వణికించే పార్కిన్సన్స్‌

వృద్ధాప్యంలోకి.. ముఖ్యంగా 60ల్లోకి అడుగు పెడుతున్నకొద్దీ చురుకుదనం తగ్గుతుంది. నడక నెమ్మదిస్తుంది. వేగంగా పక్కలకు తిరగటం కష్టమవుతుంది. కుర్చీలోంచి లేవటం వంటి తేలికైన పనులూ కష్టమవుతాయి. మాటలకు, సందర్భాలకు ప్రతిస్పందించటం ...

Published : 06 Jul 2021 14:44 IST

వృద్ధాప్యంలోకి.. ముఖ్యంగా 60ల్లోకి అడుగు పెడుతున్నకొద్దీ చురుకుదనం తగ్గుతుంది. నడక నెమ్మదిస్తుంది. వేగంగా పక్కలకు తిరగటం కష్టమవుతుంది. కుర్చీలోంచి లేవటం వంటి తేలికైన పనులూ కష్టమవుతాయి. మాటలకు, సందర్భాలకు ప్రతిస్పందించటం వంటివీ తగ్గుముఖం పడుతుంటాయి. కొన్నిసార్లు ఒకవైపు శరీర భాగాలు వణుకుతున్నట్టుగా అదురుతుండొచ్చు. ఇలాంటి లక్షణాలను చాలామంది వయసు మీద పడటం వల్ల వచ్చేవనే భావిస్తుంటారు. కానీ వీటిని నిశితంగా పరిశీలించటం మంచిది. ఇవి పార్కిన్సన్స్‌ జబ్బు తొలి లక్షణాలు కావొచ్చు. మెదడులో సబ్‌స్టాన్షియా నైగ్రా భాగంలోని కణాలు చనిపోవటం.. ఫలితంగా నాడీ కణాల మధ్య సమాచారం ఇచ్చి పుచ్చికోవటం అస్తవ్యస్తం కావటం వల్ల ఇది తలెత్తుతుంది. శరీర భాగాల కదలికలు దెబ్బతింటాయి.

ఎందుకొస్తుంది?

పార్కిన్సన్స్‌ జబ్బు ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. కానీ మెదడులో డొపమైన్, ఎపినెప్రిన్‌ వంటి రసాయనాలు తగ్గటం దీనికి దోహదం చేయొచ్చు. ఇవి నాడీ కణాల మధ్య సమాచారం ప్రసారం కావటానికి తోడ్పడతాయి. పార్కిన్సన్స్‌ బాధితుల్లో వీటి స్థాయులు తగ్గుతుంటాయి.

ముప్పు కారకాలు

ఆడవారిలో కన్నా మగవారిలో పార్కిన్సన్స్‌ జబ్బు ఎక్కువ. కానీ ఆడవారిలో జబ్బు త్వరగా ముదురుతుంది. దీని బారినపడుతున్న సుమారు 10-15% మందిలో జన్యుపరమైన కారణాలు కనిపిస్తుంటాయి. కుటుంబంలో ఎవరైనా పార్కిన్సన్స్‌ బాధితులుంటే ఇతరులకు వచ్చే అవకాశముంది. వృద్ధాప్యం మరో ముప్పు కారకం. సాధారణంగా 60 ఏళ్లు పైబడినవారికి వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలంగా పురుగుమందులు, గాలి కాలుష్యం, విషపూరిత రసాయనాల ప్రభావానికి గురికావటమూ కారణం కావొచ్చు. మెదడుకు దెబ్బలు తగలటం, మెదడుకు ఇన్‌ఫెక్షన్, పక్షవాతం వంటివీ దీనికి దారితీయొచ్చు. చాలామందిలో అసలు ఎలాంటి కారణమూ లేకపోవచ్చు.

లక్షణాలు

తల, చేతుల వంటి భాగాలు వణకటం ప్రధాన లక్షణం. విశ్రాంతిగా ఉన్నప్పుడే వణకటం దీని ప్రత్యేకత. అంటే పనులు చేస్తున్నప్పుడు అదరటం మాయమవుతుందన్నమాట. తొలిదశలో శరీరంలో ఒకవైపు భాగాల్లోనే వణుకు ఉండొచ్చు. జబ్బు ముదురుతున్నకొద్దీ రెండో వైపూ విస్తరించొచ్చు. శరీర సమన్వయం కొరవడుతుంది, నియంత్రణ తప్పుతుంది. దీంతో కింద పడిపోయే ముప్పు పెరుగుతుంది. నడక తీరు మారుతుంది. అడుగులు చిన్నగా వేస్తారు. ముందుకు వంగిపోయి నడుస్తారు. స్థిరంగా నిలబడటం, పక్కలకు తిరగటం కష్టమవుతుంది. ముఖంలో భావోద్వేగాల చిహ్నాలు కనిపించవు. చేతిరాత మారుతుంది. అక్షరాలు చిన్నగా, అల్లుకుపోయినట్టు రాస్తారు. సంతకం మారిపోవటం వల్ల బ్యాంకు పనులు, డాక్యుమెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటివన్నీ క్రమంగా మానసిక స్థితినీ దెబ్బతీస్తాయి. ఏమీ చేయలేకపోతున్నామనే నిస్పృహతో కుంగుబాటు(డిప్రెషన్‌)లోకి జారిపోవచ్చు.

నిర్ధరణ ఎలా?

పార్కిన్సన్స్‌ నిర్ధరణకు ఎలాంటి పరీక్షలు, జీవ సూచికలు లేవు. అనుభవం గల డాక్టర్లయితే చూడగానే గుర్తిస్తారు. ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, శరీర భాగాల పనితీరు వంటివి దీన్ని గుర్తించటానికి తోడ్పడతాయి. అవసరమైతే మెదడులో డొపమైన్‌ పనితీరును గుర్తించటానికి డ్యాట్, పెట్‌ స్కాన్‌ పరీక్షలు చేస్తారు. పక్షవాతం మూలంగా రక్తనాళాలు దెబ్బతిన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆర్‌ఐ చేస్తారు.

నివారించుకోవచ్చా?
పార్కిన్సన్స్‌ ఎవరికి వస్తుందో అంచనా వేయటం అసాధ్యం. కానీ కొన్ని జాగ్రత్తలతో దీని ముప్పు తగ్గేలా చూసుకోవచ్చు.
* పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా చూసుకోవటం మంచిది. ఒకవేళ వీటిని చల్లటం తప్పనిసరైతే రక్షణ దుస్తులు ధరించాలి. పని పూర్తయ్యాక వెంటనే స్నానం చేయాలి.
* పిండి వంటల వంటివి చేసినప్పుడు మిగిలిన నూనెను తిరిగి వాడకూడదు. ఇలాంటి నూనెలో ఆల్‌డిహైడ్లనే విషతుల్యాలుంటాయి.
* ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మ్‌ట్‌ ధరించాలి. కారులోనైతే సీటు బెల్టు పెట్టుకోవాలి.
* వంటకాల్లో పసుపు వాడుకోవటం మేలు. దీనిలోని కర్‌క్యుమిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
* రోజుకు 4-5 సార్లు రంగురంగుల పండ్లు, కూరగాయలు తినాలి. వీటితో యాంటీఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి.

చికిత్స ఏంటి?

ఒకసారి పార్కిన్సన్స్‌ మొదలైతే ముదురుతూ వస్తుందే తప్ప తగ్గదు. దీనికి జీవితాంతం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి వణుకు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. మందుల మోతాదులను తరచూ మార్చాల్సి రావొచ్చు. ఎందుకంటే కొంతకాలం తర్వాత వీటి ప్రభావం తగ్గుతుంది. కుంగుబాటు, నిద్రలేమి, మలబద్ధకం వంటి సమస్యలు ఇతరత్రా మందులూ వాడుకోవాల్సి ఉంటుంది. మరీ తీవ్రమైన జబ్బుకైతే మెదడులో స్టిమ్యులేటర్‌ కూడా అమర్చాల్సి రావొచ్చు.
* తరచూ వ్యాయామం చేయటం ముఖ్యం. కదలికలు, నడక సాఫీగా సాగటానికి.. వణుకు, బ్యాలెన్స్‌ నియంత్రణలో ఉండటానికివి తోడ్పడతాయి. రోజుకు రెండు సార్లయినా నిపుణులు సూచించిన వ్యాయామాలు చేయాలి. లేకపోతే శరీరం బిగువుగా తయారవుతుంది. కింద పడిపోయే, ఎముకలు విరిగిపోయే ముప్పు పెరుగుతుంది. కుంగుబాటుకు లోనవ్వకుండా సంగీతం వినటం వంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే పనులు చేస్తుండాలి.
* మందులు, వ్యాయామంతో అదుపులో ఉంచుకోకపోతే పదేళ్లలో వైకల్యం బారినపడొచ్చు. జాగ్రత్తగా లేకపోయినా, తింటున్నప్పుడు ఆహార పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లినా, ఎముకలు విరిగినా త్వరగా మరణించే ప్రమాదముందనీ గుర్తించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని