 ఏళ్ల వయసులో నమోదు చేసి, 23 ఏళ్ల పాటు పరిశీలించారు. వీరిలో సుమారు ప్రతి 20 మందిలో ఒకరికి రక్తం గడ్డ కట్టటంతో సంభవించే పక్షవాతం లేదా స్వల్ప పక్షవాతం వచ్చినట్టు గుర్తించారు. 14 ఏళ్ల వయసులో ఊబకాయం గలవారికి పక్షవాతం ముప్పు 87% ఎక్కువగా ఉంటుండగా.. 31 ఏళ్ల వయసులో ఊబకాయం గలవారికి 167% ముప్పు అధికంగా ఉంటున్నట్టు బయటపడింది.

ఏంటీ సంబంధం?

అధిక రక్తపోటు, మధుమేహం, పొగ తాగే అలవాటు వంటి రకరకాల అంశాలు పక్షవాతానికి దారితీస్తుంటాయి. ఇలాంటి ముప్పు కారకాల్లో ఊబకాయం ఒకటి. ప్రతి 5 పక్షవాతం కేసుల్లో ఒకటి దీంతోనే ముడిపడి ఉంటోంది. అధిక బరువు, ఊబకాయం మూలంగా రక్తపోటు పెరుగుతుంది. అంతేకాదు.. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పూ ఎక్కువవుతుంది. ఇవన్నీ పక్షవాతం ప్రమాదాన్ని తెచ్చిపెట్టేవే. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవటం ఎప్పుడైనా మంచిదే. చాలామంది చిన్న వయసులో అధిక బరువు, ఊబకాయాన్ని పెద్దగా పట్టించుకోరు. బొద్దు ముద్దుగా భావిస్తుంటారు. ఇలాంటి ధోరణి తగదని తాజా అధ్యయనం సూచిస్తోంది.

తగ్గితే మేలు

అధిక బరువు గలవారు తమ శరీర బరువులో 7-10% తగ్గినా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగని అశాస్త్రీయ పద్ధతులతో బరువు తగ్గే ప్రయత్నం చేయొద్దు. ఆహార, వ్యాయామ నియమాలతో క్రమంగా తగ్గించుకుంటూ రావాలి.

  • ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. తాజా పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాలు ఎక్కువగా తినాలి. చక్కెర, తీపి పదార్థాలు, పానీయాలు మానెయ్యాలి. కొలెస్ట్రాల్‌ పెరిగేలా చేసే కొవ్వు, నూనె పదార్థాల విషయంలో మితం పాటించాలి. మాంసాహారులైతే మాంసానికి బదులు చికెన్, చేపలు తినటం మేలు. అదీ మితంగానే. వీటిని వేయించటం కన్నా తక్కువ నూనెతోనే వండుకోవాలి. ఉప్పూ పరిమితిని మించనీయొద్దు.
  • రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగంగా పరిగణించాలి. రోజుకు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని