Plastic is dangerous: ప్లాస్టిక్‌ అనర్థాలు

మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాలు, పానీయాలను ప్యాక్‌ చేయటం దగ్గరి నుంచి దుస్తులు, ఆటబొమ్మలు, పరికరాల వంటి వాటి తయారీలోనూ దీన్ని వాడుతున్నారు.

Published : 09 Jul 2024 00:39 IST

మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్‌ విడదీయలేని భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాలు, పానీయాలను ప్యాక్‌ చేయటం దగ్గరి నుంచి దుస్తులు, ఆటబొమ్మలు, పరికరాల వంటి వాటి తయారీలోనూ దీన్ని వాడుతున్నారు. ప్లాస్టిక్‌ ప్యాకేజీతో వైద్య పరికరాలు, సాధనాలను సూక్ష్మక్రిముల బారినపడకుండా కాపాడుకోవటమూ తెలిసిందే. కానీ నానాటికీ ప్లాస్టిక్‌ కాలుష్యం పెరిగిపోవటమే పెద్ద సమస్య.

కొంత పునర్వియోగమవుతున్నప్పటికీ వాడి పారేసే ప్లాస్టిక్‌ చాలావరకూ చెత్తకుప్పల్లోకే చేరుతుంది. ఇవి క్రమంగా క్షీణిస్తూ చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. నదులు, కాలువల ద్వారా సముద్రంలో కలుస్తాయి. నైలాన్, పాలిస్టర్‌ వంటి ప్లాస్టిక్స్‌తో తయారయ్యే దుస్తులను ఉతికినప్పుడూ ఈ ముక్కలు నీటిలో కలుస్తాయి. నీటిలో జీవించే చేపలు, రొయ్యల వంటి జీవుల్లోనూ ఇవి కనిపిస్తున్నాయి. నువ్వుల కన్నా చిన్నగా ఉండే చిన్న (మైక్రో) ప్లాస్టిక్‌ రేణువులు ఆరోగ్యానికి హాని చేసే అవకాశముండటం ఆందోళన కలిగిస్తోంది. తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా ఇవి మన శరీరాల్లోకి ప్రవేశిస్తుంటాయి. మనుషుల రక్తం, ఊపిరితిత్తులు, పేగులు, మలంలో ఈ చిన్న ప్లాస్టిక్‌ రేణువులు ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మహిళల్లో మాయ, చనుబాలలోనూ కనిపిస్తున్నాయి. అయితే ఇవి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది మాత్రం ఇంకా కచ్చితంగా తెలియదు. దీని గురించి అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై చాలాకాలంగా దృష్టి సారించారు. గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తుల జబ్బులు తలెత్తుతున్నట్టు తేలిన నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పుకోవచ్చు.

అతి సూక్ష్మ రేణువులూ

కొందరు శాస్త్రవేత్తలు మరింత సూక్ష్మమైన (నానో) ప్లాస్టిక్‌ రేణువుల మీదా అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. కంటికి కనిపించని ఇవి ఆరోగ్యానికి మరింత హాని కలిగించగలవు. ఎందుకంటే కణాల్లోకి, అవయవాల్లోకి చేరుకోగలవు. అతి సూక్ష్మంగా ఉండటం వల్ల వీటిని గుర్తించటం, అధ్యయనం చేయటమూ కష్టమే. ఈ నేపథ్యంలో ఇటీవల మైక్రో, నానోప్లాస్టిక్స్‌ను గుర్తించే శక్తిమంతమైన ఇమేజింగ్‌ పద్ధతిని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒక లీటరు బాటిల్‌ నీటిలో సుమారు 2.5 లక్షల ప్లాస్టిక్‌ రేణువులు ఉంటున్నట్టు గుర్తించారు. గత అధ్యయనాల్లో గుర్తించినవాటికన్నా వీటి సంఖ్య 100 రెట్లు ఎక్కువ! వీటిల్లో చాలావరకూ అతిసూక్ష్మ రేణువులే.

అప్రమత్తత అవసరం

ప్లాస్టిక్‌ రేణువులు ఆరోగ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతాయన్నది కచ్చితంగా తెలియనప్పటికీ ప్లాస్టిక్‌ తయారీలో వాడే కొన్ని రసాయనాలు సమస్యలు తెచ్చిపెడతాయని మాత్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉదాహరణకు- బిస్ఫీనల్‌ ఏ (బీపీఏ), థాలేట్లకూ రకరకాల సమస్యలకూ సంబంధం ఉంటున్నట్టు బయటడింది. పిండం, శిశువులు, పిల్లల్లో మెదడు, ప్రోస్టేట్‌ గ్రంథి మీద బీపీఏ ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులకూ దారితీసే అవకాశమున్నట్టు మరికొన్ని పరిశోధనలు పేర్కొంటున్నాయి. పెద్దమొత్తంలో థాలేట్స్‌ ప్రభావానికి గురైతే వృద్ధుల్లో అకాల మరణం సంభవిస్తున్నట్టు, గుండెజబ్బుతో చనిపోయే అవకాశం పెరుగుతున్నట్టు ఒక అధ్యయనం వివరిస్తోంది. నిజానికి ప్లాస్టిక్స్‌ తయారీలో 10 వేలకు పైగా రసాయనాలు వాడుతుంటారు. వీటిల్లో కొన్నింటి మీదే అధ్యయనాలు నిర్వహించారు. అంటే ఆరోగ్యం మీద వీటి ప్రభావాల గురించి మనకు తెలిసింది గోరంతే అన్నమాట. ఈ అనర్థాల మాటెలా ఉన్నా ప్లాస్టిక్‌ వస్తువుల ప్రాధాన్యాన్ని కొట్టిపారేయలేం. ఆసుపత్రుల్లో ప్రాణాలను కాపాడటంలో ఇవి గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన మాట నిజం. మనం ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా మానకపోవచ్చు గానీ వీలైనంత వరకూ తగ్గించుకోవచ్చు. ఇందుకు తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

  • ఆఫీసులు, బడులకు వెళ్లేవారు తిరిగి వాడుకోగల బాక్సుల్లో మధ్యాహ్న భోజనం తీసుకెళ్లాలి.
  • వీలైనంతవరకూ కంచంలో అన్నం తినాలి. గ్లాసుతో నీళ్లు, పానీయాలు తాగాలి.
  • కూరగాయలు, సరుకులు కొనటానికి నూలు సంచులు, తిరిగి వాడుకోగల సంచులు పట్టుకెళ్లాలి.
  • ప్లాస్టిక్‌ సంచులు, వస్తువులను కాలువలు, నదులు, సముద్రాల్లో పారేయొద్దు. 
  • స్వచ్ఛభారత్‌ వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలో పాల్గొని, పర్యావరణ పరిశుభ్రతకు తోడ్పడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని