Heart Health: గుండె జాగ్రత్తలతో వయసూ తగ్గుముఖం

గుండె ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలతో గుండె జబ్బుల ముప్పే కాకుండా శారీరక (బయోలాజికల్‌) వయసూ తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది.

Published : 04 Jun 2024 00:20 IST

గుండె ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలతో గుండె జబ్బుల ముప్పే కాకుండా శారీరక (బయోలాజికల్‌) వయసూ తగ్గుతున్నట్టు తాజాగా బయటపడింది. శారీరక వయసు జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. కొంతవరకు జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడీ ప్రభావం చూపుతాయి. శారీరక వయసును అంచనా వేయటానికి జన్యు వ్యక్తీకరణను నియంత్రించే డీఎన్‌ఏ మెథీలేషన్‌ ప్రక్రియ మంచి మార్గం. దీన్ని దృష్టిలో పెట్టుకునే శాస్త్రవేత్తలు 5,682 మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. లైఫ్స్‌ ఎసెన్షియల్‌ 8 టూల్‌ (ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, పొగ తాగే అలవాటు, రక్తపోటు, శరీర ఎత్తు బరువు నిష్పత్తి, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు మోతాదులు) ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించి 0 నుంచి 100 వరకూ మార్కులు కేటాయించారు. అలాగే జన్యు స్వభావాన్నీ పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో ప్రతి 13 మార్కుల పెరుగుదలతో కొత్తగా గుండె జబ్బు వచ్చే ముప్పు 35%, గుండెజబ్బుతో మరణించే ముప్పు 36%, మరే కారణంతోనైనా చనిపోయే అవకాశం 29% వరకూ తగ్గుతున్నట్టు తేలింది. అదే సమయంలో జన్యుపరంగా శారీరక వయసు వేగంగా పెరిగే ముప్పు కారకం గలవారిలో లైఫ్స్‌ ఎసెన్షియల్‌ టూల్‌ మరింత ఎక్కువ ప్రభావం చూపినట్టూ బయటపడింది. దీనికి చాలావరకూ డీఎన్‌ఏ మెథీలేషనే కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి తోడ్పడే ప్రవర్తనలు డీఎన్‌ఏ మెథీలేషన్‌ ప్రక్రియను వెనక్కి తిప్పుతున్నట్టు, ఫలితంగా శారీరక వయసూ వెనక్కి మళ్లుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని