Prostate cancer: మూత్ర పరీక్షతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ గుర్తింపు

మగవారిలో క్యాన్సర్‌ మరణాలకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఒక ప్రధాన కారణం. దీన్ని ముందుగా గుర్తించటానికి రక్తంలో పీఎస్‌ఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌) మోతాదులను పరీక్షిస్తుంటారు.

Published : 09 Jul 2024 00:31 IST

గవారిలో క్యాన్సర్‌ మరణాలకు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఒక ప్రధాన కారణం. దీన్ని ముందుగా గుర్తించటానికి రక్తంలో పీఎస్‌ఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌) మోతాదులను పరీక్షిస్తుంటారు. ఇది ఎక్కువగా ఉంటే మరిన్ని పరీక్షలు అవసర పడతాయి. కొందరికి ప్రోస్టేట్‌ గ్రంథి నుంచి చిన్నముక్కను కత్తిరించి, పరీక్షిస్తుంటారు (బయాప్సీ) కూడా. ఈ పరీక్ష చాలావరకూ సురక్షితమే. కానీ కొన్నిసార్లు నొప్పి పుట్టొచ్చు. జ్వరం, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటి ఇతరత్రా దుష్ప్రభావాలకూ కారణం కావొచ్చు. అందువల్ల బయాప్సీ పరీక్షను అనవసరంగా చేయకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పదేళ్ల కిందటే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను గుర్తించేందుకు మూత్ర పరీక్షను రూపొందించారు. ఇది తొలిదశలో ఉన్న క్యాన్సర్‌ను గుర్తిస్తుంది. కానీ అవి తీవ్రమైన క్యాన్సర్లా? నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్లా? అనే తేడాలను పట్టుకోలేదు. నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్లకు పెద్దగా చికిత్స అవసరముండదు. నిశితంగా గమనిస్తూ దాని తీరుతెన్నులను పరిశీలిస్తుంటారు. ఇలాంటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే అనసరంగా బయాప్సీ చేయటం తప్పుతుంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకునే వాండర్‌బిట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూత్ర పరీక్షను తాజాగా మెరుగుపరచారు. వేలాది మంది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల జన్యువులను సేకరించి విశ్లేషించారు. చివరికి మూత్రంలో కనిపించే 18 జన్యువులను వేరుచేశారు. పీఎస్‌ఏ మోతాదులు ఎక్కువగా గలవారిలో దీన్ని పరీక్షించి చూడగా.. తీవ్ర, తక్కువ ముప్పు క్యాన్సర్ల మధ్య తేడాను తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడుతున్నట్టు తేలింది. ఇది 97% కచ్చితత్వంతో తీవ్ర క్యాన్సర్‌ను గుర్తిస్తుండటం విశేషం. కాబట్టి అనవసర బయాప్సీ పరీక్షలను తప్పించటానికిది ఎంతగానో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని