Liver: కాలేయం జాగ్రత్త!

గుండె, కిడ్నీ జబ్బుల గురించి బాగానే మాట్లాడుకుంటాం. ఎందుకనో కాలేయ జబ్బు మీదే అంతగా దృష్టి పెట్టం. గుండెపోటు మాదిరిగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాల మీదికి రాకపోవచ్చు.

Updated : 18 Apr 2023 10:08 IST

రేపు వరల్డ్‌ లివర్‌ డే

గుండె, కిడ్నీ జబ్బుల గురించి బాగానే మాట్లాడుకుంటాం. ఎందుకనో కాలేయ జబ్బు మీదే అంతగా దృష్టి పెట్టం. గుండెపోటు మాదిరిగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాల మీదికి రాకపోవచ్చు. కిడ్నీ జబ్బు మాదిరిగా కొద్ది నెలల్లోనే తీవ్రం కాకపోవచ్చు. కానీ ఆసుపత్రుల్లో చేరి, చికిత్స తీసుకునేవారిలో కాలేయ జబ్బు బాధితులే ఎక్కువ! దీని మూలంగా మనదేశంలో ఏటా 3 లక్షల మంది మృత్యువాత పడుతుండటం విచారకరం. క్రమంగా, నెమ్మదిగా ముదురుతూ వచ్చే కాలేయజబ్బులో మొదట్లో ఎలాంటి లక్షణాలూ ఉండవు. లక్షణాలు బయటపడేసరికే జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది. పరిస్థితి చేయి దాటితే ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాబట్టి ‘వరల్డ్‌ లివర్‌ డే’ సందర్భంగా కాలేయం గురించి చర్చించుకోవటం, అవగాహన పెంచుకోవటం ఎంతైనా అవసరం.

న శరీరం లోపలి అవయవాల్లో కాలేయమే అతి పెద్దది. ఒకరకంగా దీన్ని అవిశ్రాంత కర్మాగారంతో పోల్చుకోవచ్చు. నిరంతరం ఒకే సమయంలో ఎన్నెన్నో పనులను నిర్వహిస్తుంటుంది మరి. కణజాలాలు, కండరాలు పనిచేయటానికి అవసరమైన శక్తిని అందించే గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉండటంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని గ్రహించి, తనలో దాచుకుంటుంది. ఎప్పుడైనా గ్లూకోజు మోతాదులు పడిపోయినప్పుడు వెంటనే విడుదల చేస్తుంది. మనం ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వు పదార్థాలు జీర్ణం కావటంలోనూ పాలు పంచుకుంటుంది. కాలేయం నుంచి ఉత్పత్తయ్యే పైత్యరసంతోనే కొవ్వు పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి. ప్రొటీన్ల సంశ్లేషణకూ తోడ్పడుతుంది. పోషకాల లోపం తలెత్తకుండా చూడటంలోనూ కాలేయం పాత్ర గొప్పదే. ఇదో విటమిన్ల గని కూడా. విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, విటమిన్‌ బి12 వంటి పోషకాలను పెద్దమొత్తంలో నిల్వ చేసుకుంటుంది. ఇది సుమారు 10 నెలల వరకు విటమిన్‌ ఎ.. 3-4 నెలల వరకు విటమిన్‌ డి.. ఏడాదికి పైగా విటమిన్‌ బి12ను నిల్వ చేసుకోగలదు. ఐరన్‌, రాగి వంటి ఖనిజాలనూ దాచుకుంటుంది. వీటిని అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తుంది. తినే ఆహారం, వేసుకునే మందుల వాటిల్లో ఉండే విషతుల్యాలనూ కాలేయం ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుంది. బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములనూ తొలగిస్తుంది. ఇంతటి కీలకమైంది కాబట్టే కాలేయం దెబ్బతింటే శరీరమంతా కుప్పకూలుతుంది. మంచి విషయం ఏంటంటే- ఇది మహా మొండిది కావటం. తనకు తానే కోలుకోవటం. ఒకవేళ దెబ్బతిన్నా 60-70% వరకు తిరిగి వృద్ధి చెందుతుంది. అదీ చాలా త్వరగా. ఇది ఒకరకంగా వరమే అయినా మరోరకంగా శాపం కూడా! కాలేయం బాగా దెబ్బతినేవరకూ లక్షణాలు బయటపడకపోవటానికి, జబ్బును మొదట్లో గుర్తించలేకపోవటానికి ప్రధాన కారణమిదే. అందుకే ‘వరల్డ్‌ లివర్‌ డే’ జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ‘అప్రమత్తంగా ఉండాలి. తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యాటీ లివర్‌ ఎవరికైనా రావొచ్చు’ అని నినదిస్తోంది.

తొలిదశలో లక్షణాలుండవు

కాలేయ జబ్బుల్లో ప్రధానంగా గుర్తించాల్సింది- మొదట్లో పైకి ఎలాంటి లక్షణాలు లేకపోవటం. లక్షణాలు కనిపించటం మొదలయ్యేసరికే జబ్బు బాగా ముదిరిపోయి ఉండటం. ఎందుకంటే కాలేయం 50-60% దెబ్బతిన్నా పైకేమీ తెలియదు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. తొలిదశలో కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సాధారణ ఇబ్బందులే కనిపిస్తాయి. జబ్బు ముదురుతున్నకొద్దీ కామెర్లు మొదలవుతాయి. చర్మం, కళ్లు పసుపు పచ్చగా అవుతాయి. మూత్రం ముదురు రంగులో వస్తుంది. కుడివైపు రొమ్ము కింద కొద్దిగా నొప్పి రావొచ్చు. ఇక సిరోసిస్‌లోకి మారాక కామెర్లు మరింత తీవ్రమవుతాయి. కడుపులో నీరు చేరుతూ, బాగా ఉబ్బొచ్చు (జలోదరం). కాళ్ల వాపులూ తలెత్తొచ్చు. రక్తం వాంతులు చేసుకోవచ్చు. కొందరు కోమాలోకీ వెళ్లిపోవచ్చు (హెపాటిక్‌ కోమా). సోడియం, అమోనియా తగ్గిపోవచ్చు. ఇవన్నీ ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. తొలి దశలోనే జాగ్రత్త పడితే ఇలాంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.

పరీక్షల ఆసరా

* 30, 35 ఏళ్లు దాటిన తర్వాత ఏటా ఒకసారి కాలేయ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. కనీసం రెండేళ్లకు ఒకసారైనా అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇవి తేలికైన, చవకైన పరీక్షలు. ఎలాంటి రేడియేషన్‌ ముప్పూ ఉండదు. నొప్పి ఉండదు. పరీక్షల్లో తేడాలేవైనా కనిపిస్తే తగు చికిత్స తీసుకోవాలి.

* కాలేయానికి మధుమేహం పెద్ద శత్రువు. ఊబకాయం మాదిరిగానే మధుమేహం కూడా కాలేయంలో కొవ్వు ఎక్కువ పోగుపడేలా చేస్తుంది. మధుమేహంతో కాలేయంలో కొవ్వు పోగుపడే ప్రక్రియ ఇంకాస్త ఎక్కువవుతుంది. మధుమేహానికి ఊబకాయం కూడా తోడైతే కాలేయ వైఫల్యం ముప్పు మరింత పెరుగుతుంది. కాబట్టి 35 ఏళ్లు దాటినవారంతా రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకోవాలి. గ్లూకోజు ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతే మందులు, ఇన్సులిన్‌తో గ్లూకోజు అదుపులో ఉండేలా చూసుకోవాలి.

* పెద్దవాళ్లంతా ఒకసారైనా హెపటైటిస్‌ బి, సి పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఇది ఖరీదైనదేమీ కాదు. హెపటైటిస్‌ బి పరీక్ష నెగెటివ్‌గా వస్తే టీకా తీసుకోవాలి. హెపటైటిస్‌ సికి టీకా లేదు. కానీ పాజిటివ్‌గా ఉన్నా భయపడాల్సిన పనిలేదు. దీనికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.  

నిర్ధరణ ఎలా?

కాలేయ జబ్బును గుర్తించటానికి లివర్‌ ఫంక్షన్‌ పరీక్షలు ఉపయోగపడతాయి. అయితే ఫ్యాటీ లివర్‌ వీటిల్లో అంతగా బయటపడదు. పరీక్ష ఫలితాలు అన్నీ నార్మల్‌గా ఉన్నా కూడా లోపల కాలేయం దెబ్బతిని ఉండొచ్చు. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో అయితే బాగా బయటపడుతుంది. ఇందులో లివర్‌ బాగా మెరుస్తున్నట్టుగా, తెల్లగా కనిపిస్తుంది. దీని ద్వారా సమస్యను తేలికగా, స్పష్టంగా, కచ్చితంగా గుర్తించొచ్చు. ఎలాస్టోస్కాన్‌ పరీక్షలో కాలేయం ఎంతవరకు దెబ్బతిన్నది? ఎంతవరకు గట్టిపడింది? అనేవీ తెలుస్తాయి. అవసరమైతే సీటీ, ఎమ్మారై స్కాన్‌ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తొలిదశలోనే గుర్తిస్తే మందులు, జీవనశైలి మార్పులతోనే జబ్బు నయమయ్యే అవకాశముంది.

జీవనశైలి ప్రధానం

* బరువు అదుపు: ఎత్తుకు మించిన బరువు, ఊబకాయం కాలేయానికి ఏమాత్రం మంచివి కావు. కాబట్టి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 22-23 లోపు ఉండేలా చూసుకోవాలి. అంతకు మించితే తగ్గించుకోవాల్సిందే. మనం ఎత్తును మార్చలేం. కానీ బరువును తగ్గించుకోవచ్చు. బరువును నియంత్రించుకోవటం ద్వారా బీఎంఐని తగ్గించుకోవచ్చు.

* సమతులాహారం: అన్నిరకాల పోషకాలు లభించే సమతులాహారం తినాలి. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అయితే ఎక్కువ నూనెతో వండొద్దు. వేపుళ్లకూ దూరంగా ఉండాలి. వనస్పతి వంటి ట్రాన్స్‌ఫ్యాట్లు వాడొద్దు. పిండి పదార్థాలు (అన్నం) మితంగా  తినాలి. ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు తగ్గించుకోవాలి. మాంసాహారులైతే చికెన్‌, గుడ్లు, చేపలు తీసుకోవచ్చు. మాంసం తగ్గించుకోవాలి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

* మద్యం జోలికి వెళ్లొద్దు. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.

ఇలాంటి తేలికైన, చవకైన పద్ధతులతోనే కాలేయం మరింత దెబ్బతినకుండా, సిరోసిస్‌ బారినపడకుండా చూసుకునే వీలుంది. ఇవి కాలేయ జబ్బు నివారణకూ తోడ్పడతాయి.

ఆఖరి ప్రయత్నం కాలేయ మార్పిడి

కిడ్నీ విఫలమైతే డయాలిసిస్‌తో రక్తాన్ని శుద్ధి చేసుకునే వీలుంది. కానీ కాలేయం పూర్తిగా విఫలమైతే ఎలాంటి ప్రత్యామ్నాయమూ లేదు. కాలేయ మార్పిడి ఒక్కటే శరణ్యం. ఇది ప్రాణాలు కాపాడే చికిత్స. మనిషిని చావు కోరల నుంచి బయటపడేసి తిరిగి మామూలుగా, హాయిగా జీవించేలా చేస్తుంది. దీన్ని చేయించుకున్నవారిలో 85-90% యథావిధిగా పనులు, ఉద్యోగాలు చేసుకోవటం గమనిస్తున్నాం. శస్త్రచికిత్స ఖరీదైనది కావటమే సమస్య. కానీ జబ్బు తీవ్రమై మాటిమాటికీ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకోవటంతో పోలిస్తే ఇదంత ఎక్కువేమీ కాదనే చెప్పుకోవచ్చు. పైగా ప్రాణాలనూ కాపాడుకోవచ్చు. ప్రస్తుతం చాలావరకు సన్నిహిత కుటుంబ సభ్యులు, బంధువుల వంటి సజీవ దాతల నుంచే కాలేయాన్ని తీసుకొని, మార్పిడి చేస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం దాతలైనా, గ్రహీతలైనా నాలుగు వారాల్లోనే తిరిగి మామూలు స్థితికి చేరుకుంటారు. కాలేయం తిరిగి త్వరగానే వృద్ధి చెందుతుంది. సగం వరకు కత్తిరించినా రెండు నెలల్లోనే దాదాపుగా యథాస్థితికి చేరుకుంటుంది. కాబట్టి కాలేయ మార్పిడి, అవయవ దానం గురించి భయపడాల్సిన పనిలేదు. అవగాహన పెంచుకోవాలి.

సమగ్ర చికిత్స కేంద్రాలు అవసరం

కాలేయ జబ్బుకు సమగ్రమైన చికిత్స చాలా ముఖ్యం. కాలేయం గట్టిపడినవారికి మార్పిడి అవసరపడొచ్చు. కాలేయంలో ప్రధాన రక్తనాళం మూసుకుపోయినవారికి మరింత జాగ్రత్తగా కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుంది. కాలేయ క్యాన్సర్‌ గలవారికి కొంత భాగం తొలగించాల్సి రావొచ్చు. క్యాన్సర్‌ తొలిదశలో ఉంటే రేడియో చికిత్సతోనే ఫలితం కనిపించొచ్చు. మెటబాలిక్‌ జబ్బు గలవారికి మందులతోనే నయం కావొచ్చు. కాబట్టి అన్నిరకాల కాలేయ జబ్బులకు చికిత్స చేసే సమగ్ర కేంద్రాలు అవసరం.


జబ్బు రకరకాలు

కాలేయ జబ్బు అని ఒకే పేరుతో పిలుచుకున్నా ఇందులో చాలా రకాలున్నాయి. వీటిల్లో ప్రధానమైనవి కాలేయానికి కొవ్వు పట్టటం (ఫ్యాటీ లివర్‌).. హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి ఇన్‌ఫెక్షన్లు.. విల్సన్స్‌ డిసీజ్‌ వంటి జీవక్రియల సమస్యలు. సుమారు 80% కాలేయ జబ్బుకు ఇవే కారణం. వీటికి తోడు క్యాన్సర్‌. ఇవన్నీ కాలేయాన్ని నిర్వీర్యం చేసేవే. వీటికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. 

ఫ్యాటీ లివర్‌

ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని గురించే. మనదగ్గర 40 ఏళ్లు పైబడిన వారిలో సుమారు 25% మంది దీంతో బాధపడుతున్నవారే. ఏ నలుగురికి ఎండోస్కోపీ చేసినా కనీసం ఒకరిద్దరిలో ఫ్యాటీ లివర్‌ ఉన్నట్టు తేలుతుందన్నా అతిశయోక్తి కాదు. కాలేయ మార్పిడి అవసరమవుతున్నవారిలో దాదాపు 35% మంది కాలేయ కొవ్వుతో బాధపడుతున్నవారే కావటం గమనార్హం. కాలేయ కణాల్లో అవసరానికి మించి కొవ్వు పోగుపడటం వల్ల ఫ్యాటీ లివర్‌ తలెత్తుతుంది. దీనికి ప్రధాన కారణం అస్తవ్యస్త జీవనశైలే. నూనె, కొవ్వు, పిండి పదార్థాలు ఎక్కువగా తినటం.. తగినంత శ్రమ, వ్యాయామం చేయకపోవటం వంటివన్నీ దీనికి దారితీస్తుంటాయి. శరీరానికి అవసరమైన దాని కన్నా ఎక్కువగా తినటం, శ్రమ అంతగా చేయకపోవటం వల్ల కండరాలు తగినంత గ్లూకోజును వినియోగించుకోలేవు. ఇది చాలావరకు కాలేయంలోనే నిల్వ ఉండిపోతుంది. ఇలా వినియోగం కాకుండా మిగిలిపోయిన గ్లూకోజు చివరికి కొవ్వుగా మారుతుంది. అదంతా అక్కడే పోగు పడుతుంది. ఫ్యాటీ లివర్‌కు మూలమిదే. దీన్ని నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) అంటారు. ఊబకాయులకు, మధుమేహం గలవారికి దీని ముప్పు ఎక్కువ.

* మద్యం అలవాటుతోనూ కాలేయానికి కొవ్వు పట్టొచ్చు (ఆల్కహాల్‌ రిలేటెడ్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌). మద్యం శరీరంలోంచి బయటకు వెళ్లిపోయేలా కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఈ క్రమంలో కొన్ని హానికారక పదార్థాలూ విడుదలవుతాయి. ఇవి కాలేయ కణాలను దెబ్బతీస్తాయి. అంతర్గత వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపితమవుతుంది. రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. మద్యం ఎంత ఎక్కువగా తాగితే కాలేయం అంత ఎక్కువగా దెబ్బతింటుంది. దీంతో ఫ్యాటీ లివర్‌ తలెత్తుతుంది. క్రమంగా వాపు (స్టియటో హెపటైటిస్‌) మొదలవుతుంది. చివరికి సిరోసిస్‌కు దారితీస్తుంది. మనదేశంలో మద్యం వాడకం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఇప్పుడు చిన్న వయసులోనూ ఎంతోమంది మద్యం అలవాటు చేసుకుంటున్నారు. ఇది విచారకరం.  

* కొన్ని రకాల మందులతోనూ కాలేయం ప్రభావితమై లోపల కొవ్వు పేరుకోవచ్చు. ఇన్సులిన్‌కు కణాలు సరిగా స్పందించకపోవటం (ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌) మూలంగానూ ఫ్యాటీ లివర్‌ రావొచ్చు. కారణమేదైనా కొవ్వు పరిమాణం పెరిగితే కాలేయ కణాలు సరిగా పనిచేయవు. దీంతో అవి క్రమంగా చనిపోతాయి. అక్కడ మచ్చ (స్కార్‌) లాంటిది ఏర్పడి కణజాలం దెబ్బతింటుంది. ఇది చివరికి కాలేయం గట్టి పడటానికి (సిరోసిస్‌కు) దారితీస్తుంది. ఈ దశలో కాలేయ కణజాలం తాళ్లలా పేనుకుపోయి, ముడులు పడుతుంది. బుడిపెలు, బుడిపెలుగా మారి, బల్ల మాదిరిగా అవుతుంది.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు

హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లూ కాలేయ జబ్బుకు కారణమవుతాయి. మనదేశంలో హెపటైటిస్‌ బి, సి ఉన్నా చాలామందికి ఆ విషయమే తెలియదు. ఇవి కాలేయంలో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే కణజాలం దెబ్బతిని, కాలేయం గట్టిపడొచ్చు. కాలేయ సామర్థ్యం మందగించి లివర్‌ ఫెయిల్‌ కావొచ్చు. ఇది కొందరికి క్యాన్సర్‌ కారకంగానూ పరిణమించొచ్చు.

క్యాన్సర్‌

కాలేయంలోని కణాలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందటం వల్ల కణితులు తలెత్తుతాయి. వీటిల్లో కొన్ని క్యాన్సర్లు కూడా కావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని